ముంబయి, మే 5: గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో శాఖల ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేసిన బ్యాంకులు మరికొన్నింటిని ఏర్పాటు చేసినా వాటిని వచ్చే ఏడాది లక్ష్యంలో చేర్చుకునే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ కల్పించింది. ప్రస్తుతం వార్షిక శాఖల ఏర్పాటు ప్రణాళిక ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మించి గ్రామీణ ప్రాంతాలలో కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. కానీ ఆర్‌బిఐ ఈ నియమ నిబంధనలను శుక్రవారం విడుదల చేసిన వార్షిక పరపతి విధానంలో సడలించింది. 25 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన బ్యాంకులు మరిన్ని శాఖలను ఏర్పాటు చేసినా వాటిని రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో భాగంగా పరిగణించవచ్చు. ఈ వెసులుబాటు రానున్న రెండేళ్ల వరకు ఉంటుంది. బ్యాంక్‌లు లేని గ్రామీణ ప్రాంతాలలో శాఖల ఏర్పాటు గురించి ఆర్‌బిఐ జూన్ నెలాఖరు నాటికి సమగ్ర మార్గదర్శక సూత్రాలను విడుదల చేయనున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. బ్యాంక్‌లు లేని ప్రాంతాలలో ఆర్థిక సేవలు అందే విధంగా ఆర్‌బిఐ ఈ మేరకు నియమ నిబంధనలను సడలించింది.
పట్టణ ప్రాంతాలకు
ఎల్‌బిఎస్ పథకం విస్తరణ
పట్టణ ప్రాంతాలలో కూడా ఇంకా వేలాది మంది బ్యాంకు సేవలు సక్రమంగా వినియోగించడం లేదని కనుక మెట్రోపాలిటన్ ప్రాంతాల శివారు జిల్లాలకు ‘లీడ్ బ్యాంక్ పథకం’(ఎల్‌బిఎస్) వర్తింప చేయాల్సిందిగా బ్యాంక్‌లను ఆర్‌బిఐ కోరింది. 1969లో లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా బ్యాంక్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రత్యక్ష లబ్ది బదిలీ పథకం’(డిబిటి) అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆర్‌బిఐ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వార్షిక పరపతి విధానంలో పలు ఆర్థిక సడలింపులు ప్రకటించింది. ప్రస్తుతం ఎల్‌బిఎస్ పథకం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తోంది. మెట్రోపాలిటన్ పరిధిలోకి వచ్చే జిల్లాలకు వర్తించదు. గ్రామీణ ప్రాంతాలలోనే కాకుండా పట్టణ శివారు, మెట్రోపాలిటన్ శివారులలో కూడా మధ్యతరగతి ప్రజలు ఉన్నందున ఎల్‌బిఎస్ పథకం విస్తరించినట్లు ఆర్‌బిఐ తెలియచేసింది. అంతేకాక ‘ఆధార్’ ఆధారిత బ్యాంక్ ఖాతాలను ప్రారంభించేందుకు స్థానిక అధికారుల సహకారంతో ప్రత్యేక మేళాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్‌బిఐ సూచించింది.
* ఆర్‌బిఐ నిర్ణయం
english title:
m
Date:
Monday, May 6, 2013