హైదరాబాద్, మే 7: రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ), విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి నగర శివార్ల అభివృద్ధికి టౌన్‌షిప్ విధానాన్ని ఖరారు చేసేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కసరత్తును ప్రారంభించింది. నగరశివార్లలో పెద్ద ఎత్తున టౌన్‌షిప్‌ల ఏర్పాటు అభివృద్ధికి నిర్దిష్టమైన విధానమంటూ లేదు. దీని వల్ల టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసే రియల్టర్లు, డెవలపర్లు, కొనుగోలుదారులు అనేక ఇక్కట్లకు లోనవుతున్నారు. టౌన్‌షిప్ ఏర్పాటుపై రాష్ట్రప్రభుత్వం ఒక మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘంలో మున్సిపల్ శాఖ మంత్రి ఎం మహీధర్ రెడ్డి చైర్మన్‌గా, గృహ శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే కొన్ని విధి విధానాలను రూపొందించింది. వ్యవసాయేతర భూమి మార్పిడిపై సూచనలతో పాటు వసూలు చేయాల్సిన మొత్తంపై ఒక ముసాయిదాను ఈ కమిటీ రూపొందించింది. ముసాయిదాలోని అంశాల ప్రకారం ఇకపై టౌన్‌షిప్‌ల అభివృద్ధికి ప్రైవేట్ వౌలిక సదుపాయాల సంస్ధలను ప్రోత్సహిస్తారు. వారికి పన్ను మినహాయింపు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆస్తి పన్నును తగ్గిస్తారు. హెచ్‌ఎండిఏ పరిధిలో టౌన్‌షిప్‌ను వంద ఎకరాల్లో నిర్మిస్తారు. టౌన్‌షిప్‌ను నిర్మించే వారు ప్రణాళికలోనే పనిచేసే ప్రదేశాలు, వినోదం, నివాసం, తదితరమైన వాటికి ఏ మేరకు కేటాయించాలో సూచించాలి. టౌన్‌షిప్‌లను మూడు కేటగిరీలుగా విభజించారు. హైదరాబాద్, విశాఖపట్నం మొదటి కేటగిరీ కిందకు వస్తాయి. ఇక్కడ కనీసం వంద ఎకరాలు ఉంటేనే అనుమతులు లభిస్తాయి.
రెండవ కేటగిరీలో 75 ఎకరాల్లో నిర్మించే టౌన్‌షిప్‌లు ఉంటాయి. ఈ కేటగిరీలో వరంగల్, తిరుపతి, ఇతర ప్రత్యేక అభివృద్ధి ప్రాంతాలు వస్తాయి. చిన్న మున్సిపాలిటీలు, పట్టణాల వద్ద 50 ఎకరాల్లో కూడా టౌన్‌షిప్‌ల అనుమతి ఇస్తారు. ఇవి మూడవ కేటగిరీ కిందకు వస్తాయి. డెవలపర్ రోడ్లు, నీరు, తాగునీటి సదుపాయం, వృథా పదార్థాల వినియోగం ప్లాంటు, విద్యుత్, ఓపెన్ స్పేస్ తదితరమైన సదుపాయాలు వస్తాయి. రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట 22 టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ఇప్పటికే హెచ్‌ఎండిఏ ప్రతిపాదనలు చేసింది.
అధిష్ఠానానికి లేఖ రాయలేదు: బొత్స
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 7: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఏకపక్షంగా పథకాలను ప్రకటిస్తున్నారని వ్యాఖ్యానించిన మంత్రుల గురించి తాను పార్టీ అధిష్ఠానానికి లేఖ రాయలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రుల అసంతృప్తి గురించి పార్టీ అధిష్ఠానానికి చెప్పేందుకు ఢిల్లీ వెళ్ళనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన మంగళవారం విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. మీరు ఢిల్లీ వెళుతున్నారా? లేదా? అని ప్రశ్నించగా, ఆయన సరైన సమాధానం చెప్పకుండా దాట వేశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ నెల 13న మెదక్ జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికపై ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారా? అని ప్రశ్నించగా, ఆ సభ గురించే తనకు తెలియదని అన్నారు. ఈ నెల 11న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవితో కలిసి తూర్పు గోదావరి జిల్లాలో అధికారిక పర్యటన చేయనున్నట్లు ఆయన తెలిపారు. 12న గజల్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆయన చెప్పారు. జిల్లా, మండల కమిటీలు రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.
పార్లమెంటు ఆవరణలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు దక్కుతుందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్‌రావు అన్నారు. అయితే కొంత మంది నాయకులు ఈ ఘనత తమదేనంటూ చెప్పుకుంటున్నారని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి విగ్రహాలనూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.