హైదరాబాద్, మే 6: ధిక్కార ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 13, 14 తేదీల్లో విచారణ చేపట్టనున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆ సందర్భంగా ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు ‘విప్’ ధిక్కరించి, అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినందున, వారి సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్, టిడిపిలు స్పీకర్ మనోహర్ వద్ద పిటిషన్ దాఖలు చేశాయి. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ సమయంలో టిడిపి తటస్థ వైఖరిని అవలంభించగా, ధిక్కార ఎమ్మెల్యేలు తీర్మానాన్ని బలపరిచారు. దీంతో 9 మంది టిడిపి ఎమ్మెల్యేలపై, 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు స్పీకర్ మనోహర్ వారికి నోటీసులు జారీ చేయగా, గడువులోగా ఇద్దరే స్పందించారు.
తాము బహిరంగంగా, స్పీకర్ సమక్షంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందున ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమపై అనర్హత వేటు వేయాల్సిందిగా ధిక్కార ఎమ్మెల్యేలు కోరారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది కాలమే మిగిలి ఉన్నందున, ఉప ఎన్నికలు జరగకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో అన్ని పార్టీలూ ఉన్నాయి. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువు ఉన్నట్లయితే ఉప ఎన్నికలు నిర్వహించబోమని ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టడం, పిటిషనర్లు, కౌంటర్ పిటిషనర్ల వాదనలు విని స్పీకర్ నిర్ణయం తీసుకునేలోగా సార్వత్రిక ఎన్నికల గడువు సంవత్సరం పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు వారిపై వేటు వేసినా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.
ధిక్కార ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను
english title:
mla's
Date:
Tuesday, May 7, 2013