న్యూఢిల్లీ, మే 7: ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌ను స్థానిక కోర్టు నిర్దోషిగా విడుదల చేయడాన్ని సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ తీర్పును సవాలు చేయడానికి బలమైన కారణాలున్నాయని అది భావిస్తోంది. ఈ కేసులో స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారించిన వారికి విధించే శిక్షలపై తీర్పుకోసం సిబిఐ ఎదురు చూస్తోందని సిబిఐ వర్గాలు అంటున్నాయి. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన అల్లర్లకు సంబంధించిన ఒక కేసులో జిల్లా, సెషన్స్ జడ్జి జెఆర్ ఆర్యన్ గత నెల 30న కాంగ్రెస్ మాజీ ఎంపి సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ మరో అయిదుగురిని దోషులుగా ప్రకటించడం తెలిసిందే. ఈ అల్లర్లకు సంబంధించి సజ్జన్ కుమార్ ఇంకా మరో కేసులో విచారణను ఎదుర్కొంటుండగా, మూడో కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లభించని కారణంగా కేసును మూసివేయడానికి అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో నివేదిక దాఖలు చేసింది. కాగా, తీర్పును తమ న్యాయ విభాగం అధ్యయనం చేసిందని, తీర్పును సవాలు చేయడానికి బలమైన కారణాలున్నాయని అభిప్రాయ పడిందని సిబిఐ వర్గాలు అంటూ, అందువల్ల సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని అంటున్నాయి. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అపీలు చేసే ప్రక్రియను ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని త్వరలోనే న్యాయ శాఖను సిబిఐ కోరుతుందని కూడా ఆ వర్గాలు తెలిపాయి. సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా విడుదల చేయడంపై ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు సిక్కు సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
బలమైన కారణాలతో పిటిషన్ దాఖలుకు యోచన
english title:
s
Date:
Wednesday, May 8, 2013