మునగపాక, మే 5: సహకార సంఘం ద్వారా 2013-14 సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు అందజేయనున్నట్లు డిసిసిబి చైర్మన్ ఉప్పలపాటి సుకుమార వర్మ తెలిపారు. బ్యాంకు పాలకవర్గంలో నిర్ణయించి ఈమేరకు ఆప్కాబ్ సంస్థకు ప్రతిపాదనలు పంపించామన్నారు. మునగపాకలో ఆదివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఎసిఎస్‌ల ద్వారా లక్షరూపాయల వరకు వడ్డీలేని రుణం, 50 వేల రూపాయలు పావలావడ్డీతో రుణాలు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లో డిసిసిబి ద్వారా గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. జిల్లాలో 25 సొసైటీలను ఎంపిక చేసి మల్టీపర్పస్ పద్ధతిలో నిత్యావసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేసేందుకు నిర్ణయించామని ఆయన తెలిపారు. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు తక్కువ వడ్డీకి రుణాలు పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకోట సత్యనారాయణ, మాజీ ఎంపిటిసి పొలిమేర గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంటకోట రాము, బొద్దపుశ్రీరామ్మూర్తి, సూరిశెట్టి రాము, శరగడం శ్రీనివాసరావు, బోజా శ్రీనివాసరావు, పిట్టా మంగరెడ్డి, కాండ్రేగుల సంజీవి, ఎవి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫ్యాక్టరీ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే మేలు
* వైఎస్సార్ సిపి నాయకుడు బలిరెడ్డి
చోడవరం, మే 5: గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ఫ్యాక్టరీకి, రైతాంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు బలిరెడ్డి సత్యారావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆదివారం గోవాడ సుగర్స్ ఎండిని కలసి సభ్యరైతుల సమస్యలను వివరించేందుకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పదవికి రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతుందని, ఆ పదవికోసం పైరవీలు జోరుగా సాగుతున్నాయని అన్నారు. ఈ దశలో కోట్లాది రూపాయలు ఎన్నికల ఖర్చుకు వెచ్చించి చైర్మన్ పదవికి వచ్చిన వారు చిత్తశుద్దితో పనులు నిర్వహించలేరనేది తన అభిప్రాయమన్నా రు. ఇందుకోసం ఎన్నికల ఖర్చు తగ్గించుకోవడంతోపాటు పాలకవర్గపరంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొకుండా ఉం డేందుకు వీలుగా ప్రధాన రాజకీయ పక్షాల నుండి డైరెక్టర్లను ఎంపిక చేసుకుని చైర్మన్ అభ్యర్థిని లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయించుకుంటే తగిన ప్రయోజనం ఉంటుందన్నది తన అభిప్రాయమన్నారు. ఫ్యాక్టరీ చైర్మన్ పదవికోసం ఆశించిన వారు కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్నికల అనంతరం ఆర్థిక కుంభకోణాల్లో చిక్కుకునే కన్నా ఏకగ్రీవం చేసుకుంటే ఇటు సభ్యరైతులకు ఫ్యాక్టరీకి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్నికల్లో పోటీచేయాలన్నదే తమ పార్టీ నిర్ణయమన్నారు. ఈ విషయంలో తాను ఈ ప్రాంత రైతుగా అభిప్రాయపడుతున్నానన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలన్నది వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు డాక్టర్ బండారు సత్యనారాయణ, వెంపలి ఆనందీశ్వరరావు, అల్లం రామఅప్పారావు, కాండ్రేగుల డేవిడ్, తంగుడుబిల్లి జగ్గారావు పాల్గొన్నారు.
టిడిపి బల నిరూపణకే రేపు సమావేశం
అనకాపల్లి , మే 5: మాజీమంత్రి దాడి వీరభద్రరావు దేశం పార్టీ వీడినంత మాత్రాన అనకాపల్లిలో పార్టీ బలానికి ఢోకా లేదని, ఈ ప్రభావం వలన పార్టీ మరింత బలపడిందని రుజువు చేసేందుకు ఈనెల 7వ తేదీన స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో జరిగే అనకాపల్లి అసెంబ్లీ దేశం విస్తృతస్థాయి సమావేశం రుజువు చేయనుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. స్థానిక ఎపిటిఎఫ్ భవనంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో పట్టణ దేశం అధ్యక్షుడు బుద్ధ నాజగదీష్, తెలుగు యువత అధ్యక్షుడు మళ్ల సురేంద్ర, జిల్లా దేశం ఉపాధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ పై వి ధంగా పేర్కొన్నారు. మాజీ మంత్రి వీరభద్రరావు ఆయన తనయుడు రత్నాకర్ పార్టీకి రాజీనామా చేయడం కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తికి తావిచ్చిందన్నారు. నేతలు వెళ్లినంత మాత్రాన అనకాపల్లి అసెంబ్లీలో దేశం పార్టీ బలానికి ఢోకా ఉండదని, ఈనెల 7న ఉదయం స్థానిక మున్సిపల్ స్టేడియం రావుగోపాలరావు కళాక్షేత్రం వరకు ర్యాలీ జరుగుతుందని, అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి అసెంబ్లీ నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనూహ్య సంఖ్యలో విచ్చేయాలని వారు కోరారు. అనకాపల్లి అసెంబ్లీలో మాజీమంత్రి దాడి వెంట ఎంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లిపోయారు. ఎంతమంది కొనసాగుతున్నారనే విషయాన్ని రుజువుచేసేందుకు ఈ సభ వేదిక కాగలదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌టియుసి నాయకుడు గుత్తా ప్రభాకరచౌదరి, మాజీ ఎంపిపి రొంగలి శ్రీరామ్మూర్తి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు బొలిశెట్టి శ్రీనివాసరావు, కొణతాల శ్రీనివాసరావు, యల్లంకి సత్తిబాబు, పొలిమేర నాయుడు, పిట్ల రాజు పాల్గొన్నారు.
పదవి లేకపోతే పార్టీలో ఉండలేరా?
- దాడికి టిడిపి నాయకుల ప్రశ్న
పాయకరావుపేట, మే 5: పదవి లేకపోతే పార్టీలో ఉండలేరా? అని మాజీ మంత్రి దాడి వీరభద్రరావును పాయకరావుపేట తెలుగుదేశం నాయకులు గొ ర్రెల రాజబాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, మ జ్జూరి నారాయణరావు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాడి వీరభద్రరావు పార్టీకి ఎంతో ద్రోహం చేశారని అన్నారు. ఆదివారం నాయకులు స్దానిక విలేఖర్లతో మాట్లాడుతూ పార్టీకి దాడి వీరభద్రారావు ఎనలేని సేవలు చేశారన్నారు. ప్రతి కార్యకర్తకు ఆయన మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. దాడి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఆయనకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. దాడి రత్నాకర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారన్నారు.