మచిలీపట్నం , మే 10: బందరు మండలం పెదకరగ్రహారం దళితులకు శ్మశాన భూమికి వెళ్ళే దారిని కేటాయించాలని బందరు ఆర్డీవో కార్యాలయ అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందించారు. 70 కుటుంబాలు నివసిస్తున్న రక్షణ దళితవాడలో 40 సంవత్సరాలుగా నివసిస్తున్నామని, మృతి చెందితే మరుభూమికి తీసుకు వెళ్ళేందుకు దారీ తెన్ను లేక ఇక్కట్లపాలవుతున్నామని వాపోయారు. కాపు, గౌడ సామాజిక వర్గాలకు చెందిన పొలాల్లో నుండి మరుభూమికి తీసుకువెళ్ళాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని రక్షణ దళితవాడకు చెందిన కె శామ్యూల్, ఈశ్వరరావు, నాగేశ్వరరావు, జి సురేష్‌బాబు, ఫకీర్, సుబ్రహ్మణ్యం, సరవయ్య, నాగకృష్ణ తదితరులు కోరారు.
నేటి నుంచి రేషనలైజేషన్, బదిలీలు
మచిలీపట్నం , మే 10: స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటల నుండి రేషనలైజేషన్ బదిలీ కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్లు డిఇవో డి దేవానందరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, పిఇటిల కౌన్సిలింగ్, మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ అసిస్టెంట్స్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ జరుగుతాయన్నారు. జిల్లా విద్యాశాఖ ప్రకటించిన సీనియారిటీ జాబితాలపై 104 మంది ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల కేటగిరిలో ఇద్దరు, ఎస్‌జిటి (తెలుగు)లో 45 మంది, ఎస్‌జిటి (ఉర్దూ)లో ఐదు మంది, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుల విభాగంలో తెలుగులో ఏడుగురు, ఉర్దూలో ముగ్గురు, భాషా పండితుల విభాగంలో తెలుగులో ఇద్దరు, హిందీలో ఇద్దరు, స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో తెలుగులో ఒకరు, హిందీలో ఐదుగురు, ఆంగ్లంలో తొమ్మిది, గణితంలో ఇద్దరు, ఫిజికల్ సైన్స్‌లో ఐదుగురు, బయోలాజికల్ సైన్స్‌లో ఎనిమిది మంది, సోషల్ స్టడీస్‌లో ముగ్గురు, వ్యాయామోపాధ్యాయులలో ఐదుగురు అభ్యంతరాలను తెలిపారన్నారు. అభ్యంతరాలను సరిచేసి తుది జాబితాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.
నేడు జిల్లాకు మంత్రి బసవరాజు సారయ్య
మచిలీపట్నం , మే 10: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖామాత్యులు బసవరాజు సారయ్య శనివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8 గంటలకు గన్నవరం చేరుకుంటారు. 8.30కు స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికార, అనధికారులతో సమావేశం అవుతారు. 10 గంటలకు గుంటూరు జిల్లా పొనె్నకల్లు వెళతారు. సాయంత్రం 4.30కు గన్నవరం చేరుకుని సాయంత్రం 5 గంటలకు విమానంలో హైదరాబాదు వెళతారు.
జిల్లాలో విస్తృతంగా పోలీసు దాడులు
మచిలీపట్నం , మే 10: జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు ఆదేశం మేరకు జిల్లాలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. బందరు డివిజన్‌లో 60 వాహనాలను అదుపులోకి తీసుకుని 15,650 ఫైన్ విధించారు. గుడివాడ డివిజన్‌లో 69 వాహనాలను అదుపులోకి తీసుకుని 3,400 జరిమానా విధించారు. నూజివీడు డివిజన్‌లో 13 వాహనాలను తనిఖీ చేసి 1800 జరిమానా విధించారు. నందిగామ డివిజన్‌లో 19 మంది వాహనదారులను అదుపులోకి తీసుకుని 2,500 ఫైన్ విధించారు. అవనిగడ్డ డివిజన్‌లో 16 వాహనాలను అదుపులోకి తీసుకుని 9,400 జరిమానా విధించారు. జిల్లా వ్యాప్తంగా 177 వాహనాలను అదుపులోకి తీసుకుని 31,800 జరిమానా విధించారు. పెడన పిఎస్ పరిధిలో పేకాట ఆడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని 130 వసూలు చేశారు.
డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల
మచిలీపట్నం , మే 10: కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షా ఫలితాలను ఉపకులపతి ఆచార్య వి వెంకయ్య శుక్రవారం విడుదల చేశారు. మార్చిలో జరిగిన డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తం 20,171 మంది పాల్గొనగా 7,758 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆచార్య వి వెంకయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అభివృద్ధితోపాటు ఆదాయ వనరులపై దృష్టి సారించాలి
సమీక్ష సమావేశంలో కలెక్టర్ బుద్ధప్రకాష్
పటమట, మే 10: పట్టణాలలోని ప్రజలకు వౌళిక వసతుల అభివృద్ధితోపాటు, అదాయ వనరులపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్దప్రకాష్ యం.జ్యోతి మునిసిపల్ అధికారులకు సూచించారు. జిల్లాలోని పురపాలక సంఘాల అధికారులతో శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్లు వంటి వౌళికవసతులు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ చేసేందుకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చెత్త, వ్యర్ధ పదార్ధాలు డంపింగ్ చేయడానికి శాశ్వతంగా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వౌళిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వ నిధులతోపాటు, స్థానిక ఆదాయ వనరులను సమకూర్చుకోవలసిన అవసరం మున్సిపల్ అధికారులపై వుందన్నారు. ఆదాయంలో 40 శాతం మురికివాడలో నివసించే ప్రజల అవసరాలకు వినియోగించాలన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా యువతకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పునరావాసం కల్పించేందుకు తగు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన మునిసిపల్ అధికారులను కోరారు. మీ సేవ, ఇ సేవ కేంద్రాలలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. పురపాలక సంఘాల పనితీరు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ కేంద్రాలను ప్రవేశపెట్టాలన్నారు. మునిసిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన రోల్డుగోల్డు పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, మెప్మా అధికారుల సమన్వయంతో పట్టణ స్వయం సేవక సంఘాల మహిళలను రోల్డుగోల్డు పరిశ్రమలో భాగస్వాములను చేసి వారికి ఉపాథి అవకాశాలు కల్పించేందుకు కృషిచేయాలని తెలిపారు. ప్రజలలో సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా శనివారం నుండి జూన్ 15వ తేది వరకు ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్, మచిలీపట్నం ఆర్‌డిఓ సాయిబాబు, పబ్లిక్ హెల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.వి.రెడ్డి, మచిలీపట్నం, పెడన మునిసిపల్ కమీషనర్లు ఎన్.శివరామకృష్ణ, జి.గోపాలరావు, జగ్గయ్యపేట మున్సిపాలిటి మేనేజర్ డి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.