ముంబయి, మే 5: దేశీయ స్టాక్‌మార్కెట్లలో గడిచినవారం జరిగిన ట్రేడింగ్‌లో మార్కెట్ విలువ ప్రకారం టాప్-10 జాబితాలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ నాలుగో స్థానానికి పడిపోయింది. ఐటిసి షేర్లు మదుపర్లను అమితంగా ఆకట్టుకోవడంతో ఆ సంస్థ మూడో స్థానానికి ఎగబాకింది. ఐటి దిగ్గజం టిసిఎస్ మొదటి స్థానంలో, ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ సంస్థ ఒఎన్‌జిసి రెండో స్థానంలో ఉండగా, ఐదో స్థానంలో ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక సంస్థ కోల్ ఇండియా నిలిచింది. మొత్తంగా గమనిస్తే ఈసారి టాప్-10లో నిలిచిన సంస్థల్లో గతంతో పోల్చితే ఐదు సంస్థల మార్కెట్ విలువ పెరగగా, ఐదు సంస్థల విలువ క్షీణించింది. పెరిగిన ఐదు సంస్థలు 30,978 కోట్ల రూపాయలను అందుపుచ్చుకోగా, క్షీణించిన ఐదు సంస్థలు 10,489 కోట్ల రూపాయలను కోల్పోయాయి. కాగా, అంతకుముందువారం మదుపర్లను ఆకట్టుకోలేకపోయిన టిసిఎస్ షేర్లు గడిచినవారం విశేషంగా ఆకర్షించాయి.
ఈ క్రమంలోనే టిసిఎస్ షేర్ల విలువ ఏకంగా 9,894 కోట్ల రూపాయలు పెరగడంతో ఆ సంస్థ మొత్తం మార్కెట్ విలువ 2,77,680 కోట్ల రూపాయలకు చేరింది. ఇదే సమయంలో ఐటిసి షేర్లు కూడా దాదాపు అంతే స్థాయిలో 9,325 కోట్ల రూపాయలు పెరిగి 2,61,353 కోట్ల రూపాయలకు చేరడంతో అంతకుముందువారం మూడో స్థానంలో ఉన్న రిలయన్స్‌ను వెనక్కినెట్టి ఈసారి ఆ స్థానంలోకి ఐటిసి ప్రవేశించింది. ఇక గడిచినవారం టిసిఎస్, ఐటిసిల తర్వాత మార్కెట్‌లో అత్యధిక లాభాలను పొందిన సంస్థ ఐటి రంగానికి చెందిన ఇన్ఫోసిస్. అంతకుముందువారం టాప్-10 జాబితాలో లేని ఈ సంస్థ క్రిందటివారం 5,484 కోట్ల రూపాయలను అందిపుచ్చుకుని 1,32,522 కోట్ల రూపాయలకు ఎగిసింది. ఫలితంగా ఈసారి టాప్-10లో ఎనిమిదో స్థానానికి చేరింది. అలాగే ఎన్‌టిపిసి విలువ 3,670 కోట్ల రూపాయలు పెరగడంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 1,31,309 కోట్ల రూపాయలకు, రిలయన్స్ 2,605 కోట్ల రూపాయలు పెంచుకుని 2,59,245 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇదిలావుంటే అంతకుముందు వారం మాదిరిగానే గడిచినవారం కూడా ఎస్‌బిఐ మార్కెట్ విలువ తగ్గింది.
ఈసారి 4,899 కోట్ల రూపాయలు కోల్పోయిన ఆ సంస్థ షేర్ల విలువ ప్రస్తుతం 1,48,740 కోట్ల రూపాయల వద్దకు పడిపోయింది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ 2,723 కోట్ల రూపాయలు కరిగిపోయి 1,31,938 కోట్ల రూపాయలకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల విలువ 1,926 కోట్ల రూపాయలు దిగి 1,61,945 కోట్ల రూపాయలకు, కోల్ ఇండియా విలువ 727 కోట్ల రూపాయలు క్షీణించి 2,00,828 కోట్ల రూపాయలకు దిగజారింది. ఇక ఒఎన్‌జిసి అంతకుముందులాగే ఈసారి కూడా మార్కెట్ విలువను కోల్పోయింది. తాజాగా 214 కోట్ల రూపాయలు పడిపోయిన ఈ సంస్థ షేర్ల విలువ..ఇప్పుడు 2,77,283 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇక ఈసారి టాప్-10లో ఆయా సంస్థల మార్కెట్ విలువ ప్రకారం టిసిఎస్ తొలి స్థానంలో, ఒఎన్‌జిసి రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఐటిసి, రిలయన్స్, కోల్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఎన్‌టిపిసి సంస్థలున్నాయి.
యునినార్ విక్రేతలుగా
ఆటో డ్రైవర్లు, పాలవర్తకులు
న్యూఢిల్లీ, మే 5: దేశంలో మొబైల్ రంగ సేవలలో నెలకొన్న పోటీని తట్టుకోడానికి, అమ్మకాలు ముమ్మరం చేయడానికి కొత్త దారులు వెతుకుతున్నాయి. దీనిలో భాగంగా యునినార్ కంపెనీ దేశంలో నాలుగో స్థానాన్ని ఆక్రమించడానికి వీలుగా సిమ్‌కార్డులు, రీచార్జి కూపన్లు ఇంటిటికీ అందించేందుకు పాలవ్యాపారులు, వార్తాపత్రికలు అందించే వారిని, ఆటో రిక్షా డ్రైవర్లను కూడా వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని యునినార్ సిఇవో యోగేష్ మాలిక్ తెలిపారు. 2013 సంవత్సరాంతానికి బ్రేక్ ఈవెన్ కోసం ప్రయోగాత్మకంగా పూణెలో వినియోగదారులను చేర్చేందుకు, రీచార్జి వోచర్లు అమ్మేందుకు ఆటో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చింది. 10 మందితో మొదలైన ఈ కార్యక్రమంలో 40కి చేరుతుందని, దీని వల్ల ఆటో డ్రైవరు 50-60 మందిని చేర్పిస్తే నెలకు వారికి సుమారు 2,500 వరకు ఆదాయం లభిస్తోందని ఆయన వెల్లడించారు. మహారాష్టల్రో రానున్న 6 నెలల్లో 1000 ఆటో రీచార్జి వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.