అనంతపురం , మే 6: మనీల్యాండరింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కోబ్రాపోస్టు ఆరోపణలు అవాస్తవమని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కోబ్రాపోస్టు వైబ్‌సైట్‌లో వచ్చిన వార్తలు సత్యదూరమన్నారు. ఒక స్నేహితునికి మాటసాయం చేశానే తప్ప మరెలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. తిరుపతికి చెందిన తన స్నేహితుడు, జూనియర్ అయిన డాక్టర్ హరిప్రసాద్ సొంత స్థలాన్ని తాకట్టుపెట్టి తక్కువ వడ్డీకి రూ.25 కోట్ల అప్పు ఇప్పించమని తనను అడిగాడన్నారు. ఇందుకు సంబంధించి హరిప్రసాద్, రాజేష్‌కు చెప్పాలని సూచించాడన్నారు. దీనికి తాను సమ్మతించానన్నారు. హరిప్రసాద్ మంచి వ్యక్తి అని, తనపని తాను చేసుకుంటాడని అతని ఆస్తి తనఖా పెట్టుకుని డబ్బు అప్పుగా ఇవ్వాలని రాజేష్‌కు సూచించానని మంత్రి తెలిపారు. స్నేహితునికి సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతో రాజేష్‌కు ఒక మాట చెప్పానన్నారు. ఇందులో మనీల్యాండరింగ్ అనే పదం వాడటం దురదృష్టకరమన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన, చేస్తున్న వారిని వదిలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
- కోబ్రాపోస్టు వార్తలపై మంత్రి శైలజానాథ్ -
english title:
naaku sambandham ledu
Date:
Tuesday, May 7, 2013