ముంబయి, ఏప్రిల్ 29: ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత తుది జట్టును జాతీయ సెలెక్టర్లు శనివారం (మే 4వ తేదీన) ముంబయిలో ఎంపిక చేయనున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంగ్లాండ్, వేల్స్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌ను జూన్ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో తలపడేందుకు భారత్ ఇప్పటికే 30 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితాను సిద్ధం చేసుకున్న విషయం విదితమే. అయితే సందీప్ పాటిల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ ప్యానల్ శనివారం ముంబయిలో సమావేశమై ఈ జాబితాలోని సగం మంది ఆటగాళ్లతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు తుది జట్టును ఎంపిక చేస్తుంది. ఈ నెల 6వ తేదీన ఎంపిక చేసిన ప్రాబబుల్స్ జాబితాలో సీనియర్ ఆటగాళ్లు వీరేంద్ర సెవాగ్, హర్భజన్ సింగ్‌లకు సెలెక్టర్లు చోటు కల్పించని విషయం తెలిసిందే. అయితే ప్రాబబుల్స్ జాబితాలో చోటు దక్కని ఆటగాళ్లకు సైతం చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు కల్పించే అవకాశం సెలెక్టర్లకు ఉందని ఐసిసి వర్గాలు తెలిపాయి. వేల్స్‌లోని కార్డ్ఫిలో గల సోఫియా గార్డెన్స్‌లో జూన్ 6వ తేదీన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే గ్రూప్-బి మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత టీమిండియా జూన్ 11వ తేదీన లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. జూన్ 15వ తేదీన బర్మింగ్‌హామ్‌లోని ఎడ్గ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో గ్రూప్-బిలో నాలుగు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగుస్తాయి. కాగా, గ్రూప్-ఎలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్ 19, 20వ తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఈ మ్యాచ్‌లు వరుసగా కెన్నింగ్టన్ ఓవల్, సోఫియా గార్డెన్స్‌లో జరుగుతాయి. సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన జట్లు జూన్ 23వ తేదీన ఎడ్గ్‌బాస్టన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకుంటాయి.
ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో
english title:
team india selections
Date:
Tuesday, April 30, 2013