హైదరాబాద్, మే 7: ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ హస్తం’ పథకాన్ని సక్రమంగా అమలు చేసే విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజులకు సరిపడే సరుకుల నిల్వను ముందుగానే డీలర్ల వద్ద ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యమైన, కచ్చితమైన పరిమాణంలో అమ్మహస్తం కింద సరుకులను అందించాలన్నారు. మంగళవారం అమ్మహస్తంపై పౌర సరఫరాలశాఖ మంత్రి శ్రీ్ధర్ బాబు, ఇతర అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఈ కార్యక్రమం అమలుపై జాయింట్ కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా చూడాలన్నారు. ప్రతి నెలా నిర్ణీత గడువుకు ముందుగానే ప్రభుత్వానికి నివేదికలు పంపించాలన్నారు. రాష్ట్రంలోని 46 వేల మంది డీలర్లలో ఎక్కడైనా ముందస్తుగా సరుకులు తీసుకోకపోతే వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పథకానికి అవసరమయ్యే 10,750 మెట్రిక్ టన్నుల పంచదారను రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల నుంచి సేకరించేందుకు ఆయా కర్మాగారాల యాజమాన్యాలు, చక్కెర పరిశ్రమల కమిషన్‌తో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర కూడా పూర్తిగా అందించేందుకు అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి ఉచితంగా అందించే అమ్మ హస్తం ప్యాకెట్లను ఇప్పటికే 1.90 కోట్ల మందికి అందించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా ఈ నెల పదో తేదీలోగా అందిస్తామని అధికారులు వివరించారు.
రాజీపడకుండా అమలు అధికారులకు సిఎం ఆదేశం డీలర్‌వద్ద నెలకు సరిపడే నిల్వలుంచాలని సూచన
english title:
a
Date:
Wednesday, May 8, 2013