న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: యువతకు ఉపాధి కల్పించడం తమ ప్రభుత్వ అజెండాలో అత్యధిక ప్రాధాన్య అంశమని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అయితే యువత నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పన తాను ఆశించిన దానికన్నా చాలా మందకొడిగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.‘ యువతకు ఉపాధి కల్పన‘ మా ప్రభుత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఉన్న అంశం...ప్రతి ఏటా కొత్తగా కార్మిక వర్గంలోకి వచ్చి చేరుతున్న యువతకు సరయిన ఉపాధి అవకాశాలను మనం కల్పించాల్సి ఉంది’ అని మంగళవారం ఇక్కడ 44వ భారతీయ కార్మిక మహాసభలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధాని అన్నారు.
యువకులు నైపుణ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్తూ, అయితే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడానికి తగిన సదుపాయాలను యువతకు కల్పించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని అన్నారు. 2004నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉండడం దేశంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో మన లోటుపాట్లను వెలుగులోకి తెచ్చిందని ఆయన అంటూ, పారిశ్రామిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందడానికి నైపుణ్యం కలిగిన కార్మికులు లభించకపోవడమే ఇప్పుడు ఏకైక అడ్డంకిగా ఉంటోందన్నారు. అయితే దేశంలో వౌలిక సదుపాయాల విస్తరణ తాను ఆశించిన దానికన్నా చాలా మందకొడిగా ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్ మిషన్‌ను ప్రారంభించిన తర్వాత ప్రైవేటు రంగం మరింత చురుగ్గా ఇందులో పాల్గొంటుందని ఆశిస్తున్నానని అన్నారు. పేద విద్యార్థి చదువు మధ్యలోనే ఆపేసి ఉపాధిని వెతుక్కోవడానికి బదులు నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశం ఉండాలి. అలాంటి విద్యార్థులకు తగిన నిదులు సమకూరేలా చూడడానికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసికట్టుగా కృషి చేయాలని మన్మోహన్ అన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్
english title:
u
Date:
Wednesday, February 15, 2012