బెంగళూరు, మే 7: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నప్పటికీ బుధవారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసులను తొలుస్తోంది. 224 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 110నుంచి 132 స్థానాల మధ్య రావచ్చని, బిజెపి ఘోరంగా నష్టపోనున్నదని ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే సొంతంగా మెజారిటీ సాధించాలంటే ఆ పార్టీకి 113 స్థానాలు రావాలి. అయితే కాంగ్రెస్‌కు ఆ మేరకు సీట్లు రాకపోతే పరిస్థితి ఏమిటనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆ పరిస్థితే ఎదురయితే తమ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించడానికి సిద్ధంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పకు చెందిన కర్నాటక జనతా పక్ష (కెజెపి)కు చెందిన కొంతమంది నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. అయితే యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఆయన మద్దతును కాంగ్రెస్ స్వీకరిస్తుందా అనేది తెలియడం లేదు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి రాదని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా యెడ్యూరప్ప పార్టీ బిజెపి ఓట్లను చీల్చడం ద్వారా ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నందున తమకు సొంతంగా మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్‌కన్నా ఒక శాతం ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ 30కి పైగా ఎక్కువ సీట్లను అది గెలుచుకోగలిగింది. యెడ్యూరప్ప పార్టీకి ఈ ఎన్నికల్లో మహా అయితే రెండు డజన్ల సీట్లకన్నా ఎక్కువ రావని అందరూ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఆ పార్టీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి బి శ్రీరాములుకు చెందిన బిఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి ఓట్లకు గండికొట్టవచ్చని భావిస్తుండడం కాషాయ పార్టీ నేతలను మరింతగా కలవరపెడుతోంది.
గత ఆదివారం రాష్ట్రంలోని 223 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. బిజెపి అభ్యర్థి మృతి కారణంగా మైసూరు జిల్లాలోని పెరియపట్నంలో ఎన్నికలు ఈ నెల 28కి వాయిదా పడ్డాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 71.29 శాతం పోలింగ్ నమోదయింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత ఎక్కువ పోలింగ్ నమోదు కావడం ఇది రెండోసారి. బుధవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అన్ని నియోజకవర్గాల్లోను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించినందున మధ్యాహ్నానికల్లా దాదాపుగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
నేడే కర్నాటక ఫలితాలు
english title:
c
Date:
Wednesday, May 8, 2013