ఆధునిక ఆయుధాలు!
అడవుల్లో నెలల తరబడి మకాం
సొంతంగా నిఘా వ్యవస్థ
యథేచ్చగా అక్రమ రవాణా
===========
కడప, మే 6: ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడపాదడపా స్మగ్లర్లను పోలీసులు అరెస్టుచేస్తున్నా వారు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అత్యంత ఆధునిక ఆయుధాలతో స్మగ్లర్లు అడవుల్లో మకాం వేయడంతో కడప జిల్లాలోని అడవుల్లోకి వెళ్లేందుకు పోలీసు,, అటవీశాఖ అధికారులు, సిబ్బంది సాహసించడం లేదు. ఎర్రచందనం విస్తారంగా ఉన్న జిల్లాలోని శేషాచలం అడవులు, అభయారణ్యాలు, గండికోట, రాజంపేట, రైల్వేకోడూరు అటవీ ప్రాంతాల్లో దేశ, విదేశీ స్మగ్లర్లు మకాం వేసినట్లు తెలిసింది. వారివద్ద అత్యంత విలువైన ఆధునిక ఆయుధాలు ఉన్నట్లు పోలీసు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు అడవుల్లోకి వెళ్లడానికి జంకుతున్నట్లు సమాచారం. గత 10 రోజులుగా జిల్లాలోని రైల్వేకోడూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, మైదుకూరు, వేంపల్లె, రాయచోటితో పాటు చిత్తూరు జిల్లా శివారు ప్రాంతాలైన ఎర్రవారిపాళెం, భాకరాపేట రోడ్డుమార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసు, అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న వారిపై కేసులు సైతం నమోదుచేశారు. అయితే సంబంధిత శాఖ అధికారులు, సిబ్బందికి తెలియకుండా యధేచ్చగా ప్రతినిత్యం కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు వివిధ మార్గాల్లో తరలిపోతున్నట్లు సమాచారం. పార్సిల్ వ్యాన్లు, నీళ్ల ట్యాంకర్లు, పాల ట్యాంకర్లు, పెట్రోలు, డీజిల్ ట్యాంకర్లలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన పోలీసులే కడప జిల్లా నుంచి పెద్దమొత్తంలో తరలిపోతున్న ఎర్రచందనాన్ని అడపాదడపా స్వాధీనం చేసుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం బేస్ క్యాంపులు, చెక్ పోస్టులు ఏర్పాటుచేసింది. ఆయుధాలతో కూడిన ఆర్ముడ్ రిజర్వు పోలీసులను అటవీ ప్రాంతాల్లో తనిఖీకి నియమించింది. రాయలసీమ జిల్లాలకు తిరుపతి కేంద్రంగా టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదనే చెప్పాలి. పోలీసులు, అటవీ శాఖ అధికారుల నిఘా కంటే స్మగ్లర్ల నిఘా పటిష్టంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖల అధికారుల కదలికలు, వారి నిఘా ప్రాంతాలను క్షణాల్లో తెలుసుకోవడానికి స్మగ్లర్లు పెద్దఎత్తున ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. చైనా, నేపాల్ తదితర దేశాలకు చెందిన స్మగ్లర్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లతో కలిసి అటవీప్రాంతంలో రోజుల తరబడి మకాం వేసి పెద్ద సంఖ్యలో కార్మికులను పెట్టుకుని ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నారు. జిల్లా సరిహద్దులోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, నెల్లూరు మీదుగా గట్టి నిఘా ఏర్పాటు చేసుకుని ఎర్రచందనాన్ని యధేచ్చగా తరలిస్తున్నట్లు తెలిసింది. అడవుల్లో తిరిగే సిబ్బంది సంబంధిత శాఖాధికారులకు అడపాదడపా రోడ్డుమార్గంలో తరలిపోతున్న ఎర్రచందనం గురించిన సమాచారం ఇస్తున్నప్పటికీ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న స్థావరాల వైపు వెళ్లేందుకు ఏ ఒక్కరు సాహసించడం లేదు. స్మగ్లర్ల ఆట కట్టించాలని అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగిన అదనపు బలగాలను అటవీ ప్రాంతంలో దింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ఆయుధాలు!
english title:
red sanders
Date:
Tuesday, May 7, 2013