రాజమండ్రి, మే 6: పార్కింగ్ స్థలాలు, అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ లేని కల్యాణ మండపాలకు దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి పురపాలకశాఖ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నపుడు పార్కింగ్ స్థలాలు లేకపోవటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్న కారణంతో ఇప్పటికే ఒకసారి కల్యాణ మండపాలకు కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే. పార్కింగ్ స్థలాలు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ లేని వాటిని మూసివేస్తామని మున్సిపల్ కమిషనర్లు హెచ్చరించటంతో అప్పట్లో కల్యాణ మండపాల యజమానులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులను ఆశ్రయించి, గతంలో ఒకసారి ఈ ఒత్తిడి నుండి కొంత సడలింపు పొందారు.
ఇపుడు మళ్లీ మరోసారి పురపాలక శాఖ మంత్రి ఇదే అంశాన్ని తిరగదోడి, సోమవారం అన్ని జిల్లాలకు చెందిన పురపాలకశాఖ అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కల్యాణ మండలాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. దాంతో మరోసారి కల్యాణ మండపాల యజమానులు షరామామూలుగా అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చి, అప్పటికీ పార్కింగ్ స్థలాలు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటుచేసుకోని కల్యాణ మండపాలను జూన్ 1వ తేదీ నుండి మూసివేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీచేశారు. ఎప్పుడో నిర్మించిన కల్యాణ మండపాలకు ఇప్పటికిప్పుడు పార్కింగ్ స్థలాను సమకూర్చలేమని, ఫైర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటుచేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే తమకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని అగ్నిమాపక శాఖ జారీచేసే పరిస్థితుల్లో లేదని యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఫైర్ సేఫ్టీ వ్యవస్థను ఏర్పాటుచేసుకునేందుకు రూ.లక్ష నుండి 1.50 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అలా ఖర్చుపెట్టిన వారికెవరికీ ఫైర్ సేఫ్టీ సర్ట్ఫికెట్లు జారీకాలేదు. ఈ నిబంధనలను త్వరలో సడలించే అవకాశం ఉందని, అలా జరిగితే సర్ట్ఫికెట్లు రావచ్చన్న ఆశతో కల్యాణ మండపాల యజమానులు ఉన్నారు. కానీ పార్కింగ్ స్థలాలను ఎలా సమకూర్చగలమని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి ముహూర్తాలు మే నెలాఖరు వరకు బాగానే ఉన్నప్పటికీ, జూన్ 4వ తేదీ వరకు ఒకటి రెండు చిన్న ముహూర్తాలు కూడా ఉన్నాయి. మే నెలాఖరు వరకు ఎలాగూ గడువు ఉంది కాబట్టి, తరువాత మాత్రం న్యాయపోరాటం చేయాలని కళ్యాణ మండపాల యజమానుల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏడాదికి ఒక కల్యాణ మండపంలో గరిష్ఠంగా 40 పెళ్లిళ్లు లేదా ఇతర కార్యక్రమాలు జరుగుతాయని, బాగా డిమాండ్ ఉన్న కళ్యాణ మండపంలో 60వరకు కార్యక్రమాలు జరుగుతాయని యజమాని ఒకరు చెప్పారు. దీనివల్ల ప్రజలకు ఏడాదికి 80 గంటల నుండి 120 గంటలు మాత్రమే ఇబ్బంది కలిగితే కలగవచ్చన్నారు. అయితే పెళ్లిళ్లు చేసుకునే వారికి చాలా సౌకర్యం లభిస్తుందన్నారు. నిబంధనల పేరుతో ఒకవేళ మూసివేయాల్సి వస్తే అందుకూ తాము సిద్ధమేనని, వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తామని కళ్యాణ మండపం యజమాని ఒకరు చెప్పారు.
* నెలాఖరునాటికి పార్కింగ్, ఫైర్ సేఫ్టీ లేకపోతే మూసివేత * న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న యజమానులు
english title:
mandapams
Date:
Tuesday, May 7, 2013