విజయవాడ, మే 10: ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్-2013) పరీక్ష శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగింది. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఏడుగంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు పరీక్ష కేంద్రాలకు వచ్చి తమ వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ లోపలికి పంపించారు. మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30కు ప్రారంభం కాగా అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ఉదయం 11 గంటలకే చేరుకున్నారు. ఏది ఏమైనా అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో నీడలేక ఎండలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంజనీరింగ్ పరీక్షకు ‘క్యూ’ సెట్‌ను, మెడిసిన్‌కు ‘ఎస్’ సెట్‌ను ఎంపిక చేసారు. విజయవాడ రీజయన్ పరిధిలో ఇంజనీరింగ్‌కు మొత్తం 23వేల 665 మంది హాజరుకావాల్సి ఉండగా 22వేల 871 మంది హాజరుకాగా 794 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 96.64 శాతంగా నమోదైంది. మెడిసిన్‌కు 14వేల 668 మంది హాజరు కావాల్సి ఉండగా 13వేల 866 మంది హాజరు కాగా 202 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 98.56 శాతంగా నమోదైంది
ఇక ఎంసెట్ పరీక్షలో ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ట్రాఫిక్ రద్దీ, పరీక్ష కేంద్రాల గురించి హాల్ టిక్కెట్లపై స్పష్టత లేకపోవటం వంటి కారణాలతో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా చేరుకున్నారు. అయితే నిర్వాహకులు సరిగ్గా పది గంటలకే గేట్లు వేయడంతో విద్యార్థులు లోపలికి వెళ్లలేకపోయారు. దీంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. నగరం నడిబొడ్డున ప్రధాన పరీక్ష కేంద్రాలు ఉండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు వచ్చిన వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడ నిలచిపోవటంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఏది ఏమైనా ఎంసెట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించగల్గామని కన్వీనర్ సాంబశివరావు తెలిపారు.
ఇదిలా ఉంటే కార్పొరేట్ విద్యాసంస్థలు తమ తమ కళాశాలల గురించి కోట్లాది రూపాయల విలువైన ప్రచార సామాగ్రిని పరీక్ష కేంద్రాల వద్ద వెదజల్లాయి. రహదారులపై ఎటుచూసినా ప్రచార సామాగ్రి కుప్పలు తెప్పలుగా పడి ఉండటం కన్పించింది.
కిటకిటలాడిన రైల్, బస్‌స్టేషన్లు
ఎంసెట్ పరీక్ష ముగియటంతో గత రెండేళ్లుగా వివిధ కార్పొరేట్ కళాశాలల హాస్టళ్లకే పరిమితమైన విద్యార్థినీ విద్యార్థులు సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి తమతమ నివాసిత ప్రాంతాలకు తిరుగు ప్రయాణం కట్టారు. కుర్చీలు, ట్రంక్ పెట్టెలు, పుస్తకాలను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో రైల్వే, బస్‌స్టేషన్లు కిటకిటలాడాయి.
పట్టణంలో ఎంసెట్ ప్రశాంతం
మచిలీపట్నం , మే 10: పట్టణంలో శుక్రవారం ఎంసెంట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 95.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఆరు పరీక్షా కేంద్రాలలో మొత్తం మీద 2,659 మందికి గాను 2,540 మంది హాజరయ్యారు. హిందూ కళాశాలలో 740 మందికి 709 మంది, నోబుల్ కళాశాలలో 541 మందికి 510 మంది, వరలక్ష్మీ పాలిటెక్నిక్‌లో 493 మందికి 471 మంది, ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ఎ సెంటరులో 295 మందికి 284 మంది, బి సెంటరులో 295 మందికి 286 మంది, సి కేంద్రంలో 295 మందికి 280 మంది హాజరయ్యారు. హిందూ కళాశాలలో మధ్యాహ్నం 2.30 గంటల నుండి జరిగిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు 388 మందికి 367 మంది హాజరయ్యారు. రీజినల్ కో-ఆర్డినేటర్ వెలగపూడి ఉషారాణి, స్పెషల్ అబ్జర్వర్ జెఎన్‌టియు డా. జి కృష్ణమోహన్, బందరు మండల తహశీల్దార్ పర్యవేక్షించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సిఐ మురళీధర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.