విజయవాడ, మే 10: ఎంతో కీలకమైన డిమాండ్ల సాధన కోసం ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్, ఫెడరేషన్ ఆఫ్ డ్రగ్ ట్రేడర్స్ ఆఫ్ ఎపి సంఘాల పిలుపు మేరకు కృష్ణాజిల్లాలో శుక్రవారం మందుల వర్తకుల బంద్ విజయవంతమైంది. అయితే కొంతమంది దుకాణదారులు అత్యవసర మందులకు మినహాయింపునిచ్చారు. జిల్లాలోని 650 హోల్‌సేల్, 2600 రిటైల్ దుకాణాలు పూర్తిగా నిలబడ్డాయి. డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా నిలిచాయి. కృష్ణాజిల్లా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఎస్ పట్నాయక్ హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ. రవీంద్రరెడ్డి నేటి బంద్‌ను పర్యవేక్షించారు. మందులపై 1984లో నిర్దేశించిన ట్రేడ్ మార్జిన్‌లను కొనసాగిస్తూ 2013 నూతన డ్రగ్ పాలసీలో ప్రతిపాదించిన ట్రేడ్ మార్జిన్‌లను తగ్గింపరాదని ఫార్మాసిస్టుల సమస్యపై పరిష్కారం చూపాలని 2008లో సవరణ జరిగిన డ్రగ్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధమైన పత్రాలు కల్గిన మందుల వర్తకులను సాక్షులుగా చేర్చి రిలీఫ్ కల్గించాలని, బహుళజాతి వ్యాపార సంస్థలకు మందుల అమ్మకాలను అనుమతించరాదని వ్యాపారులు డిమాండ్ చేసారు.
పోరాటాల ఫలితంగానే కౌలురైతు చట్టం
విజయవాడ, మే 10: అనేక పోరాటాల ఫలితంగానే కౌలు రైతులకంటూ ఓ చట్టం వచ్చిందని అయితే అమల్లో ఆశించిన ఫలితాలు రావటంలేదని ఈ కారణం వలనే కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పశ్య పద్మ అన్నారు. శుక్రవారం నాడిక్కడ జరిగిన కౌలు రైతుల సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆమె ప్రసంగించారు. డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సిఫార్స్‌లు అమలుచేస్తే రైతాంగానికి ఈ కష్టాలు ఉండవంటూ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కె. రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయరంగంలో అనేక మార్పులు రాబోతున్నాయని అన్నారు. కౌలుదారులను సమీకరించి చట్టం అమలుకోసం ఉద్యమించాలన్నారు. కార్పొరేట్ కంపెనీ వ్యవసాయం రాబోతున్నదంటూ కంపెనీ సేద్యం వస్తే రైతు తన భూమిపై హక్కు కోల్పోవటమే గాక తన భూమిలో తానే కూలివానిగా పనిచేయాల్సి వస్తుందన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దేవాదాయ ధర్మాదాయ కౌలుదారులు కూడా సంఘటితమై రుణాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో నేడు వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్నారు. వ్యవసాయపరంగా ఆదాయం తగ్గిందని దేశ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడిందన్నారు. ఆహార భద్రత కొరవడుతున్నదని తెలుస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఖర్చులకు భయపడి వ్యవసాయానికి దూరంగా ఉంటూ పట్టణాలకు వలస పోతున్నారన్నారు. దీన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ కౌలు రైతులకు రుణం అందింపచేసే చట్టంలో అనేక లోపాలున్నాయని అన్నారు. బిటి విత్తనాలకు వ్యతిరేకంగా అలాగే కౌలు రైతు రక్షణ చట్టం అమలు కోసం ఉద్యమించాల్సి ఉందన్నారు.
సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ కౌలుదారులకు రుణ కార్డులు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతున్నదంటూ శాశ్వత కౌలుదారులతో దిగువ స్థాయి నుంచి దీనిపై సంఘటిత పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సభకు అధ్యక్షత వహించిన రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్మన నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాక నష్టాల్లో కూరుకుపోయిన సుమారు 30వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయాన్ని వదలి వలసలు పోతున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది కౌలు రైతులున్నారంటూ రుణాల విషయంలో బ్యాంకర్లు అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని రక్షించి చిన్న, సన్నకారు రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తొలుత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారధి ప్రసంగించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ స్వాగతం పలికారు. వేదికపై సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవి గోపాలరావు, రైతు సంఘం నాయకులు ఎం. వీరహనుమంతరావు, విశే్వశ్వరరావు, గురవయ్య, ఆర్. గంగాభవాని, తాతినేని సీతారావమ్మ, మందనపు రాణి, మల్నీడి యల్లమందరావు ఆశీనులయ్యారు. ప్రజానాట్యమండలి నాయకుడు ఆర్. పిచ్చయ్య రైతు చైతన్య గీతాలు ఆలపించారు.