గుంటూరు, మే 8: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి నగరంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే రైతు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 8.28 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, 2.95 కోట్లతో నిర్మించనున్న స్ర్తి భక్తి భవనానికి శంకుస్థాపన, బిఆర్ స్టేడియంలో 28.35 లక్షలతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను ప్రారంభిస్తారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనుల కోసం జిల్లా స్థాయిలో 138 రైతుమిత్ర గ్రూపులకు రూ. 5.55 కోట్ల విలువ గల అద్దెకు ఇచ్చే యంత్ర పరికరాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు. కాగా ఇప్పటికే ముఖ్యమంత్రి ఏర్పాట్లను మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం హెలికాఫ్టర్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు.
సిఎం పర్యటన వివరాలు...
ఉదయం 9.40 నిముషాలకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు గుంటూరు బిఆర్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ అధికారులు, అనధికారులు కలుసుకుంటారు. అనంతరం 11.10 గంటలకు బిఆర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిపి 11.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా పోలీసు పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సదస్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించి 11.40 లకు రైతు సదస్సు ప్రారంభ సభలో పాల్గొంటారు. అనంతరం 12.50 లకు బయలుదేరి ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 1.30 లకు బస్సులో బయలుదేరి 1.40 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 1.50 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు.
వైద్యం వికటించి వ్యక్తి మృతి
రెంటచింతల, మే 8: గుంటూరు జిల్లా రెంటచింతలలో వైద్యం వికటించి బుధవారం ఒక వ్యక్తి మరణించాడు. నల్లగొండ జిల్లా పిఎ పల్లి మండలం పెద్దగట్టుతండాకు చెందిన రమావత్ రాజానాయక్ తన భార్య పీక్లీబాయితో కలిసి జీవాలను తోలుకుని వారం రోజుల క్రితం రెంటచింతలకు వచ్చాడు. గ్రామ సమీపంలోని పొలాల్లో తమ గొర్రెలను మేపుకుంటూ బుధవారం ఉదయం పది గంటలకు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుండగా, భార్య పీక్లీబాయితో కలిసి రెంటచింతలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ ఆసుపత్రికి చెందిన ఆర్‌ఎంపి 20 రోజుల క్రితమే మరోచోటుకి ఆసుపత్రిని తరలించాడు. అయితే గతంలో ఆ ఆసుపత్రిలో పనిచేసిన నర్సు ఎటువంటి ప్రిస్కిప్షన్ లేకుండా రాజానాయక్‌కు ఇంజక్షన్ చేసింది. ఆమె వైద్యం వికటించి రాజానాయక్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇదేమని పీక్లీబాయి ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుండి ఉడాయించింది. విషయం తెలుసుకున్న స్థానిక సుగాలీ మహిళలు, యువకులు, పెద్దలు ఆసుపత్రి వద్దకు చేరుకుని రెంటచింతల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేవరకు అక్కడ నుండి మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తీసుకువెళ్ళేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. కాగా, కొంతమంది ఆర్‌ఎంపి డాక్టర్లు తామే పెద్ద మొత్తంలో మందుల నిల్వలను ఉంచుకుని, సొంతంగా వైద్యం చేయడంతోపాటు మందులను కూడా రోగులకు వారే అందజేయడం గమనార్హం.
అమ్మవారి సేవకుడి హత్య
దుర్గి, మే 8: గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో అమ్మవారి సేవకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని నిదానంపాడు గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పిడుగురాళ్ళ మండలం పాత గణేషునిపాడుకు చెందిన గుర్రం వెంకట్రావు(48), భార్యకు గత 15 సంవత్సరాల క్రితం ఇరువురి మధ్య విబేధాలు రావడంతో అప్పటి నుండి వెంకట్రావు నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయంలో దీక్షాదుస్తులను ధరించి అమ్మవారికి సేవ చేస్తూ, జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మవారి సేవ అనంతరం చెంచుగూడెంలోని శిథిలావస్థలో ఉన్న ఓ గృహంలో ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుఝామున ఆయన నివాసం ఉంటున్న గృహానికి సమీపంలో గాయాలతో రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌టీమ్ హత్యజరిగిన ప్రదేశంలో అధారాలను సేకరించారు. మృతుడు వెంకట్రావు బంధువుల ఫిర్యాదు మేరకు మాచర్ల సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
’పులిచింతల‘ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సిఎం చెప్పాలి
తెనాలి, మే 8: రైతు సదస్సులో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పులిచింతల ఖచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలని, లేకుంటే పులిచింతల సత్వర సాధన కమిటీ ద్వారా మరోసారి పులిచింతల సాధన ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ఉద్ధృతం చేస్తామని మాజీ మంత్రి ఆలపాటి పేర్కొన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో పులిచింతల సత్వర నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆలపాటి మాట్లాడుతు పులచింతల నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా కమిటీలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు మంగళవారం సందర్శించిన క్రమంలో, ప్రస్తుతం పులిచింతల నిర్మాణ పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఇదే విధానం కొనసాగితే 2014 జూన్‌కు కూడా పులిచింతల ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే జూన్ మాసంలోగా పులిచింతల పూర్తి చేస్తామని ఇచ్చిన హామి నెరవేరేలా కనిపించడం లేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ క్రమంలో 3 ప్రధాన అంశాలను ఆలపాటి ప్రస్తావించారు. ఇంజనీరింగ్ విభాగం టెక్నికల్ అంశాలు 33 గేట్లను 24 గేట్లుగా కుదించినా, ఇందులో 17 గేట్ల పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోందన్నారు. అరకొర పనులతో పూర్తి చేశామనే విధానం ప్రదర్శిస్తే తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించే పవర్‌హౌస్ పనులు ఇప్పటికి 80 శాతం పూర్తి చేసినట్లు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఇదే తరహాలో పనులు జరిగితే మరో 3 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదన్నారు. పులించింతల కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాస కల్పనకు సుమారు 6 వేల గృహాలు నిర్మించాల్సి ఉందన్నారు. అధికారులు చెప్పేదానికి , వాస్థవ పరిస్థితులకు పొంతన లేని రీతిలో పులిచింతల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆలపాటి ఆరోపించారు. అదే విధంగా జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి పులిచింతల అంశంలో ఇంజనీరింగ్ విభాగంతో పూర్తి స్థాయిలో చర్చించి, పులించింతల ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే విషయంపై జిల్లా పర్యటన క్రమంలోనే వివరణ ఇవ్వాలన్నారు. సకాలంలో పులిచింతల పూర్తి చేయకుంటే ఉద్యమం తప్పదన్నారు. సిపిఐ జిల్లా నాయకుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ పులిచింతల నిర్వాసితులకు కల్పిస్తున్న వసతి తీరుతెన్నులపై ఈనెల 13న తమ కమిటీ పరిశీలన చేస్తుందన్నారు. 14న పెదరావూరులో నాలుగు జిల్లాల్లోని రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పులిచింతల సత్వర సాధనలో కలిసివచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుని, సదస్సు నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నుండి స్పష్టమైన ప్రకటన రాకుంటే, పులిచింతల సాధన ఉద్యమ కార్యాచరణపై సదస్సులో చర్చించనున్నట్లు నాగేశ్వరరావు వివరించారు. సమావేశంలో సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి, చెరుకుమల్లి సింగారావు, షేక్ హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు.
‘ఆడపిల్లలను పెంచి పోషించిన వారికే స్వర్గప్రాప్తి’
మంగళగిరి, మే 8: ఆడపిల్లలను పెంచి పోషించాలని, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, ఇస్లాం ప్రకారం వారికే స్వర్గం లభిస్తుందని జమా అతే ఇస్లామిహింద్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల మహిళా అధ్యక్షురాలు నాసిరా ఖానమ్ అన్నారు. పట్టణంలోని టిప్పర్ల బాజరులో గల అంజుమన్ షాదీఖానా ప్రాంగణంలో బుధవారం ఇస్లాంలో మహిళల హక్కులు అనే అంశంపై ఆమె మాట్లాడుతూ అజ్ఞానకాలంలో ఆడపిల్లలను హత్య చేసేవారని, ఇస్లాం అటువంటి వాటిని నిషేధించిందని అన్నారు. తల్లి పాదాల కింద స్వర్గముందని, ఆడపిల్లలకు తండ్రి ఆస్తిలో హక్కు ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షహీనా, గుంటూరుజిల్లా అధ్యక్షురాలు షఫీయున్నీసా, పి ఫాతిమున్నీసా, జమా అతే ఇస్లామిహింద్ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె షుబుహాన్, ఎండి యూసుఫ్, షరీఫ్, ఎస్‌డి రషీద్ తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు వృద్ధురాలి మృతి
అమృతలూరు, 8: వడదెబ్బకు వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని తురిమెళ్ళ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ విఆర్‌ఓ సునంద కథనం ప్రకారం గ్రామానికి చెందిన పిల్లి భారతి(66) వడగాల్పులకు తాళలేక బుధవారం మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయాన్ని తహశీల్దార్ బాలకృష్ణారెడ్డికి తెలిపినట్లు విఆర్‌ఓ పేర్కొన్నారు.
ఎఐఎస్‌ఎఫ్ నాయకుల అరెస్ట్
గుంటూరు (కొత్తపేట), మే 8: రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నగరంలో రాష్టస్థ్రాయి రైతు సదస్సును ప్రారంభించేందుకు గురువారం రానున్న సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ నాయకులు బుధవారం స్థానిక జిన్నాటవర్ సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, రక్తంతో బహిరంగ లేఖ రాసి ఆందోళన నిర్వహించారు. దీంతో లాలాపేట పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అన్నీ అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారని, వాటి వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత భవనాలు నిర్మించాలని కోరారు.
* అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు... ప్రారంభోత్సవాలు * సర్వం సిద్ధం చేసిన అధికారులు
english title:
n
Date:
Thursday, May 9, 2013