అనకాపల్లి , మే 10: రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లాకే నీలం తుఫాన్ పంట నష్టపరిహారం కింద 37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన రైతు సదస్సులో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడారు. ఈ నష్టపరిహారం లక్షా 40 వేల మంది రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుందని కలెక్టర్ అన్నారు. అకౌంట్ లేని రైతులు బ్యాంక్ అకౌంట్లు తెరవాలని, దీనికి బ్యాంకులన్నీ రైతులకు సహకరించి అకౌంట్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్ల సదస్సులో చెప్పామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సహకరించాలన్నారు. ఈ నష్టపరిహారం సొమ్ము రైతులకు అందకుండా బ్యాంక్‌లో జమ అవుతుండటంతో వారి బాకీలు కింద జమ చేసుకుంటారని రైతులు అపోహలో ఉన్నారని, అటువంటిదేమీ లేదని బ్యాంకర్లకు, రైతులకు సొమ్ము అందించేలా ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు పలు సబ్సిడీలు మీద రుణాలు, విత్తనాలు, ఎరువులు అందిస్తుంది. రైతులు సద్వినియోగం చేసుకుని పంటలు అధిక దిగుబడి సాధించాలన్నారు. వ్యవసాయ శాఖాధికారులు సలహాలు, సూచనలతో మేలైన రకాల వంగడాలు ఎంపిక చేసుకుని ఎరువులు, పురుగుల మందులు వాడి మేలైన పంటలను పండించి మిగతా రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. వ్యవసాయాధికారులు అందించే రైతు శిక్షణ లకు తప్పనిసరిగా హాజరై శిక్షణ పొందాలని, దీనిద్వారా రైతులకు పలు సందేహాలు తొలగిపోతాయన్నారు. రైతులకు ఎరువులు విత్తనాల కొరత లేకుండా చూడాలని, అలాగే రైతులకు ఎక్కడ సీడ్ సెంటర్ దగ్గర కావాలో తెలిపితే అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సీజన్‌లో మత్స్యకారులకు పనిలేకుండా వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం ఉందని వారికి ఆహార పథకం కింద మూడు వేల మెట్రిక్ టన్నులు బియ్యం ప్రభుత్వం పంపిణీ చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. బియ్యం తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు బాగా పడి రైతులు ఎక్కువ దిగుబడి సాధించాలని ఆయన అన్నారు. అలాగే రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలను రైతులు ఉపయోగించుకుని పంటలు పండిస్తున్నారని, కానీ ఏనాడు వారికి సరైన గిట్టుబాటుకు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులు రుణాలను కూడా చెల్లించ లేకపోతున్నారన్నారు. పరిశోధనా కేంద్రం ఎడిఆర్ అంకయ్య మాట్లాడుతూ రైతులు డ్రమ్‌సీడర్ ద్వారా పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని, వర్షాలు తక్కువ పడుతున్న సమయాల్లో డ్రమ్‌సీడర్, బిందు సేద్యం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ పరిశోధనా స్థానంలో 20మంది శాస్తవ్రేత్తలు ఉన్నారని, రైతులు వారి సలహాలు, సూచనలు క్షేత్రస్థాయిలో ఉపయోగించుకుని మేలురకాల పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు రైతు సదస్సులో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఫలసాయ పనిముట్ల స్టాల్స్‌ను కలెక్టర్ శేషాద్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, ఎంపిడిఒ ఇ. సందీప్, డిప్యూటీ తహశీల్దార్ భాస్కరరావు, ఆదర్శ రైతులు, రైతులు పాల్గొన్నారు.
కలెక్టర్ శేషాద్రి
english title:
neelam
Date:
Saturday, May 11, 2013