Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టిఆర్‌ఎస్‌లోకి పువ్వాడ అజయ్ ?

$
0
0

ఖమ్మం, మే 8: ఇటీవల కాలం వరకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన పువ్వాడ అజయ్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు బుధవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర, జిల్లా నాయకులతో ఏర్పడ్డ విభేదాల కారణంగా కన్వీనర్ పదవిని కోల్పోయిన ఆయన షర్మిల పాదయాత్రలో పాల్గొంటూనే ఉన్నారు. సిపిఐ అగ్ర నేతలలో ఒకరైన పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడైన అజయ్‌కుమార్ వైఎస్‌ఆర్‌సిపిలో చేరడంతోనే జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్‌కు మిత్రుడైన అజయ్ టిఆర్‌ఎస్‌లో చేరతారని మొదటినుంచే ప్రచారం జరుగుతున్నా ఆయన దానిని ఖండిస్తూనే ఉన్నారు. అయితే బుధవారం టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశంలో పువ్వాడ అజయ్‌కుమార్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా ఆయనను నిలపడం ద్వారా గెలుపు తమదేనని చెప్పినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అనుచరుల్లో కొంత ఆందోళన వ్యక్తమయింది. ఈ విషయంపై పువ్వాడ అజయ్‌ను వివరణ కోరగా తాను వైఎస్‌ఆర్‌సిపిలోనే ఉన్నానని, జగన్ కోసమే రాజకీయాలలోకి వచ్చానని, చివరివరకు ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించటంలో పదవులను ఆశించకుండా జగన్ వెంట పయనిస్తానని స్పష్టం చేశారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు
అధిక నిధులు
*ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెల్లడి
ఆంధ్రభూమిబ్యూరో
ఖమ్మం, మే 8: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయిస్తుందని రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన మామిడి మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో 4లక్షల 10హెక్టార్లలో మామిడి పంట సాగవుతోందని, అందులో 46వేల హెక్టార్లు ఖమ్మం జిల్లాలోనే సాగవుతుందన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి రైతులు నేరుగా నాణ్యమైన పండ్లను వినియోగదారులకు అందించి ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు విశాఖపట్నం, చిత్తూరు, ఖమ్మం జిల్లాల్లో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన రైతులకు 2లక్షల సబ్సిడీపై మిని వ్యాన్‌ను కూడా అందిస్తున్నామన్నారు. తెలంగాణ జిల్లాల్లో బత్తాయి రైతులకు కూడా ప్రత్యేకంగా మేళాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2012-13లో రాష్ట్రం నుంచి దాదాపు 673కోట్ల రూపాయల విలువైన మామిడి ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం జరిగిందని స్పష్టం చేశారు. విజయవాడ, హైదరాబాద్‌లలోని ప్రధాన మార్కెట్లతో పాటు నాగపూర్, ఇండోర్, ఆగ్రా, ఢిల్లీలలోని మార్కెట్లకు కూడా జిల్లా నుంచి మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఈ మేళాలో 13స్టాల్స్ ద్వారా 94మెట్రిక్ టన్నుల కార్బైడ్ రహిత మామిడిపండ్లను అమ్మేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా మామిడి రైతులకు అవసరమైన ఎరువులు, ఇతర సామాగ్రి, ప్యాకింగ్, రవాణా ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరైతుకు 37వేలు రాయితీగా ఇవ్వటం జరుగుతుందన్నారు. 2012-13వ సంవత్సరానికి రాష్ట్రంలో 1058హెక్టార్లలో 2.15కోట్లతో మామిడి తోటలు వేయటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని 14,500హెక్టార్లలో గతేడాది 26.68కోట్లు వెచ్చించి డ్రిప్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్బైడ్ రహిత పండ్లను వినియోగదారులకు అందించేందుకు 1.34కోట్లు ఖర్చు చేసి రిఫైనింగ్ చాంబర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన పండ్లను అందించాలనే లక్ష్యంతో ఈ మేళాను ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం జిల్లాలో మామిడి రైతులను ప్రోత్సహించేందుకు గాను 11సంఘాలకు సంబంధించి 183మంది రైతులను గుర్తించామని, వారికి ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలను కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గోవింద్రాల గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్, సీతంపేటకు చెందిన రాజారం అనే రైతులు మామిడి సాగుకు అవసరమైన, ప్రభుత్వ పరంగా కావాల్సిన సదుపాయాలు, రైతుల గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మార్కెటింగ్ సదుపాయాలు పెంచాలని కోరారు. తొలుత మామిడి పండ్లను మంత్రి, కలెక్టర్లు పరిశీలించి రైతులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ రాధాకిషోర్, సుబ్బారాయుడు, శ్రీనివాస్, ఉపేందర్‌రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దైవ సన్నిధికి వెళ్లొస్తూ దివ్యలోకాలకు...
*రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
*13 మందికి తీవ్ర గాయాలు
కుక్కునూరు, మే 8: మండల పరిధిలోని ఎల్లప్పగూడెం గ్రామ సమీపంలోని కల్వర్టును టాటా మ్యాజిక్ ఢీ కొన్న సంఘటనలో బుధవారం ఇరువురు మృతి చెందగా మరో 13 మం దికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.... బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన 14 మంది సభ్యులతో కూడిన కుటుంబం టాటా మ్యాజిక్‌లో మంగళవారం చిన్నతిరుపతికి వెళ్లారు. అక్కడ తమ చిన్నారి పుట్టెంటుకలను ఇచ్చి దైవదర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం బుధవారం సారపాకకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మరో కొద్ది సేపట్లో ఇంటికి క్షేమంగా చేరుకునే తరుణంలో విధి వారిపై కనె్నర్ర చేసింది. మండలంలోని ఎల్లప్పగూడెం గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి కల్వర్టును వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో టాటా మ్యాజిక్ డ్రైవర్ వేయంపాటి రామకృష్ణారెడ్డి (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే సీతమ్మ (45) కొన ఊపిరితో ఉండగా వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అదే విధంగా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న మరో 13 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. దీంతో 108 సంఘటనా స్థలానికి చేరుకొని భద్రాచలం ఏరియా వైద్యశాలకు క్షతగాత్రులను తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ అబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తీవ్రంగా గాయపడిన వారిలో సామంతుల చందు, బొబ్బిలి నిఖిల్ కుమార్, ఎస్ పాపారావు, ఎస్ ఆమని, అమ్ము, ఇ దుర్గారావు, ఇ సత్యావతి, ఇ నవత, ఈసర్ల చందు, ఇ దుర్గా ప్రసాద్, ఈసర్ల అరుణ, తేజ చరణ్, చిరులు ఉన్నారు. ఇదిలా ఉండగా పుట్టెంటుకలను తీయించాలని మొక్కుకున్న ఆ చిన్నారి అమ్మమ్మ సీతమ్మ మృతి చెందడంతో పాటు అంతా గాయపడటంతో ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలముకొన్నాయి. గ్రామ సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకొని ఇద్దరు మృతి చెందడంతో పాటు 13 మంది తీవ్ర గాయాలై పాలై రోదిస్తుండటాన్ని గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు.

రైతు రాజవ్వాలంటే జగనన్న రాజ్యం రావాలి
* వైకాపా నాయకురాలు షర్మిల
చండ్రుగొండ, మే 8: రాష్ట్రంలో రైతులు రాజుల్లాగా బతకాలంటే జగనన్న రాజ్యం రావాలని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర నాయకురాలు షర్మిల పిలుపునిచ్చారు. మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం మండలంలోని ఎర్రగుంట గ్రామంలో జరిగిన బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత చంద్రబాబు పాలనలో రైతులు భిక్షగాళ్ళుగా మారారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు రాజుల్లాగా వెలుగొందారని తెలిపారు. 16సంవత్సరాల కాలంలో ఈరాష్ట్ర ప్రజలు ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలు చూశారని, వారిలో చంద్రబాబునాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు విద్య, విద్యుత్, ఆరోగ్యం లాంటి 60సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను అన్నివిధాల ఆదుకున్నారన్నారు. ఆయన మరణాంతరం ప్రస్తుత కిరణ్‌ప్రభుత్వం చంద్రబాబు పాలనను మరిపిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ పథకాలు కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌పాలనలో లక్షల మంది యువతీ, యువకులను తన కన్నబిడ్డల్లాగా వైఎస్‌ఆర్ చూసుకున్నారని ఆమె తెలిపారు. చంద్రబాబునాయుడే కిరణ్‌సర్కార్‌ను బతికిస్తున్నారని, కిరణ్ ప్రభుత్వం ఎన్ని ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నాడని ఆమె ఆరోపించారు. సిబిఐ కేసులకు బయపడే చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్ష మద్దతు తెలుపుతున్నాడని ఆమె ఆక్షేపించారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై జగన్‌ను జైలుకు పంపారని, ఇది రాష్ట్రప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ఈరెండు పార్టీలకు ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. అంతకు ముందు ఉదయం దామరచర్ల శివారులో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల దామరచర్ల, మద్దుకూరు, గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. మద్దుకూరు గ్రామంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విరామం అనంతరం కట్టుగూడెం, ఎర్రగుంట, శాంతినగర్ గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగించారు. శాంతినగర్‌లో పార్టీ నాయకులు బూరుగుపల్లి కృష్ణారావు ఏర్పాటుచేసిన భారీ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆమె ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోత్ పద్మావతితో పాటు మండల కన్వీనర్ సారేపల్లి శేఖర్, కేసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, చుండ్రు విజయ్, బూరుగుపల్లి కృష్ణారావు, జంగా శ్రీనివాసరెడ్డి, భూపతి అప్పారావు, కడియాల పుల్లయ్య, సంకా కృపాకర్, ఎస్‌డి సైదా తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి సిఆర్‌పిఎఫ్ పోస్టుల భర్తీకి
శిక్షణ తరగతులు: కలెక్టర్
ఖమ్మం (మామిళ్ళగూడెం), మే 8: సెంట్రల్ రిజర్వు ప్రొటెక్షన్ ఫోర్సులో జిల్లా వ్యాప్తంగా 284 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో సిఆర్‌పిఎఫ్ పోస్టుల భర్తీపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుండి 25వ తేదీ వరకు అభ్యర్థులకు దేహదారుఢ్య, రాత పరీక్షలపై శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుమాయాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శిక్షణలో పాల్గొనే బిసి అభ్యర్థులకు బిసి స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇద్దరు ఇంగ్లీషు, గణితం ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పించనున్నట్లు పెర్కొన్నారు. ఈ భర్తీ ప్రక్రియ గురించి గ్రామాలలో విస్తృత ప్రచారం చేసి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొనే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. శిక్షణకు వచ్చే అభ్యర్థులు నూటికి నూరు శాతం ఉద్యోగ అర్హత సాధించే విధంగా అభ్యర్థులను తయారు చేయాలన్నారు. 5 కిలోమీటర్లు నిర్వహించనున్న రన్నింగ్ ప్రదేశాన్ని పందిళ్ళపల్లి ఏరియాలో పరిశీలించాలని తెలిపారు. ఈ ప్రక్రియను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని తెలిపారు. 5 కిలోమీటర్ల పరుగు నిర్వహించునప్పుడు అంబులెన్సు, మెడికల్ సిబ్బంది, మంచినీరును అందుబాటులో ఉంచాలన్నారు. నిరుద్యోగ యువకులకు ఇది ఒక చక్కని అవకాశమని, ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పాల్గొని ఈ శిక్షణా శిభిరాన్ని విజయవంతం చేయలని జిల్లా కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎవి రంగనాథ్, సిఆర్‌పిఎఫ్ భద్రాచలం బెటాలియన్ డెప్యూటీ కమాండర్ శంతన్‌కుమార్, ఏఆర్ కమాండెంట్ ఎసి నాగేశ్వరరావు, ఆర్‌ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి నడిబొడ్డున పేలుడు : బాలుడికి గాయాలు
భద్రాచలం, మే 8: భద్రాచలం పట్టణంలో ఐటిడిఏ పాత క్వార్టర్స్ సమీపంలో పేలుడు సంభవించింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఐటిడిఎ పాత క్వార్టర్స్‌లోని కల్వర్టు వద్ద భారీగా ఉన్న రాళ్ల సమూహాన్ని తొలగించే పనిలో రాళ్ళ మధ్య భారీ పేలుడు పదార్థాలను ఉంచి పని చేస్తున్న సిబ్బంది పేల్చారు. దీంతో వారు కూడా ఊహించని రీతిలో విస్పోటనం సంభవించడంతో కాలనీవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విస్పోటన శకలాలు 25 అడుగులకు పైగా ఎగిసిపడ్డాయి. ఇది భద్రాచలం- చర్ల ప్రధాన రహదారిపై ఉండటం గమనార్హం. రాళ్ల సమూహాన్ని తొలగించేందుకు ముందస్తు అనుమతి లేకుండా చుట్టు పక్కల వారికి సమాచారం ఇవ్వకుండా పని చేయించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా సంఘటనలో సాయి భరత్ అనే పదేళ్ల బాలుడి కాలికి గాయమైంది. దీంతో అతడిని వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో చేరుకుని స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా పేలుడు పదార్థం తీసుకొచ్చిన వారిపై చర్యలు చేపడతామన్నారు. కాగా సంఘటనా ప్రాంతాన్ని ఎఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, సబ్ కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, సిఐ శ్రీనివాసరెడ్డి, తహశీల్దారు నర్సింహారావు పరిశీలించారు.

ఎంసెట్ రేపే
* 32 పరీక్ష కేంద్రాలు
* 15,503 మంది అభ్యర్థులు
ఖానాపురం హవేలి, మే 8: ఈనెల 10వ తేదీన జరిగే ఎంసెట్ పరీక్షకు జిల్లాలో 15,503మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఎంసెట్ కన్వీనర్, పిజి కళాశాల ప్రిన్సిపాల్ సొల్లేటి కనకాచారి బుధవారం తెలిపారు. వీరి కోసం ఖమ్మంలో 32పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంజనీరింగ్ పరీక్షకు 11,845మంది అభ్యర్థులు హాజరుకానుండగా, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరిగే 7 పరీక్షా కేంద్రాల్లో మెడిసిన్ పరీక్షకు 3,658మంది హాజరుకానున్నారు. పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి స్థానిక పర్యవేక్షకుడితో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక పర్యవేక్షకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, జిల్లా రెవెన్యూ సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బంది, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచటంతో పాటు స్థానిక పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆయా పరీక్షాకేంద్రాల వద్దకు ఆయా కళాశాలల యజమాన్యాలు బస్సుల సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులంతా పరీక్ష సమయానికి గంట ముందుగా హాజరుకావాలని, అభ్యర్థులు హాల్ టిక్కెట్లను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవాలన్నారు.

పాల్వంచ ఏజెన్సీ కాదు
* గిరిజన చట్టాలు వర్తించవు
* కెటిపిఎస్ కర్మాగారాలూ గిరిజన చట్ట పరిధిలోకి రావు
* తెలంగాణ నాన్‌ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుల స్పష్టీకరణ
పాల్వంచ, మే 8: పాల్వంచ పట్టణం ఏజెన్సీ ప్రాంతం కాదని నాన్‌ఏజెన్సీ ప్రాంతమని కనుక ఇక్కడ ఎలాంటి గిరిజన చట్టాలు వర్తించవని, కెటిపిఎస్ కర్మాగారాలకు కూడా గిరిజన చట్టాలు వర్తించవని, అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న తప్పుడు ప్రకటనలు మానుకోవాలని, తెలంగాణ నాన్‌ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ నాయకుడు యలమర్తి రవీంద్రబాబు మాట్లాడుతూ గిరిజన చట్ట పరిధిలోనికి పాల్వంచ రెవెన్యూ పరిధిలోని ఒకటి నుండి 999సర్వేనెంబర్లు రావని, అదేవిధంగా కెటిపిఎస్ పాతప్లాంట్, 5,6దశల కర్మాగారాలు సైతం గిరిజన చట్టపరిధిలోకి రావని తెలిపారు. ఇటీవల కొత్తగూడెంకు వచ్చిన ఎస్‌టి కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఐటిడిఎ పిఓలు శాసనసభా స్పీకర్‌కు పాల్వంచ గిరిజన చట్టం పరిధిలోనికి వస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. జిల్లా అధికారులు తమ ఇష్టానుసారంగా చట్టాలను, రాష్టప్రతి ఉత్తర్వులను, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. పాల్వంచ రెవెన్యూ గ్రామం ఒక్కటేనని అయితే అధికారులు సంస్థాన్ పేరును ఉపయోగించి పాల్వంచను విడదీసి గిరిజన ప్రాంతం కిందకు వస్తుందని చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. పాల్వంచ గిరిజన ప్రాంతం కాదని, అదేవిధంగా కెటిపిఎస్ 5,6దశలు సైతం గిరిజన చట్టపరిధిలోకి రావనే విషయాన్ని అధికారులు, ప్రభుత్వం గ్రహించాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెటిపిఎస్‌లో సిఎల్ పోస్టులను గిరిజనేతరులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని, ఎపిజెన్‌కో అధికారులను కోరారు. గిరిజనేతరులకు ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈవిలేఖరుల సమావేశంలో జయరాజు, బాలకృష్ణ, ఎన్ వెంకటేశ్వర్లు, రాములు తదితరులు పాల్గొన్నారు.

దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
ఖమ్మం రూరల్, మే 8: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మండలంలోని తెల్దారుపల్లి తండాకు చెందిన భూక్యా రమేష్ (30)పై అదే గ్రామానికి చెందిన దోమనబోయిన పాండు, సైదులు, నరేష్, సతీష్, నాయిని శ్రీనులు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 3వ తేదీన దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలైన రమేష్ ఖమ్మంలోని ఓ ప్రైవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. బంధువుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు చెప్పారు.

వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు
కారేపల్లి, మే 8: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటానికి వచ్చిన వ్యక్తిపై దాడికి పాల్పడిన 12 మందిపై బుధవారం కారేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యతండాకు చెందిన జర్పుర రాంచంద్ అనే వ్యక్తి భార్య రామిని తీవ్రంగా కొట్టటంతో ఆమె మధ్యవర్తిగా పొదిలి వీరబాబును తీసుకొని మంగళవారం రాత్రి కారేపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది, దీనిని గమనించిన రాచంద్ అతని సోదరుడు బావ్‌సింగ్ మరో 10 మంది కలిసి కారేపల్లి బస్డాండ్ సెంటర్‌లో వీరబాబు, రామిపై దాడి చేసి గాయపర్చారు. వీరబాబు ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆరీప్‌ఆలీఖాన్ తెలిపారు.

విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
* డిఆర్‌డిఎ పీడీ పద్మజారాణి హెచ్చరిక

కామేపల్లి, మే 8: విధి నిర్వహణలో అలసత్వం, అలక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మజారాణి హెచ్చరించారు. బుధవారం కామేపల్లి స్ర్తి శక్తి భవనంలో కామేపల్లి ఏరియా పరిధిలోని గార్ల, ఏన్కూర్, చింతకాని, ఖమ్మం అర్బన్, కామేపల్లి మండలాలకు చెందిన ఐకెపి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె హాజరై ఐదు మండలాల వారీగా ఐకెపి ద్వారా చేపడుతున్న వివిధ పథకాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా స్ర్తి నిధి బ్యాంక్ లింకెజి, అభయహస్తం, పుస్తకాల నిర్వహణ, వాటి పరిశ్రమ ఎన్‌బిఎమ్‌తో పాటు వివిధ పథకాల సిబ్బంది పని తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్ర్తి నిధి లింకెజి రుణాలు అందరికి అందేలా చూడాలని, ఆదే విధంగా లబ్ధిదారులు నుండి చెల్లింపులు సరిగా లేవని వాటిని చెల్లించే విధంగా సిబ్బంది పని చేయాలని అన్నారు. వడ్డి లేని రుణాలు అందజేసిన అన్ని గ్రూపులకు పాస్ బుక్‌లు పంపిణీ చేయాలని అన్నారు. గ్రామ సమాఖ్య సమావేశాలు విధిగా నిర్వహించాలని ఆ సమావేశాలకు సిబ్బంది అందరు హాజరు కావాలని అన్నారు. సమాఖ్య సమావేశాలు జరుగుతున్న సమావేశాల్లో తాను ఆకస్మిక తనిఖీ చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఏపిఎంలు, సిబ్బంది ఏరియా కో ఆర్డినేటర్ త్రీపుర సుందరరావు, రాజేష్, శ్రీకాంత్, లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

నేటి దుస్థితికి నూతన ఆర్థిక విధానాలే కారణం
* సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా

ఖమ్మం (మామిళ్ళగూడెం), మే 8: అంతర్జాతీయంగా నేడు అనేక దేశాలలో వస్తున్న సంక్షోభాలకు, జాతీయాదాయ వృద్ధిరేటు గణనీయంగా తగ్గటానికి, ప్రజలపై విపరీతంగా భారాలు మోపటానికి నేడు అమలవుతున్న ఆర్థిక సంస్కరణలు, నూతనంగా తీసుకువచ్చిన ఆర్థిక విధానాలే కారణమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎం సాయిబాబా విమర్శించారు. బుధవారం స్థానిక మంచికంటి మీటింగ్ హాల్‌లో సిఐటియు శిక్షణా తరగతులలో భాగంగా ఆరవ రోజు జాతీయ, అంతర్జాతీయ పిరిస్థితులు అనే అంశంపై ఆయన మాట్లాడుతూ జాతీయంగా తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా జిడిపి తగ్గిందని, ఫలితంగా దీనినుండి బయట పడటానికి సబ్సిడీల తగ్గింపు, నిత్యావసర వస్తువుల ధరలు పెంపు, ఉత్పత్తితో సంబంధం లేకుండా స్పెక్యులేషన్, వ్యాపారం, ఉపాధిరహిత అభ్యున్నతి, వ్యవసాయ సంక్షోభం, చేతివృత్తులవారు ఉపాధి కోల్పోవటం, ప్రజా జీవన ప్రమాణాలు విపరీతంగా దిగజారిపోవడం, ఆత్మహత్యలు, ఆకలిచావుల పెరుగుదల, అవినీతి వంటివి గత 20 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగాయని ఆయన విమర్శించారు. దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గాయని, ఈ స్థితికి కారణం నేటి పాలకులు అనసరించిన సంస్కరణల ఫలితమే అని విమర్శించారు. అంతర్జాతీయంగా ఏకధృవ ప్రపంచంగా ఏర్పడుతుందన్నారు. లాటిన్ అమెరికాలో, అరబ్ దేశాలలో, తృతీయ ప్రపంచ దేశాలలో ఈ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై వ్యతిరేకంగా పెద్ద వ్యతిరేకత వస్తుందన్నారు. ఈ ప్రభావంకు మొదట బలయ్యేది కార్మికులేనన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి ఉందని, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కార్మికులు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులలో వంగూరి రాములు, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎజె రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, లింగయ్య, నర్సింహారావు, దేవి, కుమారి, ఉపేందర్, బాబురావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు తునికాకు కార్మికుడి మృతి
చింతూరు, మే 8: పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తునికాకు సీజన్ కావడంతో తునికాకు కార్మికులు తునికాకు సేకరణ పనిలో నిమగ్నమయ్యారు. ఈక్రమంలో మండలంలోని ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన మడకం మల్లెయ్య (50) అనే గిరిజనుడు బుధవారం సమీపంలోని అటవీ ప్రాంతంలోని తునికాకు సేకరణకు వెళ్లాడు. కాగా సూర్యుని ప్రతాపంతో పాటు వీస్తున్న వడగాల్పులకు స్పృహ కోల్పోయాడు. దీంతో తోటి కూలీలు మల్లెయ్యను ఇంటికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఇతడిపైనే ఆధారపడ్డ ఆ గిరిజన నిరుపేద కుటుంబం దిక్కును కోల్పోయింది. కాగా తునికాకు సేకరణలో వడగాల్పుకు గురై మృతి చెందిన మల్లెయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి కూలీలు కోరుతున్నారు.

జిల్లాలో విస్తృత ప్రచారం ఖండించిన అజయ్, జగన్‌ను వీడేదిలేదని స్పష్టీకరణ
english title: 
trs

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>