న్యూఢిల్లీ, మే 5: దేశంలో 2016-17 సంవత్సరం నాటికి సుమారు 315 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యి ఇబ్బందులు అధిగమిస్తామని, అందుకు సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం తెలిపారు. ‘పెట్టుబడులు వస్తున్నాయి. కొన్ని సమస్యలను అధిగమిస్తే పెట్టుబడులను వినియోగించుకోవచ్చు’ అని ఆయన అన్నారు. విద్యుత్ రంగంలో ప్రధానంగా ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, పంపిణీ, లాస్ట్‌మైల్ సొల్యూషన్స్ విభాగాలలో సమస్యలున్నాయని ఆయన అన్నారు. అయితే వీటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని చెప్పారు. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి 1,625 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని, 1991లో 65,000 మెగావాట్లు, 2012-13 నాటికి 228,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యానికి చేరుకుందని చెప్పారు. 12వ పంచవర్షప్రణాళికాంతానికి 315,000 మెగావాట్ల (315 గిగావాట్లు) ఉత్పత్తి లక్ష్యమని అన్నారు. ఏడాదికి 17 గిగావాట్ల వంతున విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగా, ఈ ప్రణాళికాకాలం తొలి ఏడాదే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని ఆయన తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి మెగావాట్‌కు 5 కోట్లు, హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి 8.5 కోట్లు, న్యూక్లియర్ విద్యుత్‌కు 11 కోట్లు అవసరమవుతాయన్నారు.
జ్యోతిరాదిత్య సింధియా