విజయవాడ , మే 10: సమాజం పట్ల న్యాయవాదులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వి రమణ అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వం అందరి సమిష్టి కృషితోనే నగరంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి నాంది పలకడం జరిగిందన్నారు. కక్షిదారులు, ప్రజల సౌకర్యార్థం 58కోట్లతో నిర్మించతలపెట్టిన జిప్లస్ 8 అంతస్తులకు శనివారం శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అయితే న్యాయవ్యవస్థ సమస్యల పట్ల పోరాటం చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపైనే ఉందన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ వార్షిక బార్ డే వేడుకలు శుక్రవారం సాయంత్రం ఐవి ప్యాలెస్‌లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన జస్టీస్ ఎన్‌వి రమణ న్యాయవాదులనుద్ధేశించి మాట్లాడుతూ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగానే హైకోర్టులో బిల్డింగ్ కమిటి, మరోవైపు ముఖ్యమంత్రి, అడ్వకేట్ జనరల్, న్యాయశాఖామంత్రి, అందరూ అనుమతులు, నిధులు మంజూరు చేయడం జరిగిందని ఇది ఏ ఒక్కరి విజయం కాదని అందరి విజయమని అన్నారు. ఇదిలావుండగా స్వంతంత్రం వచ్చిన తర్వాత దేశంలో న్యాయవ్యవస్థ గూర్చి సరైన అధ్యాయనం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. వౌళిక వసతులు కల్పించడంలో పాలకులు ఆది నుంచీ నిర్లక్ష్యం చేశారని, ఈ దశలో న్యాయవ్యవస్థ పటిష్టతకు న్యాయవాదులు నడుం బిగించాలన్నారు. భృతి కోసం వృత్తికే పరిమితం కాకుండా ఉద్యమాలు చేస్తూ పని చేయని ప్రజాప్రతినిధులను నిలదీయాలని సూచించారు. అదేవిధంగా న్యాయవాద వృత్తిలో నైపుణ్యం కరువైందని ఇది దురదృష్టకరమ పరిణామం అన్నారు. తోటి న్యాయమూర్తుల సహకారంతోనే తాను నూతన భవనం కోసం కృషి చేసినట్లు చెప్పారు. జస్టీస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్‌వి రమణ కృషి ఫలితంగానే నూతన భవనాలకు అంకురార్పణ జరిగిందని, సుదీర్ఘ చరిత్ర కలిగిన బార్‌ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. జస్టీస్ కెసి భాను మాట్లాడుతూ ఎన్‌వి రమణ ఏ కార్యక్రమం చేపట్టినా కృషి, పట్టుదలతో సాధిస్తారని కొనియాడారు. ఆయన కృష్ణాజిల్లాకే కాదు రాష్ట్రానికే ముద్దుబిడ్డ అని అన్నారు. జిల్లా ఫోర్ట్ఫులియో జడ్జి రోహిణి మాట్లాడుతూ న్యాయవ్యవస్ధ పటిష్టతకు అందరూ కృషి చేయాలన్నారు. న్యాయవాదులు సీనియర్ల వద్ద పని చేస్తూ వృత్తి నైపుణ్యం పెంచుకోవాలన్నారు. అంతకుముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమానికి బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టా జయకర్ అధ్యక్షత వహించగా మాజీ అధ్యక్షుడు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రధరరావు, ఎస్ రవికుమార్, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి సీనియర్ న్యాయవాదులు వేలూరి శ్రీనివాసరెడ్డి, సుంకర రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి లాం ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు.
సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు
* హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ
విజయవాడ , మే 10: కక్షిదారుల సౌలభ్యం కోసం వారికి సత్వర న్యాయం అందించేందుకే ప్రజా న్యాయస్థానాలు (లోక్ అదాలత్) ఏర్పాటు చేసినట్లు హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టీస్ ఎన్‌వి రమణ అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మెగాలోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ప్రజలకు న్యాయం కలుగచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, న్యాయస్థానాలపై ఉందన్నారు. స్వాంతత్య్రం అనంతరం న్యాయవ్యవస్థ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, పారిశ్రామికీకరణ, మానవ సంబంధాలు మసకబారడం, నిరుద్యోగం, తదితర కారణాల వల్ల కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో పడ్డాయన్నారు. వీటి పరిష్కారం కోసం 1987లో ఏర్పాటు చేసిన న్యాయసేవాధికార చట్టం 1995 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. తద్వారా జాతీయ, రాష్ట్ర, మండల, జిల్లా స్థాయిల్లో సత్వర న్యాయం అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఏడాదిలోపు 15,185లోక్ అదాలత్‌లు నిర్వహించి లక్షా 48వేల 282 కేసులు పరిష్కరించి, కక్షిదారులకు 163 కోట్ల 30లక్షలు నష్టపరిహారంగా చెల్లించామన్నారు. 59వేల 590 న్యాయసేవా సదస్సులు నిర్వహించి 4,673 మందికి ఉచిత న్యాయ సహాయం అందినట్లు, మీడియేషన్ సెంటర్ ద్వారా 260 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి లోక్ అదాలత్‌లో పరిష్కరించి కేసుకు సంబంధించి రికార్డులో ఉన్న న్యాయవాదులకు తప్పనిసరిగా సమాచారం అందించేలా తగిన ఆదేశాలు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటానని బిబిఏ అధ్యక్షుడు మట్టా జయకర్‌కు ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదం కేసులో కక్షిదారునికి చెక్కును అందచేశారు. కేసుల పరిష్కారం జిల్లా 8వ స్థానంలో ఉందని, లోక్ అదాలత్‌ల్లో ముందంజలో ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి కృష్ణాజిల్లా పోర్ట్ఫులియో జడ్జి జస్టీస్ జి రోహిణి మాట్లాడుతూ న్యాయస్థానాలు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటున్నట్లు చెప్పారు. అయితే పెండింగ్ కేసుల వద్ద ప్రజల్లో ఈ అపోహ తొలగించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర న్యాయసేవా సహాయ సంఘం రాష్ట్ర సభ్యులు మెంబర్ సెక్రటరీ ఎస్ రవికుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి చక్రధరరావు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి, బార్ అధ్యక్షుడు మట్టా జయకర్, జిల్లాలోని న్యాయమూర్తులు, ఏపిపి, ఏజిపిలు పాల్గొన్నారు.
* 203 కేసులు పరిష్కారం
మెగాలోక్ అదాలత్‌లో నిర్వహించిన నాలుగు బెంచ్‌ల ద్వారా మొత్తం 203 కేసులు పరిష్కారించి కక్షిదారులకు 58లక్షల 24వేల 200 రూపాయలు చెల్లించేలా తీర్పు చెప్పారు. 30 మోటారు వాహన ప్రమాదాల కేసులకు 56లక్షల 39వేలు, నాలుగు సివిల్ కేసులకు పదివేలు, 167క్రిమినల్ కేసులకు 70,200, రెండు పిఎల్‌సిలకు లక్షా 5వేలు చెల్లించడం జరిగింది.