మచిలీపట్నం , మే 10: జిల్లాలో మినుము రైతుల పరిస్థితి రానురాను దిగజారిపోతోంది. ప్రభుత్వం మినుముకు ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందకపోవటంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక నలిగిపోతున్నారు. తెచ్చి న రుణానికి వడ్డీలు మాత్రం పాపంలా పెరిగిపోతున్నాయి. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతు నాయకులు, ప్రముఖులు ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. గిట్టుబాటు కాని ధరకు అమ్మలేక ఇళ్ళ ముందే ఉన్న మినుము నిల్వలను చూసి ఆవేదనతో తల్లడిల్లిపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కౌలు రైతులకు మినుము పంటే ప్రధాన ఆదాయ వనరు. ఖరీఫ్‌లో కౌలు చెల్లించిన రైతులు అపరాల సాగు ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఖరీఫ్‌లో కౌలు ఎక్కువగా ఉండటం, కౌలు పోను ఖర్చులు రాబట్టుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. దీనితో కౌలు రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నారు. భద్రపరుచుకునేందుకు గోడౌన్‌లు సైతం లేకపోవటంతో ఇళ్ళ ముంగిట, కొద్దిపాటి గదులు, భవనాలలో మినుములు భద్రపర్చుకున్నారు. తూర్పు కృష్ణాలో ప్రధానంగా అవనిగడ్డ నియోజకవర్గంలో 75 వేల 500 ఎకరాల్లో మినుము పంట సాగవగా, మార్కెట్ ధర ప్రభుత్వ మద్దతు ధర కంటే 800 తక్కువగా ఉండటంతో వాటిని అమ్ముకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది మినుము ధరలు రైతులకు శాపంగా మారాయని చెప్పవచ్చు.
జిల్లాలో మినుము రైతుల పరిస్థితి రానురాను దిగజారిపోతోంది
english title:
black gram
Date:
Saturday, May 11, 2013