సింహాచలం, మే 10: సింహాచలం దేవాలయంలో 13వ తేదీన జరగనున్న సింహాద్రినాథుని నిజరూపదర్శనం చందనయాత్రకు సంబంధించి దేవస్థానం అధికారులు అధికారికంగా శుక్రవారం ఒక ప్రకటన చేశారు. 12వ తేదీ ఆదివారం సాయంత్రం నుండి చందనోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయంలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఆ రోజు ఆరుగంటలకే సర్వదర్శనాలు నిలిపివేస్తున్నారు. అనంతరం దివిటీ సలాం, దీపారాధన, మూర్తి కలశారాధన, ఆరాధన, రాత్రి 11 గంటలకు పవళింపుసేవ, కవాట బంధనం నిర్వహిస్తామని వారు తెలిపారు. 13వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాతసేవ, 2 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, కలశారాధన, చందనోత్సవం, 3.30 నిమిషాలకు వ్యవస్థాపక ధర్మకర్తల తొలి దర్శనం, 4 గంటలకు భక్తుల సర్వదర్శనం, రాత్రి 9 గంటలకు సహస్రఘటాభిషేకం, 12 గంటలకు శీతలోపచారాలు జరుగుతాయి. అనంతరం ఈ చందనోత్సవం సందర్భంగా వచ్చే విఐపిల వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తామని దేవస్థానం వారు తెలిపారు. కొండదిగువ గోశాల, దేవస్థానం ఇఓ కార్యాలయం, ఆంధ్రాబ్యాంకు, పాత అడివివరం జంక్షన్‌ల వద్ద పార్కింగ్ కేటాయించడం జరిగిందని దేవస్థానం అధికారులు చెప్పారు. పార్కింగ్ ప్రదేశాల నుండి ఉచిత ప్రత్యేక బస్సులున్నట్లు తెలిపారు. దర్శనం టిక్కెట్లను ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకు సింహాచలం బ్రాంచ్‌లతో పాటు నగరంలోని సీతమ్మధార, వాల్తేరు, అక్కయ్యపాలెం, మహారాణిపేట, మురళీనగర్, ద్వారకానగర్, కొత్తరోడ్డు, స్టీల్‌ప్లాంట్, గాజువాక, ఎయు క్యాంపస్, ఎంవి, మధురవాడలలోని ఆంధ్రాబ్యాంకు శాఖలలో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అడివివరం గ్రామీణ బ్యాంకు, కొత్తవలస ఇండియన్ బ్యాంకుల్లో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
విఐపిల ఫోన్ కాల్స్‌తో ఈవో ఉక్కిరిబిక్కిరి
సింహాచలం, మే 10: రాజకీయ నాయకుల పిఒలు, అధికారుల సిసిల వద్ద నుండి ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఫోన్‌కాల్స్ సింహాచల దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌చే నీళ్లు తాగిస్తున్నాయి. చందనోత్సవ పాసుల కోసం ఆయనను ఒత్తిడి చేస్తున్నారు. ఫ్రీ పాసులు లేవు... టిక్కెట్లు తీసుకోవాలంటూ సమాధానం చెప్పడం ఈవోకు కత్తి మీద సాములా తయారైంది. ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శనం కోసం రూ.500 టిక్కెట్లు విఐపిల కొరకు, మిగిలిన వారి కోసం సాధారణ రూ.500ల టిక్కెట్లు ఉన్నాయంటూ ఈవో చెబుతున్నారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాట మేం వింటున్నాం... చివర్లో పాసులిస్తారు’ అంటూ ఆయనతో వాదనకు దిగినవారూ లేకపోలేదు. టిక్కెట్లే తీసుకుంటాం కానీ మాకు విఐపిల టిక్కెట్లు ఇవ్వాలంటూ ఆయనను వేధిస్తున్నారు. ఒకపక్క ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వస్తున్న మంత్రులు, అధికారులు, మరోపక్క ఈ రకమైన ఫోన్‌కాల్స్‌తో ఈవో పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఈ టిక్కెట్ల నిమిత్తం సూపరింటెండెంట్‌ని ఏర్పాటు చేసినా ఈవోకు ఫోన్‌కాల్స్ తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు.
విజయావకాశాలున్న అభ్యర్థులను డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోండి
* డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ
చోడవరం, మే 10: గోవాడ సహకార చక్కెర కర్మాగారం పాలకవర్గ ఎన్నికలకు విజయావకాశాలుఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకుని డైరెక్టర్లుగా గెలిపించేందుకు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ సూచించారు. శుక్రవారం స్థానిక శ్రీనివాస కల్యాణమండపంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ పదవి ఆశావహుల్లో విజయావకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసి డైరెక్టర్లుగా గెలిపించుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా ఏర్పడిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సహకార చక్కెర కర్మాగారాలకు పునరుజ్జీవం కల్పించి ప్రైవేటుపరం కాకుండా కాపాడామన్నారు. ఫ్యాక్టరీ పరిధిలోని 13సెగ్మెంట్లకు ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల్లో డైరెక్టర్లను ఎంపిక చేసుకుని పిదప చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకుంటారన్నారు. అంతకుముందు పలువురు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించాలని, తర్వాతే డైరెక్టర్లుగా పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసుకోగలమని కోరినప్పటికీ ఆయన ఆ అంశాన్ని తిరస్కరించారు. ముం దుగా డైరెక్టర్లను ఎంపిక చేసుకున్న మీదటనే చైర్మన్‌ను ఎన్నుకుంటారన్నారు. సవరించిన సహకార ఎన్నికల చట్టప్రకారం గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రధానంగా అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌పార్టీ పటిష్ఠంగా ఉందని, ఇందుకు నిదర్శనం ఇటీవల పిఎసిఎస్‌ల ఎన్నికల్లో 22సంఘాలను కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు కైవసం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒకసారి అవకాశం రాలేదని బాధపడేకన్నా మరో అవకాశం కోసం ఎదురుచూడాలని ఆయన సూచించారు. కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీ అదిష్ఠానం గుర్తిస్తుందని, అటువంటి వారికి నామినేటెడ్ పదవులను కట్టబెడతారన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పతివాడ అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పి.సతీష్‌వర్మ, రోలుగుంఠ మండలానికి చెందిన కృష్ణారావు, రావికమతం మండలానికి చెందిన జగ్గారావు, బుచ్చయ్యపే ట మండలం నుండి దొండా రాంబాబు, మాడుగుల మం డలం నుండి శానాపతి గంగారావు, చీడికాడ మండలం నుండి సుంకరి రుద్రి సుగర్స్ ఎన్నికలలో అనుసరించాల్సిన విధివిధానాలు, డైరెక్టర్ల ఎంపికపై తీసుకుంటున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూడెడ్ల శంకరరావు, దేవరపల్లి సన్యాశిరావు, సుంకరి శ్రీనివాసరావు, మొల్లిప్రసాద్, ఉప్పల గణనూకరాజు పాల్గొన్నారు.
‘కోనాం రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలి’
చీడికాడ, మే 10: కోనాం రిజర్వాయర్ నీటిని పంటలకు వెంటనే విడుదల చే యాలని రిజర్వాయర్ ఆయకట్టు రైతులు కోరుతున్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 95 మీటర్ల వరకు నీరు ఉంది. కాస్తున్న ఎండలకు చెరుకుతోటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు వారం రోజులు ఇదే మాదిరిగా కాస్తే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని గతనెల రైతులు ఆం దోళన చేస్తే వారం రోజులు ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారని, కాలువలో పూడికలు తీస్తామన్న సాకుతో రిజర్వాయర్‌లో నీటిని బ యటకు రాకుండా తలుపులు బిగించారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
అనకాపల్లి , మే 10: స్థానిక భీమునిగుమ్మం సెంటర్‌లో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్ సమీపంలోని భీమునిగుమ్మం సెంటర్‌లో నివాసముంటున్న బొడ్డేడ ఉదయకుమారి(28) అనే మహిళ శుక్రవారం ఉదయం చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రెండురోజుల క్రితం భార్యభర్తలు గొడవపడి భర్త 7వ తేదీన అనుమానాస్పదంగా మరణించాడు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఆమె భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక పాప ఝాన్సీ(5), బాబు జగదీష్(2) ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అనాథలయ్యారు. ఈ పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుళ్లిన గొర్రెలు, మేక తలలు స్వాధీనం
విశాఖపట్నం, మే 10: కుళ్లిన, నిల్వ ఉంచిన మాసం ఉత్పత్తులను గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి హనుమంతవాక కబేళాను జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పివి రమణమూర్తి తన సిబ్బందితో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కబేలాలో పెద్ద సంఖ్యలో ఉన్న గొర్రె, మేక తలలు, కాళ్లను గుర్తించి వాటిని పరీక్షించారు. ఈ ఉత్పత్తులు కుళ్లి, దుర్గంధపూరితంగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరీక్షలకు పంపారు. ఒడిశా సహా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గొర్రె, మేక తలలను, మాసాంన్ని తెచ్చి ఇక్కడ కబేళా వద్ద విక్రయిస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందడంతో అధికారులు దాడులు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తూ ప్రజలు, వినియోగదారులకు హాని చేస్తున్న వారిపై జివిఎంసి ప్రజారోగ్య విభాగం అధికారులు కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన మాసం ఉత్పత్తులను కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించి పూడ్చిపెట్టారు. మాసం ఉత్పత్తులు విక్రయిస్తున్న ముగ్గురు మహిళలపై ఆరిలోవ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ కుళ్లి, పాడైన మాసం ఉత్పత్తులను తినడం వల్ల అనారోగ్యానికి గురికావడంతో పాటు ప్రాణాపాయం కూడా తప్పదని పేర్కొన్నారు. కుళ్లి గొర్రె,మేక తలలను కాల్చి విక్రయించడం వల్ల వాటి నాణ్యతను వినయోగదారులు గుర్తించలేరని, అయితే వీటిని తినడం వల్ల ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇటువంటి వాటిని కొనుగోలు చేసేప్పుడు వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇకమీదట ఇటువంటి వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈదాడుల్లో నగర వెటర్నరీ అధికారి డాక్టర్ రామ్మోహన్, నాయక్, భాస్కరరావు పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి సస్పెన్షన్
జివిఎంసిలో ఫుడ్ సేఫ్టీ అధికారిగా పనిచేస్తున్న డివి అప్పారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఎంవి సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఆహార పదార్ధాల నమూనాలను సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించిన కమిషనర్ ఈనిర్ణయం తీసుకున్నారని జివిఎంసి ప్రధాన వైద్యాధికారి రమణమూర్తి తెలిపారు. సస్పెండైన ఫుడ్ సేఫ్టీ అధికారి విధి నిర్వాహణలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
నిరాశపరచిన జితేంద్ర సింగ్
విశాఖపట్నం, మే 10: కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ షిప్ యార్డు కార్మికులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ఆయన షిప్‌యార్డుకు వచ్చి తమ సమస్యలను వింటారని, వాటికి పరిష్కార మార్గం చూపుతారని కార్మికులు భావించారు. కానీ అలా జరగలేదు. కనీసం కార్మిక సంఘాల నాయకులతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. షిప్‌యార్డు తయారు చేసిన అవంతిబాయి నౌకను మంత్రి గురువారం జల ప్రవేశం చేయించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మంత్రి జితేంద్ర సింగ్ షిప్‌యార్డు ఎండితో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాతైనా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడతారనుకుంటే, ఏమాత్రం వారితో మాట్లాడకుండా, వారిచ్చిన వినతిపత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. వాస్తవానికి మంత్రి జితేంద్ర సింగ్ గత నెల ఎనిమిదో తేదీన షిప్‌యార్డుకు రావలసి ఉంది. ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఎట్టకేలకు గురువారం షిప్‌యార్డుకు వచ్చిన ఆయన కార్మిక సమస్యలను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. షిప్‌యార్డుకు ఆర్డర్స్ విషయంలో మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముందు కోస్ట్‌గార్డ్, నేవీ నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు. అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్స్ కార్యదర్శి కూడా షిప్‌యార్డుకు కొత్త ఆర్డర్స్ ఇస్తామన్న స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలి : అఖిలపక్షం
పెదగంట్యాడ, మే 10: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు గంగవరం పోర్టు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గత అయిదు రోజుల నుండి కార్మికులు తమ సమస్యలపై స్పందించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నా పట్టించుకోని పోర్టు యాజమాన్యం వైఖరిని నిరసిస్తు శుక్రవారం గంగవరం పోర్టు రోడ్డులో నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. పోర్టు యాజమాన్యం మొండి వైఖరి నశించించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. కార్మికులు చేపట్టే ఉద్యమం తీవ్ర రూపం దాల్చకుండా అధిక సంఖ్యలో పోలీసులు శిబిరం వద్ద మోహరించారు. కార్మికులు పోర్టు కార్యాలయం దరిదాపులకు వెళ్లకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ముందుగా సౌత్ ఎసిపి కె.వెంకటరమణ సిబ్బందితో శిబిరం వద్దకు చేరుకుని కార్మికులు, నాయకులతో చర్చలు జరిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, పోర్టు యాజమాన్యంతో చర్చించి తగు న్యాయం జరిగేలా చూస్తానని ఎసిపి వారికి బరోసా ఇచ్చారు. అనంతరం పోర్టు యాజమాన్యంతో ఎసిపి చర్చించిన మీదట కార్మికుల సమస్యలపై శనివారం పోర్టు ప్రతినిధులు సమావేశం జరపడానికి అంగీకరించారన్నారు. రెచ్చగొట్టే విధంగా వ్యహరించ వద్దని కార్మికులకు, నాయకులకు సూచించారు. ఇదిలావుండగా పోర్టు కార్మికులు చేపట్టిన ఉద్యమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు స్టాలిన్, జి.సుబ్బారావు, తిప్పల దేవన్‌రెడ్డి, జి.సత్యారావు, ఎన్.రామారావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, బసా సాధూరెడ్డి, చిక్కా సత్యనారాయణ, ఎం. గురుమూర్తి, జి.దానయ్య తదితరులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. గంగవరం పోర్టు కోసం స్టీల్‌ప్లాంట్ భూములతో పాటు స్థానిక రైతులు భూమిని ధారా దత్తం చేశారన్నారు. స్థానికులకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జిపిఎస్‌గా పేర్కొనడం విచారకరమన్నారు. యాజమాన్యం కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం వాస్తవ పరిస్థితిని గుర్తించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే పరిసర గ్రామాలు కాలుష్యం బారిన పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల, నిర్వాసితుల సహనాన్ని పరీక్షించాలని చూస్తే పోర్టు యాజమాన్యం తగిన మూల్యం చెల్లించు కోవాల్సివస్తుందన్నారు. అప్పటికి యాజమాన్యం స్పందించకుంటే గంగవరం పోర్టు, ఉక్కు నిర్వాసితులు కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారన్నారు. ఈ ధర్నాలో పోర్టు కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.