న్యూఢిల్లీ, మే 5: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికిగానూ కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, మార్చి నెలకుగానూ విడుదలయ్యే పారిశ్రామిక ప్రగతి (ఐఐపి) గణాంకాలపైనే ప్రధానంగా ఈవారం మార్కెట్ సరళి ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సితోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎన్‌టిపిసి, రిలయన్స్ కమ్యునికేషన్స్, రాన్‌బాక్సీ లాబొరేటరీస్ సంస్థలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో చేసిన వ్యాపారానికి సాధించిన లాభనష్టాలను ఈవారం వెల్లడించనున్నాయి. అలాగే మార్చి నెలలో పారిశ్రామిక ప్రగతి ఏవిధంగా ఉందనేదానికి సంబంధించిన గణాంకాలను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో రానున్న సెషన్లలో ఒకవేళ నిఫ్టీ సూచీ 5,950 కంటే దిగువకు పడిపోతే అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకునే అవకాశాలున్నాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. అయితే స్థూలంగా గమనించినట్లైతే మార్కెట్ సరళి ఆశాజనకంగానే ఉంటుందని చెబుతున్నా..మదుపర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. ఈ క్రమంలోనే ఈవారం దేశీయ స్టాక్‌మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల పోకడ, నాలుగో త్రైమాసికానికిగానూ కార్పొరేట్ సంస్థలు విడుదల చేసే ఆర్థిక ఫలితాల ప్రభావం ఉంటుందని బొనాంజా పోర్ట్ఫోలియో లిమిటెడ్‌కు చెందిన సీనియర్ విశే్లషకులు నిధి సరస్వత్ తెలిపారు. గతవారం జరిపిన వార్షిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్ల (రెపో, రివర్స్ రెపో)ను 25 బేస్ పాయింట్ల మేర తగ్గించగా, ద్రవ్యోల్బణంపై నెలకొన్న ఆందోళనల మధ్య నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని యధాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావం అత్యధికంగా ఉండే బ్యాంకింగ్, ఆటో, నిర్మాణ రంగ షేర్లలో భారీ కరెక్షన్ జరిగే వీలుందని ఆదిత్యా ట్రేడింగ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకులు వికాస్ జైన్ అన్నారు. ఆర్‌బిఐ సమీక్ష తర్వాత ఈ రంగాల షేర్లు ఒడిదుడుకులకు గురై నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదే పరిస్థితి ఈవారం కూడా ఉండే వీలుందని జైన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. జూన్ సమీక్షలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే సంకేతాలు ఆర్‌బిఐ నుంచి వెలువడుతుండటం కూడా ఇందుకు దోహదపడనుందని ఆయన అన్నారు. ఇదిలావుంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లో ఈ శనివారం (మే 11న) ఓ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించడంలో భాగంగా ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించనున్నారు.
*ఈవారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా
english title:
k
Date:
Monday, May 6, 2013