న్యూఢిల్లీ, మే 5: ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌కు జీతాల భారం విపరీతంగా పెరిగింది. ఆ సంస్థకు వస్తున్న ఆదాయంలో దాదాపు సగం సిబ్బంది వేతనాలకే ఖర్చవుతుండగా, సుమారు 5వేల కోట్ల రూపాయలు పనిలేక ఖాళీగా ఉన్న లక్ష మందికి నెల నెలా జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. 2011-12 సంవత్సరంలో బిఎస్‌ఎన్‌ఎల్ జీతాల బిల్లు 13,406 కోట్ల రూపాయలకు చేరింది. 2007-08 సంవత్సరంలో జీతాలకు 8,809 కోట్ల రూపాయలు ఆ సంస్థ చెల్లించింది. ఇది అప్పటి ఆదాయంలో 23 శాతం. పార్లమెంటరీ సలహా సంఘం వెల్లడించిన ఈ వివరాల ప్రకారం, ఒక వైపు సంస్థ రాబడి తగ్గిపోతుండగా, మరో వైపు జీతాల భారం పెరిగిపోతూనే ఉంది. 2007-08 సంవత్సరంలో సంస్థకు 38,053 కోట్ల రూపాయలు ఆదాయం లభించగా, 2011-12 సంవత్సరంలో ఇది క్షీణించి 27,934 కోట్ల రూపాయలకు చేరింది. పబ్లిక్ అండర్‌టేకింగ్ నివేదిక ప్రకారం, 2011-12 సంవత్సరంలో సిబ్బంది వేతనాలు 13,406 కోట్ల రూపాయలు కాగా ఇది సంస్థకు వచ్చే ఆదాయంలో సగం ఉంది. ప్రైవేట్ కంపెనీల ఆదాయంలో సిబ్బంది వేతనాల ఖర్చు 5-10శాతం మించదని ఆ నివేదిక పేర్కొంది. ఈ జీతాల భారాన్ని దృష్టిలో ఉంచుకుని పిట్రోడా కమిటీ అదనంగా ఉన్న ఈ లక్ష మంది సిబ్బందిని ఇంటికి పంపాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది. అందుకోసం స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) పద్దతిని అనుసరించాల్సిందిగా సూచించింది. లేకుంటే ఆర్థిక ఇబ్బందులు ఆ సంస్థకు తప్పవని కూడా ఆ కమిటీ హెచ్చరించింది. లక్ష మందికి విఆర్‌ఎస్ అమలు చేయాలంటే సంస్థకు సుమారు 18,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. కనుక ఆ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని బిఎస్‌ఎన్‌ఎల్ కోరింది. ‘విఆర్‌ఎస్ ఇవ్వడమనేదే పెద్ద సమస్య. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలి. బిఎస్‌ఎన్‌ఎల్ మనుగడకు సిబ్బందిని తగ్గించడమే మార్గం. అయితే విఆర్‌ఎస్ పథకాన్ని ఎలా అమలు చేయాలన్న విషయం ప్రభుత్వం నిర్ణయించాలి’ అని బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి ఆర్‌కె ఉపాధ్యాయ అన్నారు. ఇలా ఉండగా ఈ అదనపు సిబ్బంది సంస్థకు భారమే కాక వారు ప్రస్తుత పరిస్థితులకు తగిన రీతిలో సేవలు అందించే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కారని పిట్రోడా కమిటీ తన నివేదికలో పేర్కొంది. పైవేటు టెలికాం సంస్థలు అనుసరిస్తున్న అధునాతన విధానాలతో పోలిస్తే ఈ సిబ్బందికి తగిన పరిజ్ఞానం లేదని వెల్లడించింది. వారి వేతనాలు, అలవెన్స్‌లకు తగిన పని చేయలేరని స్పష్టం చేసింది. 2000 సంవత్సరంలో బిఎస్‌ఎన్‌ఎల్‌లో 3.97లక్షల మంది ఉద్యోగులుండగా మార్చి 31,2012 నాటికి 2,58 లక్షల మంది ఉన్నారు. గత ఐదు సంవత్సరాలలో 841 మంది ఎగ్జిక్యుటివ్‌లు, 56వేల మంది సిబ్బంది విఆర్‌ఎస్ తీసుకున్నారు. 27మంది రాజీనామాలు చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు 2007-08లో సంస్థకు 3,009 కోట్ల రూపాయల నికరలాభం ఉండగా, 2011-12 నాటికి సంస్థ నష్టాల పాలై ఇది 8,851 కోట్లకు పెరిగింది.
*బిఎస్‌ఎన్‌ఎల్ ఆదాయం 28 వేల కోట్లు * వేతనాలు 13వేల కోట్లు * సగం ఆదాయం సిబ్బందికే
english title:
t
Date:
Monday, May 6, 2013