విశాఖపట్నం, మే 6: విశాఖ జిల్లా అనకాపల్లిలో టిడిపి నాయకుడు దాడి వీరభద్రరావు వైకాపాలోకి వెళ్లిపోవడాన్ని అధినాయకత్వం అప్రమత్తమైంది. బాబు పాదయాత్రలో ఉన్నప్పుడే సుమారు ఎనిమిది మంది టిడిపి నాయకులు వైకాపాలోకి వెళ్లిపోయారు. పాదయాత్రలో ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పెద్దగా చేయలేకపోయారు. పాదయాత్ర ముగిసిన కొద్ది రోజులకే దాడి వీరభద్రరావు పార్టీని విడిచి వెళ్లడంతో చంద్రబాబు కూడా వలసల నిరోధంపై పూర్తిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే వాళ్లే తప్ప వెళ్లేవాళ్లు ఉండకూడదన్న దిశగా పనిచేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో టిడిపిని వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే గణబాబు టిడిపిని వదిలి పీఆర్పీలో చేరారు. ఆయనతో పాటు జిల్లాలోని అనేక మంది టిడిపిని వదిలి వెళ్లారు. తెలుగుదేశం కూడా చేసేది లేక వౌనం వహించాల్సి వచ్చింది. పిఆర్‌పి కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత టిడిపి నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన వారిలో ఎక్కువ మంది అందులో ఇమడలేకపోతున్నారు. ఇలాంటి వారంతా అప్పట్లోనే తిరిగి టిడిపికి వచ్చేయాలనుకున్నారు. కానీబాబు తలుపులు మూసేయడంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు బాబు నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో వారంతా వెనక్కు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. విశాఖ జిల్లాలో దాడి వీరభద్రరావు లేని లోటును పూడ్చేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. మంగళవారం అనకాపల్లిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకత్వ బాధ్యతలను ఫైవ్ మెన్ కమిటీకి అప్పగించేందుకు చర్యలు తీసుకోబోతోంది. పెందుర్తి నియోజకవర్గంలో ఓ నాయకుడు కొంత కాలం కిందట పీఆర్పీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆ నాయకుడిని తిరిగి వెనక్కు తీసుకువచ్చేందుకు టిడిపి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అధిష్ఠానం అనుమతిస్తే, ముహూర్తాన్ని నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరికొందరికి వైకాపా గాలం
మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దాడి బాటలోనే మరికొంత మందిని తీసుకువచ్చేందుకు వ్యూహాన్ని రూపొందిస్తోంది. విశాఖ జిల్లాతోపాటు, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఒకరిద్దరు ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకోవాలని యోచిస్తోంది. వైకాపా వ్యూహాలను తిప్పికొట్టేందుకు టిడిపి కూడా ప్రతి వ్యూహాన్ని రూపొందిస్తోంది.
*నష్ట నివారణకు అధినాయకత్వం చర్యలు
english title:
tdp
Date:
Tuesday, May 7, 2013