పుణే, ఏప్రిల్ 29: ఐపిఎల్-6 ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పుణే వారియర్స్ జట్టు మంగళవారం సొంత గడ్డపై జరిగే లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో విషమ పరీక్షను ఎదుర్కోనుంది. పుణేలోని సుబ్రతోరాయ్ సహారా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదుచేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరుకున్న పుణే వారియర్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే వరుస విజయాలతో రాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇంతకుముందు పక్షం రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్‌ను తమ సొంత గడ్డపై 24 పరుగుల తేడాతో ఓడించిన పుణే వారియర్స్ జట్టు మంగళవారం జరిగే మ్యాచ్‌లోనూ మరోసారి పర్యాటక జట్టును ఓడించి విజయాల బాట పట్టాలని ఎదురుచూస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించిన తర్వాత పుణే వారియర్స్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో పరాజయాలను ఎదుర్కొని డీలా పడింది. ఆదివారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పుణే వారియర్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ పుణే వారియర్స్ ఆటగాళ్లు నిలకడగా రాణించలేకపోతుండటం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఈ జట్టు వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది. ఇప్పటివరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఈ జట్టు ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. చక్కటి ఫామ్‌ను ప్రదర్శిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను సైతం 14 పరుగుల తేడాతో మట్టికరిపించిన విషయం విదితమే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చక్కగా రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే విషయం.
నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరు
english title:
pune Vs chennai
Date:
Tuesday, April 30, 2013