హైదరాబాద్, మే 6: తెల్లరేషన్ కార్డుదారులకి ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల్లో కొలతలు, నాణ్యతల్లో తేడాలు వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులు స్వీకరించడానికి త్వరలో టోల్ ఫీ నెంబర్‌ను ఏర్పాటు చేయడానకి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ అమ్మహస్తం పథకంతో పంపిణీ చేస్తున్న 9 సరుకులతో పాటు అధనంగా మరికొన్ని డీలర్లు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. సబ్బులు, పెస్ట్, సుగంద ద్రవ్యాలు తదితర వస్తువులు రేషన్ దుకాణంలో అమ్ముకోవచ్చునని చెప్పారు. ఇక నుంచి నెలలో 10-25 తేదీల్లో రేషన్ దుకాణాలు కచ్చితంగా తెరచి ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వేళాపాలా పాటించని డీలర్లపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిత్యావసర సరుకులు అమ్ముతున్న డీలర్లకు కమీషన్ తక్కువ ఉందన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. నెలకు సరిపడా సరుకులకు డిడిలు తీయడానికి డీలర్ల వద్ద క్యాస్ లేనందున రెండు, మూడు విడతలుగా డిడిలు కడుతున్నారని చెప్పారు. ఈ విధానంలో మార్పు తీసుకువచ్చి, డీలర్లకు బ్యాంక్‌ల ద్వారా రుణాలను అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. జిల్లా, మండల స్థాయిలో నిత్యావసర పంపిణీ వ్యవస్థను పటిష్టపర్చడానికి రాబోవు రోజుల్లో ఆహార సలహాల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆహార వస్తువులు పంపిణీలో చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటిని అధికమిస్తామన్నారు. అమ్మహస్తం పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకతంగా చేపడుతోందన్నారు. నానాటికి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గంచడానికి మంత్రి చాంబర్‌లో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
తెల్లకార్డు దారులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచన
english title:
sridhar babu
Date:
Tuesday, May 7, 2013