Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొత్త సార్లు సిద్ధం!

$
0
0

ఏలూరు, మే 8: బదిలీలపై సడలింపో లేక ఆ పోస్టుల ఆకర్షణోగాని పెద్దల ఆశీస్సులతో కొత్త సార్లు సిద్ధమయ్యారు. ఇక త్వరలోనే ఉత్తర్వులు జారీ కావటమే తరువాయిగా ఉంది. ప్రధానంగా జిల్లా స్ధాయి పోస్టుల విషయంలో గతంలో ఇక్కడ చేసినవారు, ఇప్పుడిక్కడ పనిచేస్తున్నవారు కూడా పెద్దల ఆశీస్సులను దండిగా సంపాదించుకున్నారు. వెనువెంటనే కావాల్సిన పోస్టులకు ఆశీస్సులు కూడా పొందారు. ముందస్తుగా జిల్లా పాలనలో కీలకంగా నిలిచే జిల్లా రెవిన్యూ అధికారి పోస్టు మరోనెలలో ఖాళీ కానుంది. ప్రస్తుతం డిఆర్వోగా పనిచేస్తున్న ఎం మోహనరాజు ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో చాలామంది ఈ పోస్టుపైనే టార్గెట్ పెట్టారు. అనుకున్నదే తడవు తమకు అనుకూలంగా ఉన్న పావులను కదుపుకుంటూ వచ్చారు. దీంతో ఒక అధికారికి మాత్రం దాదాపు పని అయిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ప్రభాకర్ అనే అధికారికి డిఆర్వో పోస్టుకు సంబంధించి ఆశీస్సులు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇక్కడ పోస్టు ఖాళీ కాగానే రంగప్రవేశం చేసేందుకు అనువుగా అన్ని పరిస్ధితులను చక్కదిద్దుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ గతంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీవోగాను, విశాఖపట్నం ఆర్డీవోగాను పనిచేశారు. దీంతో ఆయన సమర్ధతను తెలుసుకున్న కొంతమంది ప్రజాప్రతినిధులు ఆయనను ఇక్కడకు డిఆర్వోగా తీసుకువచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దానికనుగుణంగానే ఆయన కూడా ఈ ప్రయత్నాలు చేసుకున్నట్లు సమాచారం.
ఇక జిల్లా పాలనలోనే మరో కీలకమైన అంగం జిల్లా పరిషత్. ఈ కీలకమైన సంస్ధకు ప్రధానమైన పోస్టుల్లో అనిశ్చితి కొద్దికాలం నుంచి కొనసాగుతూనే ఉంది. జడ్పీ సిఇఓగా ఇటీవలే నారాయణ ఉద్యోగ విరమణ చేశారు. అంతకుముందు డిప్యూటీ సిఇఓ పోస్టు వ్యవహారంలోనూ పలురకాలైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏదీఏమైనా అప్పటివరకు జిల్లా పంచాయితీ అధికారిగా ఉన్న వి నాగార్జునసాగర్‌ను డిప్యూటీ సిఇఓగా ప్రభుత్వం నియమించింది. ఆతర్వాత కొద్దికాలానికే సిఇఓ నారాయణ ఉద్యోగ విరమణ చేయటంతో ఇన్‌ఛార్జి బాధ్యతలను నాగార్జునసాగర్‌కు అప్పగించారు. మరో నెలలో పంచాయితీ ఎన్నికలతోపాటు ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో ఈ కీలకమైన పోస్టు హాట్‌టార్గెట్‌గా మారిపోయింది. పరిపాలనాపరంగాను ఈ పోస్టు కీలకమైనదనే చెప్పుకోవాలి. ఇటువంటి పోస్టుకు ఇప్పుడు గతంలో జిల్లాలో డిఆర్‌డిఎ పిడిగా పనిచేసిన మారిశెట్టి జితేంద్ర ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆయనకు జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం వరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలకసంస్ధ కమిషనర్‌గా పనిచేసిన జితేంద్ర స్ధానంలో ప్రభుత్వ వేరొకర్ని నియమించటంతో ప్రస్తుతం ఆయన పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అందివచ్చిన అవకాశంగా పశ్చిమ జడ్పీ సిఇఓ పోస్టు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో మరో తిరకాసు కూడా లేకపోలేదు. రానున్నకాలంలో ఎన్నికల సమయం. అలాంటి సమయాల్లో సొంత జిల్లాకు చెందిన అధికారులను, మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతారు. జితేంద్రకు పశ్చిమ సొంతజిల్లానే. రానున్నది జడ్పీ ఎన్నికలే. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇక్కడ కల్పించినా ఎంతోకాలం కొనసాగే అవకాశాలు లేనేలేవని చెప్పుకోవాలి. అయినప్పటికీ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నందున పశ్చిమలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోస్టింగ్ కల్పించినా దానికి ముఖ్యమంత్రి అమోదముద్ర తప్పనిసరి. సొంత జిల్లాల్లో అధికారులను నియమించాలంటే తప్పనిసరిగా సిఎం అనుమతి కావాల్సిందే. ఈ లాంఛనం కూడా పూర్తయితే కొత్త జడ్పీ సిఇఓ జితేంద్ర అనే చెప్పుకోవాలి.
ఇక మరో సారు కూడా సిద్దమయ్యారు. ఆయనకు కూడా అవసరమైన ఆశీస్సులతోపాటు ఇతరత్రా పరిస్ధితులు కూడా అనుకూలంగా ఉన్నాయనే చెపుతున్నారు. గత కొద్దికాలంగా కొవ్వూరు ఆర్డీవో కొనసాగే వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారిపోతూ వచ్చింది. ఇక ఎంతోకాలం ఆయన ఈ పోస్టులో కొనసాగరన్న ప్రచారం అధికారవర్గాల్లో ఉంది. ఒకనొక సమయంలో ఆర్డీవో సూర్యారావు బదిలీ అయ్యారన్న ప్రచారం కూడా కొనసాగింది. అయితే ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఆయన ఆర్డీవోగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం బదిలీల సీజన్ రావటంతో ఆర్డీవోను తప్పనిసరిగా మారుస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో కొవ్వూరు ఆర్డీవోగా పోస్టింగ్ పొందేందుకు ప్రస్తుతం సివిల్ సప్లయిస్ డిఎంగా పనిచేస్తున్న సలీంఖాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా కీలకమైన ప్రజాప్రతినిధుల నుంచి భరోసా లభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా త్వరలో పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. ఇక డ్వామా పిడి ఎన్ రామచంద్రారెడ్డిని కూడా మాతృశాఖకు బదిలీ చేస్తూ కొద్ది నెలల క్రితమే ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆయన స్ధానంలో వేరొకర్ని నియమించకపోవటంతో కొత్త అధికారి వచ్చేంత వరకు ఆయనను కొనసాగాలని కలెక్టరు ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అయితే డ్వామా పిడిగా వచ్చేందుకు పలువురు తమదైనశైలిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ పెత్తనం ఎక్కువగా ఉండే డ్వామా పిడి పోస్టులోకి వచ్చేందుకు చాలామంది సుముఖంగా లేనట్లు సమాచారం. అదేవిధంగా ఎస్సీ కార్పోరేషన్ ఇడి, ఆర్‌విఎం పిఓ పోస్టులు కూడా గత కొద్దిరోజుల నుండి ఖాళీగానే ఉండిపోయాయి. ఈ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉండటంతో పలువురు ఈ పోస్టుల్లోకి వచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనా 15వ తేదీ నాటికి జిల్లా స్ధాయి పోస్టుల్లో చాలావరకు భర్తీ కానున్నాయని సమాచారం.
మళ్లీ మర్రిగూడెం
భూవివాదం
ఉద్రిక్తత
పలువురికి గాయాలు
బుట్టాయగూడెం, మే 8: మండలంలోని మర్రిగూడెంలో దళితరైతు బాషా రంపాలరాజుకు చెందిన భూములపై బుధవారం మరోసారి తీవ్ర వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌ఎస్ నెం.419, 418, 4171, 4172లలో ఉన్న సుమారు 14 ఎకరాల మామిడితోటలో పంట దింపటానికి రైతు రంపాలరాజు బుధవారం సమాయత్తమయ్యాడు. మామిడికాయలు ఎగుమతి చేయడానికి వచ్చిన లారీని మర్రిగూడెం గిరిజనులు అడ్డుకోవడంతో వివాదం మొదలయింది. లారీని అడ్డుకున్న గిరిజనులను రంపాలరాజు కుమారుడు రాజేష్, కాయలు కోయడానికి కూలీలుగా వచ్చిన నిమ్మలపాడుకు చెందిన కొండరెడ్లు గోగుల రమేష్, కరకాల బాబూరావు, కరకాల వెంకటరెడ్డి తదితరులు ప్రశ్నించడానికి వెళ్ళారు. దానితో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం దాడికి దారితీసింది. తమ కళ్లల్లో ఇసుక కలిపిన కారం చల్లి, బడితెలతో మోదారని, రాజేష్, రమేష్ తలలకు తీవ్రగాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించినట్లు రంపాలరాజు వర్గీయులు తెలిపారు. భూ వివాదం తేలకుండా కాయలు దింపడానికి అంగీకరించమని, అందుకే లారీని అడ్డుకున్నామని మర్రిగూడెం గిరిజనులు పేర్కొంటున్నారు. రంపాలరాజు కొండరెడ్డి గిరిజనులను రప్పించి, తమపై దాడికి ఉసిగొల్పడంతో మడకం అన్నపూర్ణ, గోరం సీత, కొమరం మల్లమ్మ, గోరం పార్వతి, కొమరం చెల్లారావులను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తున్నారు. గాయపడిన గిరిజనులను 108 అంబులెన్స్‌లో బుట్టాయగూడెం ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ చర్చలు ఏర్పాటు చేస్తామన్నారని, చర్చలు జరగకుండా తోటలో కాయలు కోయడానికి వీలులేదని గిరిజనులు వాదిస్తున్నారు. సంఘటనాస్థలానికి ముందుగా వచ్చిన జంగారెడ్డిగూడెం ఎస్సై బిఎన్ నాయక్ పరిస్థిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరించడంతో వివాదాస్పద భూ రికార్డులతో ఆర్డీవో నాన్‌రాజ్, డిఎస్పీ టి.రామకృష్ణారావు, సిఐ పి.మురళీ రామకృష్ణ, తహసీల్దారు ఎన్.నరసింహమూర్తి, సర్వే అధికారి కరాటం రామకృష్ణ మర్రిగూడెం చేరుకున్నారు. అమరికం లెక్క, ఫసలీ తదితర రికార్డులు గిరిజనులకు చూపించి, వాస్తవ పరిస్థితులు వివారించారు. భూములపై హక్కుకోసం న్యాయస్థానానికి వెళ్ళదలచుకుంటే న్యాయసహాయం కోసం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారికి సిఫార్సు చేస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం భూమి న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రంపాలరాజు ఆధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. తిరిగి వివాదాలు తలెత్తకండా పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు ఆదేశించారు. ఆర్డీవో నాన్‌రాజు మర్రిగూడెం గిరిజనులకు పలు పరిష్కార సూచనలు చేసారు. అధికారులు తిరిగి వెళ్ళిపోతుండగా చివరగా బయలుదేరిన తహసీల్దార్ వాహనాన్ని గిరిజనులు అడ్డగించి, కొండరెడ్లు చేసిన దాడికి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వెళ్ళిపోయిన ఆర్డీవో ఈ సమాచారం తెలుసుకుని, మళ్ళీ వెనక్కివచ్చి, గిరిజనులతో చర్చించి, గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, తహసీల్దార్ కారును బయలుదేరతీసారు. ఎస్సైలు ఆనందరెడ్డి, శేషగిరిరావు, ఎ ఎస్సై రామకృష్ణ, ఆర్‌ఐ రమేష్, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ తదితరులు హజరయ్యారు.

తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ
అధ్యక్షురాలిగా చిట్టూరి
తణుకు, మే 8: తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా వేల్పూరు గ్రామ కాంగ్రెస్ నాయకురాలు చిట్టూరి కనకదుర్గ, వెంకట సునందను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పీఠంపై పశ్చిమ గోదావరి జిల్లాలో రెండోసారి మహిళను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గతంలో 1985లో ఈలి వరలక్ష్మి తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మొదటిసారి నియమితులయ్యారు. ఆ తరువాత రెండున్నర దశాబ్దాల అనంతరం జిల్లాలో ఒక మహిళను ఎఎంసి ఛైర్మన్‌గా నియమించడం శుభసూచకమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా గుబ్బల శ్రీనివాసరావు, సభ్యులుగా కారంపూడి సత్యవతి, గారపాటి రాజప్రతాప్, షేక్ సాతార్ సాహెబ్, దుర్గా నాగేశ్వరరావు, గంటా వెంకటరత్నం, మేడపాటి రంగారెడ్డి, మాజేటి వెంకట సూర్య నాగేశ్వర ప్రసాద్, పరిమి వీర వెంకట సత్యనారాయణ, మద్దాల శ్రీనివాసరావు, ట్రేడర్స్ ప్రతినిధులుగా బండి భాస్కరరావు, గజ్జరపు వెంకట్రావు, రెడ్డి వీర వెంకటరత్నం నియమితులయ్యారు.

మోడల్ సొసైటీలుగా 25 సహకార సంఘాలు
దేవరపల్లి, మే 8: రైతులకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో 25 సహకార పరపతి సంఘాలను మోడల్ సొసైటీలుగా తీర్చిదిద్దుతామని నాబార్డు జిల్లా మేనేజర్ టి వెంకటకృష్ణ వెల్లడించారు. దేవరపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సమావేశంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయరంగంతో పాటు ఇతర రంగాల్లో కూడ రైతులు అభివృద్ధి సాధించడానికి జిల్లాల్లో 250 సొసైటీలున్నాయని, వాటిలో 25 సొసైటీలను మోడల్ సొసైటీలుగా ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేసిన మోడల్ సొసైటీల ద్వారా పరపతేతర వ్యాపారాలకు కూడ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మోడల్ సొసైటీ పరిధిలో రైతులు 20 మంది సంఘంగా ఏర్పడి రైతుక్లబ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రైతుక్లబ్‌కు నాబార్డు తరఫున ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇతర రుణాలు కూడ అందచేస్తామని ఆయన వెల్లడించారు. సొసైటీ అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ రైతులకు టైఅప్ రుణాలివ్వాలని, కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు కూడ రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. బంగారంపై రుణాలకు వడ్డీశాతం తగ్గించాలని కోరారు. సొసైటీల ద్వారా దీర్ఘకాలిక రుణాలివ్వాలని, ట్రాక్టర్లు, బోర్లకు, పాడిగేదెలకు రుణాలు సమకూర్చాలని కోరారు. సంఘ కార్యదర్శి కల్లూరి శ్రీనివాస శర్మ మాట్లడుతూ దేవరపల్లి సంఘం ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా డెవలప్‌మెంట్ సేల్ మేనేజర్ సురేష్‌ప్రభు, సొసైటీ డెవలప్‌మెంట్ సేల్ సభ్యులు సూర్యప్రకాశం, బాలకృష్ణ, యర్నగూడెం బ్రాంచి మేనేజర్ డిఎన్‌వి ప్రసాద్, సూపర్‌వైజర్ మోహనరావు, డైరెక్టర్లు దుగ్గిన గంగరాజు, దొమ్మేటి శ్రీను, పిచ్చికల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బెల్టుషాపులపై దాడి
ఏలూరు, మే 8 : పెదపాడు, పెదవేగి, ఏలూరు మండలాల పరిధిలోని బెల్టుషాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. పెదపాడు మండలం వట్లూరు, పెదవేగి మండలం కొప్పాక, పెదవేగి గ్రామంతోపాటు ఏలూరు మండలంలోని పలు గ్రామాలతోపాటు నగరంలోని బెల్టుషాపులపై దాడులు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న విక్రేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీహరి తెలిపారు. ఈ దాడులను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
బాలికపై వృద్ధుడు అత్యాచారం
*దేహశుద్ధి చేసిన స్థానికులు*కేసు నమోదు చేసిన పోలీసులు
ఏలూరు, మే 8 : కామవాంఛతో కళ్లు మూసుకుపోయిన ఒక వృద్ధుడు అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏలూరు మండలం శనివారపుపేట గ్రామంలో ఈ అత్యాచార ఘటన 15 రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు త్రీటౌన్ ఎస్ ఐ కె శ్రీనివాసరావు కధనం ప్రకారం ఏలూరు మండలం శనివారపుపేట గ్రామంలో తాడి ప్రకాశం అనే 55 సంవత్సరాల వృద్ధుని ఇంటిలో బాపల విజయకుమారి, ఆమె భర్త సత్యనారాయణ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అద్దెకు ఉంటోంది. షెడ్యూల్డు కులానికి చెందిన బాపల విజయకుమారి, సత్యనారాయణలు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. 15 రోజుల క్రితం ఇంటి యజమాని తాడి ప్రకాశం తన ఇంటిలో అద్దెకు వుంటున్న విజయకుమారి చిన్న కుమార్తె అయిన అయిదు సంవత్సరాల వయస్సున్న బాలికను తన ఇంటిలోకి పిలిచాడు. కందిపప్పు తీసుకురావాలంటూ బాలికను పంపించాడు. ఆ బాలిక కందిపప్పు తీసుకువచ్చి ప్రకాశానికి ఇచ్చింది. అయితే ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంటిలో వున్న నుయ్యిలో పడేస్తానని బాలికను ప్రకాశం బెదిరించాడు. దీంతో భయపడిన ఆ బాలిక విషయాన్ని గోప్యంగా ఉంచింది. అయితే గత కొద్దిరోజులుగా ఆ బాలిక నలతగా ఉండటాన్ని పక్కింటి మహిళ గుర్తించింది. ఆ మహిళ బాలికను పిలిచి ఆరా తీయగా విషయం బయటపడింది. ఆ మహిళ బాలిక తల్లి విజయకుమారికి జరిగిన విషయాన్ని చెప్పింది. విషయం ఆనోటా ఈనోటా చుట్టు ప్రక్కల ప్రజలకు చేరడంతో వారంతా వచ్చి ప్రకాశాన్ని జరిగిన విషయంపై నిలదీశారు. అంతటితో ఆగకుండా వారంతా ప్రకాశానికి దేహశుద్ధి చేసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఏలూరు డి ఎస్‌పి ఎం రజనీ ఆధ్వర్యంలో అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు తాడి ప్రకాశంపై 376 ఐపిసి (ఎఫ్) సెక్షన్ 3(2)(వి) ఎస్‌సి, ఎస్‌టి 1989 చట్ట ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు దారుణం
ఏలూరు, మే 8 : విద్యుత్ ఛార్జీలను మోయలేనంతగా పెంచేసి మరో ప్రక్క రోజుకు ఎనిమిది గంటలు పాటు విద్యుత్ కోతను అమలు చేయడం దారుణమని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అంబికా కృష్ణ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టుటౌన్ మెయిన్ రోడ్డులోని గంగానమ్మ గుడి వద్ద నుండి మధులత సెంటర్ వరకు సంతకాల సేకరణను ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ఈ నెల నుండి 6 వేల కోట్ల పైచిలుకు విద్యుత్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సర్దుబాటు ఛార్జీల పేరుతో రెండు విడతలుగా మరో రెండు వేల కోట్ల రూపాయలు వడ్డించడం పేద ప్రజల నడ్డి విరవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో సాధారణ ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా చిన్నపాటి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అంబికా కృష్ణ విరుచుకుపడ్డారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ తాగడానికి మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నాయకులు కొల్లేపల్లి రాజు, ఉప్పాల జగదీష్‌బాబు, ఈడ్పుగంటి నరసింహారావు, పాలి ప్రసాద్, పెద్దిబోయిన శివప్రసాద్, చల్లా అప్పలరాజు, శెట్టి కళావతి, బంకా రామమోహనరావు, అద్దంకి శ్రీరామచంద్రమూర్తి, నాయుడు పోతురాజు, నెరుసు గంగరాజు, ఎం నర్సయ్య, ఒబిలిశెట్టి మల్లిఖార్జునరావు, జంపా సూర్యనారాయణ, గొర్రెల సూర్యనారాయణ, చింతల రాంబాబు, రేగాని మహాలక్ష్మీ నాయుడు, పి గంగరాజు, చింతాడి కనకారావు, తేరా వెంకటేశ్వరరావు, నక్కా సుబ్బారావు, బేతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయంపట్ల కొత్తపల్లి హర్షం
మొగల్తూరు, మే 8: కర్నాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించటం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నరసాపురం ఏమ్మేల్యే కొత్తపల్లి సూబ్బారాయుడు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలో కెపి పాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సమాచారాన్ని తెలుసుకున్న ఆయన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న సార్వతిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించటం ఖాయమని ఈ ఎన్నికలు రుజువు చేస్తూన్నాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని 121 సీట్లతో గెలిపించటం పార్టీపై ఉన్న అపారమైన నమ్మకమని నిదర్శనమని ఆయన తెలిపారు. కేంద్ర నాయకత్వం పైన, కాంగ్రెస్ చైర్‌పర్సన్ సోనియగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన మంచి పరిపాలనపై ఆ రాష్ట్ర ప్రజలు ముందుగా ఇచ్చిన ప్రజా తీర్పుగా ఆయన అభివర్ణించారు. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతుందని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణల నాయకత్వంలో మళ్లీ కాంగ్రెస్‌పార్టీకి మరిన్ని మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు.

సెమీఫైనల్స్‌కు హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు
భీమవరం, మే 8: స్ధానిక భారతీయ విద్యాభవన్స్‌లో జరుగుతున్న మల్లినీడి సత్యనారాయణమూర్తి మెమోరియల్ మూడవ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుఘల హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారం సెమిఫైనల్స్‌కు చేరాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటారు. బుధవారం క్వార్టర్ ఫైనాల్స్‌లో పశ్చిమగోదావరి జట్టుపై కడప జట్టు 4-5స్కోరుతో విజయం సాధించింది. నెల్లూరు జట్టుపై చిత్తూరుజట్టు 2-6స్కోరుతో విజయం సాధించింది. తూర్పుగోదావరి జట్టుపై నిజామాబాద్ జట్టు 2-3స్కోరుతో విజయం సాధించింది. విజయనగం జట్టుపై విశాఖపట్నం జట్టు 0-6స్కోరుతో విజయం సాధించింది. అనంతరం సెమిఫైనాల్స్‌లో నిజామాబాద్ జట్టుపై చిత్తూరుజట్టు 0-3స్కోరుతో విజయం సాధించింది. విశాఖపట్నం జట్టుపై కడప జట్టు 2-3స్కోరుతో విజయం సాధించింది. గురువారం జరగబోయే ఫైనాల్స్‌లో చిత్తూరు- కడపజట్లు పోటీపడుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.
సినీ ఎగ్జిబిటర్ కరాటం మృతి

జంగారెడ్డిగూడెం, మే 8: డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు తమ్ముడు, సినీ ఎగ్జిబిటర్ కరాటం మురళి (60) మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన విజయవాడ డాక్టర్ రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో జంగారెడ్డిగూడెం, పరిసర మండలాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళి భౌతిక కాయాన్ని జంగారెడ్డిగూడెంలోని ఆయన స్వగృహానికి ఉదయం తరలించారు. ఆయన అభిమానులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, పోలవరం ఎఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు, చింతలపూడి ఎఎంసి ఛైర్మన్ మేడవరపు అశోక్‌బాబు, మహాత్మాఫూలే అవార్డు గ్రహీత డికెడి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావు, డియ్యస్పీ టి.రామకృష్ణారావు, ఉషాపిక్చర్స్ అధినేత వివి బాలకృష్ణారావు, పోలవరం ఎఎంసి వైస్ ఛైర్మన్ మట్టా సత్తిపండు, విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, కాంగ్రెస్ నేతలు మండవల్లి విజయసారథి, కొండపల్లి కేశుబాబు, కర్రా శ్రీ్ధర్, పిపిఎన్ చంద్రరావు, పరిమి సత్తిపండు, ముప్పిడి శ్రీనివాసరావు, ఉక్కుర్తి దుర్గారావు, మేడవరపు విద్యాసాగర్, రావూరి కృష్ణ, అచ్యుత శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, వైఎస్‌ఆర్‌సి పార్టీ నేతలు తల్లాడి సత్తిపండు, పోల్నాటి బాబ్జి, పాశం రామకృష్ణ, గూడపాటి రాధాకృష్ణ, చనమాల శ్రీనివాసరావు, కేమిశెట్టి మల్లిబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు మండవ లక్ష్మణరావు, నందిన హరిశ్ఛంద్ర, గంగిరెడ్ల మేఘలాదేవి, షేక్ ముస్త్ఫా, పెనుమర్తి రామ్‌కుమార్, కొండ్రెడ్డి సోమరాజు, సిపిఐ నేత బూరుగుపల్లి సూరిబాబు, ఇంకా పలు పార్టీల నేతలు, పలువురు సినీ ఎగ్జిబిటర్లు, అభిమానులు ఆయన భౌతిక కాయంపై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. మురళీ సోదరులు కరాటం రాంబాబు, కరాటం వెంకటరెడ్డి నాయుడు, కరాటం ఉమామహేశ్వరరావు, మురళి కుమారుడు కార్తీక్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళి భౌతిక కాయాన్ని కొద్దిసేపు సౌభాగ్య ధియేటర్ల ఆవరణలో ఉంచి, ఆయన స్వగ్రామం బుట్టాయగూడెంలో అంత్యక్రియలకు తరలించారు. కాగా, మురళికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె, కుమారునికి వివాహాలు చేసారు. ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్‌గా పలు నిర్మాణాలు చేసిన ఘనత మురళికి ఉంది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆశక్తి లేనప్పటికీ మురళి ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీలోను, తరువాత కాంగ్రెస్ పార్టీలోను కొనసాగారు. కొద్దికాలం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కూడా పని చేసారు.

*డిఆర్వోగా ప్రభాకర్*జడ్పీ సిఇఒగా జితేంద్ర*కొవ్వూరు ఆర్డీవోగా సలీంఖాన్ *ఆశీస్సులు జారీ*ఉత్తర్వులే తరువాయి*మరికొన్ని పోస్టులకు కూడా
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>