మచిలీపట్నం , మే 10: వేసవి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు శ్వాస అందక నానా అవస్థలు పడుతున్నారు. పసికందులు వేడిమికి ఉడికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు అధికమవటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. సాయంత్రం 7 గంటలైనా వేడి తగ్గటం లేదు. ఎండలో ప్రయాణం చేయాలంటే హడలిపోతున్నారు. బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నాయి. కారం మిల్లులో పనిచేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టకూటి కోసం కార్మికులు ఎంతటి కష్టాలనైనా భరిస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ లేకపోవటంతో చిన్నారుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రోహిణీ కార్తెలో మరెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గర్భిణీలు శ్వాస అందక సతమతమవుతున్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో నీరసించిపోతున్నారు.
కూచిపూడి : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోహిణీ కార్తె రాకముందే ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో బతుకే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందేమోనని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అధికమవటంతో వృద్ధులు, చిన్నారులతో పాటు యువత కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. వేళపాళా లేకుండా కొనసాగుతున్న విద్యుత్ కోతల కారణంగా పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండే విద్యుత్ కోత ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. తిరిగి 4 గంటల నుండి 10 గంటల వరకు సరఫరా అవుతున్న విద్యుత్ నిశిరాత్రిలో ప్రారంభమయ్యే విద్యుత్ కోత సమయంలో గాలి లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు.
వేసవి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో జిల్లా ప్రజలు
english title:
simmering summer
Date:
Saturday, May 11, 2013