మహబూబ్‌నగర్, మే 6: జిల్లాలోని జలాశయాలలో నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. ప్రధానంగా కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా తయారైంది. దాదాపు 11 టిఎంసిల నీటిమట్టం సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1.98 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో డెడ్ స్టోరేజ్‌లో పడింది. ఇటు తాగునీరు, అటు సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతినిత్యం తాగునీటి పథకాలకు అందే నీరు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా జిల్లాలో రామన్‌పాడు తాగునీటి పథకం ద్వారా దాదాపు 200 గ్రామాలకు అందించే ఈ పథకం ప్రశ్నార్థకంగా మారడంతో మే మూడవ వారం వరకు జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. రామన్‌పాడు ప్రాజెక్టులో 1021.8 ఇన్‌చుల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 1014 ఇన్‌చుల సామర్థ్యం నీటిమట్టం ఉంది. సామర్థ్యానికి తక్కువగా 7 అడుగులు ఉండటంతో వివిధ గ్రామాలకు అందే తాగునీటి పథకాలకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా రామన్‌పాడు ప్రాజెక్టు నుండి అచ్చంపేట, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కొత్తకోట, వనపర్తి తాగునీటి పథకాలు ఉన్నాయి. జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరడం, దాంతో రామన్‌పాడుకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. జూరాల డెడ్ స్టోరేజీకి కారణం అధికారుల తప్పిదమేనంటూ వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఒకపక్క జూరాల, రామన్‌పాడు ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉంటే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీకి పడిపోయింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 32 అడుగులకు గాను ప్రస్తుతం కేవలం 2 అడుగుల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ తాగునీటి పథకానికి నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో తాగునీటిని అందించే మూడు ప్రాజెక్టులలో నీటిమట్టం తగ్గడం జిల్లా ప్రజలను కలవరానికి గురిచేస్తుంది. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న జిల్లా ప్రజానీకానికి తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే దాదాపు 400లకు పైగా గ్రామాలలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. 600 గిరిజన తండాలలో సైతం మంచినీటి ఎద్దడి ఏర్పడింది. జూరాల ప్రాజెక్టులో కేవలం 1.98 టిఎంసిల నీరు, కోయిల్‌సాగర్‌లో 2 అడుగుల నీరు, రామన్‌పాడులో మట్టం పడిపోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. (చిత్రం) రామన్‌పాడు నీటిమట్టం
జూరాలలో 1.98 టిఎంసిలు * కోయిల్‌సాగర్‌లో 2 అడుగుల నీటిమట్టం
english title:
water sources
Date:
Tuesday, May 7, 2013