
హైదరాబాద్, మే 7: సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20 శాతం సబ్సిడీని ఇవ్వాలని సౌర విద్యుత్ విధానాన్ని సమీక్షించిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాలను మంత్రివర్గ సమావేశానికి సమర్పించనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. మంగళవారం ఇక్కడ సౌర విద్యుత్‌పై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. అనంతరం రాంనారాయణ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేవారికి కేంద్రం 30 శాతం సబ్సిడీని మంజూరు చేస్తోందన్నారు. ఇకపై ప్రభుత్వం దీనికి అదనంగా 20 శాతం సబ్సిడీని ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. వ్యవసాయానికి సంబంధించి 3 హెచ్‌పి, ఐదు హెచ్‌పి పంపుసెట్లను వాడే రైతులకు కేంద్రం ఇచ్చే 30 శాతంతో పాటు రాష్ట్రప్రభుత్వం 20 శాతం సబ్సిడీ నిధులను ఇస్తుంది. ఈ పంపుసెంట్లను సౌర విద్యుత్‌తో ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన 50 శాతం నిధులను రైతులు భరించాలి. విద్యుత్ లైన్లు లేని ప్రాంతంలో కూడా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సౌర విద్యుత్ ప్లాంట్లకు వంద శాతం సబ్సిడీ ఇస్తారు. అలాగే ఇందిర జలప్రభ కింద ఎంపిక చేసిన వ్యవసాయ భూములకు కూడా సౌర విద్యుత్‌ను వాడితే ప్రోత్సాహకాలను ఇస్తారు. హాస్టళ్లలో పూర్తిగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. క్యాప్టివ్ జనరేషన్ ప్లాంట్లకు సంబంధించి 78 ప్లాంట్లకు అనుమతి ఇచ్చామన్నారు. మూడు ప్లాంట్లు ఇప్పటికే సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. నెట్‌మీటరింగ్ కింద భవనాలు, ఇండ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సరఫరా చేసే వినియోగదారులకు ఆరు నెలలకోసారి వారు సరఫరా చేసే విద్యుత్‌కు బిల్లు చెల్లిస్తారు. కాగా వినియోగదారులు మాత్రం ప్రతినెలా తమకు ట్రాన్స్‌కో నుంచి వచ్చే కరెంటు బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. గ్రిడ్‌కు సరఫరా చేసే విద్యుత్ ధరను ఏపిఇఆర్‌సి నిర్ణయిస్తుంది. ఈ ధర యూనిట్‌కు రూ.2.98 పైసల నుంచి రూ.3.50 పైసల వరకు ఉండవచ్చని, ఇఆర్‌సి నిర్ణయం మేరకు లోబడి ఉంటామన్నారు. నెట్‌మీటరింగ్ ద్వారా సౌర విద్యుత్‌ను సరఫరా చేసే వారికి కూడా 20 శాతం ప్రోత్సాహక నిధిని ఇస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఉత్తమకుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు.