నందిగామ, మే 10: న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని మంచి లాయర్‌లుగా గుర్తింపు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ అన్నారు. స్థానిక రామన్నపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 16వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టును శుక్రవారం ఆయన హైకోర్టు న్యాయమూర్తి మరియు కృష్ణాజిల్లా పర్యవేక్షక న్యాయమూర్తి జి రోహిణితో కలిసి ప్రారంభించారు. అనంతరం నెహ్రూనగర్‌లోని కమ్మకల్యాణ మండపం ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రధరరావు అధ్యక్షతన జరిగిన సభలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ మాట్లాడుతూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గానూ కోర్టులోని లైబ్రరీకి తన వంతుగా లక్ష అందజేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని న్యాయవాదులు విజ్ఞానాన్ని, భాషా ప్రావిణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని సమాజానికి మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఇక్కడ అదనపు జిల్లా కోర్టు ఆవశ్యకతను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీకి నివేదించడం వల్ల వారు మంజూరు చేశారని తెలియజేశారు. ఈ ప్రాంతానికి చెందినవాడిని కావడం వల్ల ఇక్కడి ప్రజల కష్టాలు, బాధలు తనకు తెలుసునని అన్నారు. మెట్ట ప్రాంతమైన ఇక్కడ వ్యవసాయంలో ఆటుపోట్లు ఎదురవుతున్నా రైతాంగం ఆత్మవిశ్వాసంతో దీనే్న నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లుగా తాను ఏ స్థాయిలో హోదాలో ఉన్నా నందిగామ తాలూకాకు చెందినవాడిగా చెప్పుకోవడానికి గర్వపడతానని అన్నారు. ఇక్కడ అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలోని కక్షిదారులకు పండుగేనన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని, ఈ ప్రాంతం సశ్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను బార్ అసోసియేషన్ నేతలు, పలువురు ప్రముఖులు, అధికారులు దుశ్సాలువాలు, పూలమాలలు, బొకెలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, విజయవాడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ మురళి, రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ రవికుమార్, 16వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రామకృష్ణ, నందిగామ సీనియర్ సివిల్ జడ్జి కరణం చిరంజీవులు, నందిగామ న్యాయమూర్తులు సాయిభూపతి, బాబునాయక్, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పింగళి లక్ష్మీనర్శింహరావు, అనె్నపాక సుందరరావు, సుంకర రాజేంద్రప్రసాద్‌లతోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని మంచి లాయర్‌లుగా
english title:
advocates
Date:
Saturday, May 11, 2013