న్యూఢిల్లీ, మే 7: భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండయిన సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు రాంజెత్మలానీ మంగళవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలోకి దూసుకుపోయి అవినీతి విషయంలో అధికార కాంగ్రెస్ పట్ల ప్రధాన ప్రతిపక్షం మెతకవైఖరి అవలంబిస్తోందంటూ నిప్పులు చెరిగారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాంజెత్మలానీకి అనుమతి లేదు. అయినప్పటికీ ఆయన పార్లమెంటు భవనం లోపల జరుగుతున్న ఈ సమావేశంలోకి దూసుకెళ్లి యుపిఏ ప్రభుత్వం పట్ల బిజెపి చాలా మెతగ్గా ఉంటోందని విమర్శించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అవినీతి విషయంలో కాంగ్రెస్‌పై ప్రతిపక్షం తన దాడిని మరింత తీవ్రం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటూ, ముఖ్యంగా బిజెపి ఈ విషయంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. తనకు నోటీసు ఇచ్చి మూడు నెలలు గడిచిపోయినప్పటికీ పార్టీ నుంచి బహిష్కరించడంపై ఎందుకు చర్య తీసుకోవడం లోదో చెప్పాలని కూడా ఆయన పార్టీ అధినాయకత్వాన్ని డిమాండ్ చేసారు. కొన్ని అంశాలపై పార్టీని విమర్శించినందుకు జెత్మలానీని గత ఏడాది నవంబర్ 26న బిజెపి నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ సహా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయిన వారంతా జెత్మలానీ పార్టీపై విరుచుకుపడుతూ మాట్లాడుతున్నంతసేపూ వౌనంగా ఉండిపోయారు.
దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత రాంజెత్మలానీ సమావేశానికి ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు.
బిజెపి ఎంపీలు అనంత్‌కుమార్, రవిశంకర్ ప్రసాద్, షానవాజ్ హుస్సేన్ తదితరులు రాంజెత్మలానీ ప్రవర్తనను విమర్శిస్తూ దీన్ని ఎంతమాత్రం సహించకూడదని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనను తక్షణం పార్టీ నుంచి బహిష్కరించాలని పలువురు ఎంపీలు సూచించినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. అయితే పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన మరింతగా రెచ్చపోతారని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కాగా, ఈ రోజు ప్రవర్తనపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశముందని కొందరు ఎంపీలు చెప్పారు.