హైదరాబాద్, మే 6: నెల్లూరు జిల్లాలోని వివిధ నీటి పథకాల పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, భారీ నీటిపారుదలశాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక లేక్‌వ్యూ అతిధి గృహంలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో వారు సమీక్షించారు. ప్రాజెక్టుల విషయంలో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతులపై కూడా చర్చించారు. 1239 ఎకరాల భూమిని తెలుగుగంగకు సేకరించాల్సి ఉంది. అలాగే సోమశిల, కావలి కాలువ, పెన్నా డెల్టా ఆధునీకరణ పనులపై కూడా చర్చించారు. సూళ్లూరుపేట రైతులకు సాగునీరు అందించే కార్యక్రమం, నాయుడుపేటకు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
* ఇద్దరు మృతి: 16 మందికి గాయాలు
మర్రిపాడు, మే 6: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 16మందికి గాయాలయ్యాయి. కడప ఆర్టీసీ డిపోకు చెందిన నెల్లూరు బైపాస్‌రైడర్ సర్వీసు నెల్లూరు వైపునకు వస్తుండగా నెల్లూరు ముంబయి రహదారిపై మరియవరం వద్ద నెల్లూరు నుంచి బద్వేల్ వైపునకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ముందుసీట్లో కూర్చున్న రంపచోటి ఓబులేష్ (43) బస్సులో ఇరుక్కుని మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు కండక్టర్ ఆకుల నాగరాజు (53)తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 16 మందికి గాయాలయ్యాయి. బొగ్గు లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని ఆర్టీసీ డ్రైవర్ గౌస్‌పీరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కొండా లక్ష్మణ్ విగ్రహం పెట్టాలి
* సిఎంను కోరిన అఖిలపక్షం
హైదరాబాద్, మే 6: బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తెచ్చిన కొండాలక్ష్మన్ బాబుజీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని అఖిల పక్షం నేతలు సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిశారు. సెప్టెంబర్ 25న కొండా జయంతి రోజు నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎం భేటీ అనంతరం వారు విలేఖరులతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేశవరావు, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, టిడిపినేత మండవ వేంకటేశ్వరరావు, జస్టిస్ ఎంఎన్ రావు, తెరాస ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, నాగం జనార్దనరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలను కాపాడిన వ్యక్తిగా కొండాలక్ష్మన్ బాబుజీకి పేరు నిలిచిపోయిందని అన్నారు. కొండాలక్ష్మన్ అంత్యక్రియలు జరిగిన జలదృశ్యం వద్ద మ్యూజయంతో పాటు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిఎంకు సూచించామన్నారు. సచివాలయ సమీపంలో ఆయన పేరుతో గార్డెన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తాము సూచించడం జరిగిందన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో కొండాలక్ష్మన్ బాబుజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలని తాము డిమాండ్ చేశామన్నారు.
రైతులను కూలీలుగా మార్చొద్దు: టిడిపి
హైదరాబాద్, మే 6:కార్పొరేట్ వ్యవసాయం పేరుతో రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని సహించేది లేదని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు హెచ్చరించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రైతులు కోరుకుంటున్నారు రైతులను బహుళజాతి కంపెనీలకు కూలీలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలు కాంగ్రెస్ పాలకులకు పట్టడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే 25వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కాంగ్రెస్ అస్తవ్యస్థ విధానాలే దీనికి కారణమని అన్నారు. వ్యవసాయ రంగం స్థితిగతులు మెరుగు పరచడానికి ఎన్నో కమిటీలు నివేదికలు ఇచ్చాయని, ప్రభుత్వం మాత్రం వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. కాగా మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి శైలజానాథ్‌పై చర్య తీసుకోవాలని కోడెల డిమాండ్ చేశారు.
ఛానల్ బ్లాక్‌మెయిలింగ్
* పంచవటి పీఠాధిపతి కాశీనాథ్ బాబా
న్యాల్‌కల్, మే 6: ప్రకటనలు (యాడ్స్) ఇవ్వని కారణంగా తన పట్ల ఓ టివి చానల్ వారు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని పంచవటి పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆరోపించారు. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలంలోని రాఘవపూర్ పంచవటి క్షేత్రంలో పీఠాధిపతి కాశీనాథ్‌బాబా సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ ఆ చానల్ దుష్ప్రచారాన్ని ఖండించారు. ప్రకటనలు ఇవ్వనందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తనపట్ల తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. తనపై ఏమైనా ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. తాను చేస్తున్నది తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఆయన అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి నష్టపరిహారం కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు.
రెండు రోజుల్లో అల్పపీడనం
విశాఖపట్నం, మే 6: దక్షిణ బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలియచేసింది. దీని గమనాన్ని బట్టి రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉంటాయని తెలిపింది. కాగా, మహారాష్ట్ర నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావం వలన రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, సోమవారం తెలంగాణ, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా, ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
కె గంగవరం, మే 6: తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం పామర్రు-యండగండి రహదారిలో హెరిటేజ్ డెయిరీ సంస్థకు చెందిన చెరువులో మునిగి, సోమవారం ఇద్దరులు మృతిచెందారు. గేదెలు మేపడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువులోకి దిగి మృతిచెందారు. మురపోక వెంకట సాయి అనిల్‌కుమార్ (12), సింగవరపు కరేరావుకుమార్ (10) గేదెలు మేపేందుకు పొలాలకు వెళ్లారు. గేదె హెరిటేజ్ డెయిరీ సంస్థ చెరువులోకి దిగింది. వారిద్దరూ చెరువులోనికి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగిపోయారు. డెయిరీ ఉద్యోగులు చెరువులోకి దిగి, చిన్నారులను వెలికితీశారు. బంధువులు, గ్రామస్థులు మృతదేహాలతో ఆందోళనకు దిగారు. యండగండి-పామర్రు రహదారిని దిగ్బంధించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. హెరిటేజ్ సంస్థ చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు చెందినది కావడంతో టిడిపి నేతలు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రంగంలోకి దిగారు.