హైదరాబాద్, మే 7: రాష్ట్ర పోలీసు శాఖలో ఆరుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్బన్ కమిషనరేట్‌లో ఉన్న వరదరాజును విశాఖపట్నం కమిషనరేట్‌లో క్రైమ్ అదనపు డిసిపిగా, అక్కడ ఉన్న మహ్మద్ ఖాన్‌ను విశాఖ కమిషనరేట్ ఎస్‌బి విభాగం అదనపు డిసిపిగా బదిలీ చేసింది. నెల్లూరులో ఉన్న ఎల్‌టి చంద్రశేఖర్‌ను హైదరాబాద్ ఈస్ట్ జోన్ అదనపు డిసిపిగా, అక్కడ ఉన్న ఎం.వెంకటేశ్వరరావును ఖాళీగా ఉన్న హైదరాబాద్ సిసిఎస్, డిడి విభాగం అదనపు డిసిపిగా, నిజామాబాద్‌లో ఉన్న పివి పద్మజను ఖాళీగా ఉన్న హైదరాబాద్ పిసిఎస్‌అండ్‌ఎస్‌కు, పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఐఆర్‌ఎస్ మూర్తిని అదనపు ఎస్‌పి పిఎస్‌ఆర్ (ఎఆర్)కు, కర్నూలులో హోంగార్డ్సు కమాండెంట్‌గా ఉన్న ఐ.వెంకటేశ్‌ను అనంతపురం అదనపు ఎస్పీ (ఎఆర్)గా బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విలేఖరి దారుణ హత్య
పెదకాకాని, మే 7: గుంటూరు జిల్లా పెదకాకాని శివారు పల్లాలమ్మ చెరువు సమీపంలో పత్రికా విలేఖరి ప్రకాష్‌ను సోమవారం అర్ధరాత్రి కొంతమంది దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం పెదకాకాని వెంగళరావునగర్‌కు చెందిన లింగంగుంట్ల ప్రకాష్ (42) సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో పల్లాలమ్మ చెరువు వద్ద పథకం ప్రకారం దారికాసి హత్య చేశారు. మారణాయుధాలతో మెడ, గొంతు, తలపై బలంగా నరకడంతో ప్రకాష్ మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని అర్బన్ ఎస్‌పి ఆకె రవికృష్ణ, ఎఎస్‌పి జెట్టి గోపీనాథ్, డిఎస్‌పి మధుసూధనరావు సందర్శించారు. ఒక స్థలం విషయంలో తన భర్త ప్రకాష్‌కు సిఐ ధర్మేంద్రకు కొంతకాలంగా కక్షలు నడుస్తున్నాయని మృతుడి భార్య ఝాన్సీఎస్‌పి దృష్టికి తీసుకువచ్చారు. తన భర్త హత్య పథకం ప్రకారం జరిగిందేనని ఆమె ఆరోపించారు. సంఘటన స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం జరిగిన అంతిమయాత్రలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, పలు ప్రజా సంఘాలు, పాత్రికేయులు పాల్గొని నివాళులర్పించారు.
సినీనటి అంజలిపై
పరువు నష్టం దావా
సేలమ్, మే 7: దక్షిణాది సినీతార అంజలిపై తమిళ సినీ దర్శకుడు కళాంజియమ్ నేతృత్వంలోని ఓ సంస్థ పరువు నష్టం దావా వేసింది. కళాంజియమ్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అంజలి ఇటీవల చేసిన వ్యాఖ్యలకుగాను ఆ సంస్థ ఈ పరువు నష్టం దావా వేసింది. కళాంజియమ్ తమిళుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, అంజలి వ్యాఖ్యలు ఆయన అనుచరుల మనోభావాలను గాయపరిచాయని స్థానిక రెండో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తమిళర్ నలమ్ పెరియాక్కమ్ (తమిళుల సంక్షేమ ఉద్యమం) సంస్థ స్థానిక విభాగం కార్యదర్శి మురుగన్ ఆరోపించారు. కాగా, మేజిస్ట్రేట్ లక్ష్మి ఈ కేసును ఈ నెల 13కు వాయిదా వేసారు. గత నెల అంజలి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించడం తెలిసిందే. తన సవతి తల్లి, కళాంజియమ్‌లు కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నారని, ఒక ఎటిఎంలాగా ఉపయోగించుకుంటున్నారంటూ ఆ తర్వాత అంజలి ఆరోపించింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిందంటూ అంజలిపై కళాంజియమ్ సైతం స్వయంగా గత నెల 9న ఒక పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. పలు తమిళ చిత్రాలతో పాటుగా తెలుగులో ఇటీవల విడుదలయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో అంజలి నటించడం తెలిసిందే.
రాష్ట్ర పోలీసు శాఖలో ఆరుగురు అదనపు
english title:
a
Date:
Wednesday, May 8, 2013