న్యూఢిల్లీ, మే 7: సస్పెండయిన రైల్వే బోర్డు సభ్యుడు మహేశ్ కుమార్‌కు చెందిన నివాసాలపై సిబిఐ మంగళవారం దాడులు జరిపి పలు విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. మహేశ్ కుమార్ అరెస్టయిన వార్త టీవీ చానళ్లలో వచ్చిన వెంటనే అతని కుటుంబ సభ్యులు అతడి అధికార నివాసం నుంచి విలువైన వస్తువులు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను వేరేచోటికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. కుటుంబ సభ్యులను, కొంతమంది టాక్సీ డ్రైవర్లను ప్రశ్నించిన తర్వాత వీటిని ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకున్న సిబిఐ ఈ సమాచారం ఆధారంగా ముంబయి శివార్లలోని భయాందర్ ప్రాంతంలో దాడులు నిర్వహించి రహస్య ప్రాంతంలో దాచి ఉంచిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, వజ్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ భారీగా ఉండకపోయినప్పటికీ గణనీయమైన స్థాయిలోనే ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. రైల్వే బోర్డులో కీలకమైన పదవిలో నియమించేందుకుగాను బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ద్వారా రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లాకు 90 లక్షల రూపాయలు లంచం ఇచ్చాడన్న ఆరోపణపై మహేశ్ కుమార్‌ను అరెస్టు చేయడం తెలిసిందే.
ఇరకాటంలో కేంద్రం?
సిబిఐ అఫిడవిట్‌పై నేడు సుప్రీం కీలక విచారణ
న్యూఢిల్లీ, మే 7: బొగ్గు గనుల కుంభకోణంపై సిబిఐ జరిపిన దర్యాప్తు ముసాయిదా నివేదికను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్, గనుల శాఖ అధికారులు, పిఎంఓ అధికారులు ముందే పరిశీలించి మార్పులు చేశారంటూ సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్‌పై బుధవారం సుప్రీం కోర్టులో కీలక విచారణ జరుగబోతోంది. ఈ సందర్భంగా కేంద్రాన్ని సుప్రీం కోర్టు అనేక విధాలుగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో అశ్వినీ కుమార్ రాజీనామాకు విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసే పక్షంలో ఆయన ఇరుకున పడే పరిస్థితి అనివార్యంగా తలెత్తుతుంది. దర్యాప్తు ముసాయిదా గురించి తనకేమీ తెలియదని గతంలో అత్యున్నత న్యాయ స్థానంలో వెల్లడించిన అటార్నీ జనరల్ వాహనవతికి కూడా ఇదే రకమైన పరిస్థితి ఎదురుకావచ్చు. దర్యాప్తు ముసాయిదాను వాహనవతి చూశారని, ఆయన సూచనల మేరకే మార్పులు జరిగాయంటూ సిబిఐ డైరెక్టర్ తన తొమ్మిది పేజీల అఫిడవిట్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు స్వాధీనం
english title:
m
Date:
Wednesday, May 8, 2013