విశాఖపట్నం, మే 5: వైద్యవిద్య సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్ష నగరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు ప్రధాన పట్టణాల్లో మాత్రమే నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖలో దాదాపు 6500 మంది అభ్యర్ధులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మల్కాపురం, నౌసేనాభాగ్, కేంద్రీయవిద్యాలయం-2, కేంద్రీయ విద్యాలయం ఎన్‌ఎడి, కేంద్రీయ విద్యాలయం స్టీల్‌ప్లాంట్, స్టీల్‌ప్లాంట్ డిఎవి పబ్లిక్‌స్కూల్, ఎన్‌ఎస్‌టిఎల్ రామనాథ్ సెకండరీ స్కూల్, సిబిఎం కాంపౌండ్ టింపనీస్కూల్, ఎంవిపి కాలనీ సత్యసాయి విద్యావిహార్, విశాఖవేలీ స్కూల్‌ల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు గడువుకు ముందే హాజరయ్యారు. నిబంధనలు కఠినతరం చేయడంతో విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే హాజరయ్యారు. ఆదివారం నాటి పరీక్షకు 95 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.
వైఎస్సార్ సిపిలోకి దాడి చేరికతో నష్టమే
* కొణతాల సోదరుడు లక్ష్మినారాయణ
అనకాపల్లి, మే 5: కేవలం అవకాశవాదం, స్వార్ధపరవాదంతో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న మాజీమంత్రి దాడి వీరభద్రరావు వల్ల జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగే లాభం కంటే జరిగే నష్టమే చాలా ఎక్కువని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మాజీమంత్రి కొణతాల సోదరుడు లక్ష్మీనారాయణరావు(పెదబాబు) అధ్యక్షతన ఇక్కడి రావుగోపాలరావు కళాక్షేత్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి జిల్లా నలుమూలల నుండే గాక విశాఖ అర్బన్ నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి దాడి వీరభద్రరావు చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. ఏరుదాటాక తెప్ప తగలేసే చందంగా వీరభద్రరావు రాజకీయ ప్రస్థానం సాగుతుందని, అటువంటి నేతను ఏ ఉద్ధేశ్యంతో పార్టీ వ్యవస్థాపకుడు జగన్‌మోహనరెడ్డి పార్టీలో చేర్చుకున్నారో అర్ధం కావడం లేదని పట్టణ వైఎస్సార్ సిపి నేత మందపాటి జానకిరామరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిషోర్, చోడవరం మహిళా నేత డాక్టర్ నీలం శారద ప్రశ్నించారు. వ్యక్తిత్వం లేనివారిని పార్టీలోకి తీసుకోవడం వలనే అధికారంలోకి రావాల్సిన ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా ఉనికినే కోల్పోయిందని, అదే పరిస్థితి తలెత్తకుండా వైఎస్సార్ సిపి నేత జగన్‌మోహన రెడ్డి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డాక్టర్ శారద సలహా ఇచ్చారు. పార్టీలోకి నేతలను తీసుకునే ముందు వారి గుణగణాలను, వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సమావేశానికి నేతృత్వం వహించిన మాజీ మంత్రి కొణతాల సోదరుడు పెదబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటిమంత్రి హోదాలో ఉన్న వీరభద్రరావు వర్తకసంఘం సంస్థలను సీజ్ చేయిస్తే వాటిని తెరిపించడం కోసం కొణతాల ఉద్యమాలు సాగించారన్నారు. ఆ విధంగా ఉద్యమాలతోనే రాజకీయ అరంగ్రేటం చేసి వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు కొణతాల సాగించారన్నారు. పదవుల కోసం ఏనాడు ఆయన పాకులాడలేదని, ఎంపిగా ఉండగా పలుసార్లు కేంద్ర మంత్రి పదవులు సైతం దక్కే పరిస్థితి వస్తే తృణప్రాయంగా వదిలిపెట్టిన మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. మహాసముద్రం లాంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్వార్ధంతో వచ్చిన వీరభద్రరావు వంటి నేతలు అదేవిధంగా పోతారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కొణతాల ఆయన అనుచరులు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఈ పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మునగపాక మండల నాయకుడు ఆడారి అచ్చింనాయుడు, మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు, మాజీ జెడ్పీటిసిలు మళ్ల సంజీవరావు, బొడ్డేడ సూర్యనారాయణ, యలమంచిలి నేత బోదెపుగోవింద, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ గోపాలరాజు, వైఎస్సార్ యువజన కాంగ్రెస్ నాయకుడు బుద్ధ రాజేష్ పాల్గొన్నారు.
మంత్రి గంటా కారును
అడ్డుకున్న క్రెబ్స్ కార్మికులు
కశింకోట, మే 5: జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుకు మండలంలోని బయ్యవరంలో తీవ్ర పరాభవం ఎదురైంది. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఆదివారం విచ్చేసిన ఆయన బయ్యవరంలోకి వస్తుండగా క్రెబ్స్ కార్మికులు మంత్రి కాన్వాయ్‌కు అడ్డంగా నిలబడి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మంత్రి గంటా ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తమకు న్యాయం చేయలేదని, కార్మికులు పొట్టకొట్టిన నేత గంటా అని, గంటా డౌన్,డౌన్ అని నినాదాలు చేశారు. మంత్రి గంటాపైకి క్రెబ్స్ కార్మికులు వెళ్లగా, అక్కడే ఉన్న పోలీసులు, కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై కార్మిక నాయకులు శ్రీనివాసరావు, తగరంపూడి కృష్ణ, ఈశ్వరరావు, గంటా గంగాధర్ మాట్లాడుతూ తాము గత మూడు నెలలు నుండి దీక్షలు చేస్తుండగా కనీసం తమను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తాము పిల్లాపాపలతో ఏవిధంగా బతకాలని వారు ప్రశ్నించారు. నిరాహారదీక్షలు చేసినా మంత్రి కనీసం సమస్య పరిష్కారానికి కృషి చేయకపోవడం తమను భాద కలిగించిందన్నారు. మంత్రి గంటా కూడా యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని అనే ఆవేదన తమలో వచ్చిందన్నారు. ఇప్పటికైనా మంత్రి తమకు న్యాయం చేసి తమ జీతాలను మంజూరు చేయించాలని వారు కోరారు. దీనిపై మంత్రి గంటా స్పందిస్తూ కార్మికుల సమస్యలను తాను యాజమాన్యంతో చర్చించి వెంటనే పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. దీంతో క్రెబ్స్‌కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, క్రెబ్స్ కార్మికులు, స్థానికులు పాల్గొన్నారు.