న్యూఢిల్లీ, మే 7: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు పెద్దఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ‘కోబ్రా పోస్ట్’ వెబ్‌సైట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బైటపడిన ఒక రోజు తర్వాత వివిధ అక్రమాలకు పాల్పడినందుకు 31 మంది అధికారులపై సస్పెన్షన్ సహా పలు రకాల క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ‘ఇప్పటివరకు బీమా రంగానికి చెందిన ఒక అధికారి సహా 15 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరో పది మంది అధికార్లను బాధ్యతలను తప్పించగా, మరో ఆరుగురిని దీర్ఘకాలిక సెలవుపై పంపించారు’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్యాంకింగ్ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ అధికార్లపై చర్యలు తీసుకున్నట్లు కూడా అ ప్రకటనలో తెలిపారు. కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ వివరాలను వెల్లడించగానే ఈ ఆరోపణలపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) సిఎండిలను ఆదేశించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయి. మరికొన్ని కేసుల విషయంలో ఆ పని ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో మరిన్ని చర్యలకు సంబంధించిన సమాచారం అందవచ్చని ఆ ప్రకటన తెలిపింది. అయితే క్రమశిక్షణా చర్యలు తీసుకున్న బ్యాంకు అధికార్ల వివరాలేమీ ఆ ప్రకటనలో తెలపకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా భావించి తక్షణం చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని కూడా టక్రూ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసి చీఫ్‌లను ఆదేశించారు.
అనేక నెలలుగా జరుపుతున్న స్టింగ్ ఆపరేషన్‌లో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రధాన బీమా సంస్థలు, అనేక ప్రైవేటు బ్యాంకులు ఉద్దేశపూర్వకంగా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తేలిందని ‘కోబ్రాపోస్ట్’ సోమవారం ఒక ప్రకటనలో తెలపడం తెలిసిందే. ఎల్‌ఐసి, రిలయన్స్ లైఫ్, టాటా ఎఐఎ, బిర్లా సన్‌లైఫ్‌లాంటి బీమా సంస్థలతో పాటుగా ఎస్‌బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఐడిబిఐ బ్యాంక్ లాంటి 23 బ్యాంకులు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ ఆరోపణలను పరిశీలిస్తున్నామని, తప్పు చేసిన వారిపై వీలయినంత త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని బీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఏ కూడా తెలిపింది.
ఉరి ఆపండి
సుప్రీంకు భుల్లార్ భార్య అభ్యర్థన
న్యూఢిల్లీ, మే 7: ఇరవై ఏళ్ల క్రితం జరిగిన 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో దోషి దేవిందర్‌పాల్ సింగ్ భుల్లార్‌కు విధించిన ఉరిశిక్షను ఆపాలని భుల్లార్ భార్య మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ రాష్టప్రతికి భుల్లార్ పెట్టుకున్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడంలో ఏర్పడిన జాప్యం దృష్ట్యా ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఆ తీర్పుపై భుల్లార్ భార్య రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.