సింహాచలం, మే 11 : సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సోమవారం చందనయాత్ర మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఏడాది పొడవునా శ్రీగంధం పైపూతతో దర్శనమిచ్చే చందనాల స్వామి వైశాఖ శుద్ధ తదియ పర్వదినం సందర్భంగా (అక్షయతృతీయ) వరాహ నారసింహ అవతారాల కలయికతో నిజరూపంలో దర్శనమివ్వనున్నారు. సోమవారం తెల్లవారు జామున వైదికాధికాలు నిర్వహించి ఆగమ శాస్త్రానుసారం చందన విసర్జన చేస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, నాదస్వర వాయిద్యాల నడుమ అర్చక పెద్దలు సింహాద్రినాథుడిని నిజరూపంలోకి తీసుకు వస్తారు. తెల్లవారు జామున మూడున్నర గంటలకు దేవాలయంలో సనాతనంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి వ్యవస్థాపక ధర్మకర్తలు పూసపాటి వంశీయులకు తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య సింహాచలేశునికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం ప్రొటోకాల్ ప్రముఖులకు దర్శనం కల్పిస్తారు. స్వామి వారి దర్శనానికి లక్షకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చందనయాత్ర నిర్వహణకు ప్రత్యేక అధికారిగా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె. చంద్రకుమార్‌ని నియమించారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో
english title:
nija roopa darsanam
Date:
Sunday, May 12, 2013