హైదరాబాద్, మే 11: సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక ‘సమతా’ తీర్పును తక్షణం అమలుచేయాలని బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూలులో వున్న గిరిజన భూములపై హక్కు గిరిజనులదేనని, గిరిజనేతరులకు, ప్రభుత్వానికి హక్కు లేదని, వారి జీవన విధానాన్ని సంస్కృతీపరంపర రక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి ఆ ప్రాంతంలో ఖనిజ సంపద వెలికి తీయడం గురించి ఆ సంపద పైన హక్కుల గురించి చాలా సవివరమైన, చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని గుర్తుచేశారు. అదే విధంగా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించి వేదాంత పేరిట మరో తీర్పు ఉందని, ఈ రెండు తీర్పులూ గిరిజన భూములపైనా వారి సంస్కృతీ పరంపర , అటవీ పర్యావరణ తదితర అంశాలపైనా, వీరి సర్వహక్కులకు సంబంధించి తెలియజేసి, ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.
ఒక వేళ ఖనిజ సంపదను వెలికితీయాలంటే గిరిజనులు స్వతంగా కాని, గిరిజన సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ ఆర్ధిక సహకారంతో చేపట్టాలని తెలిపారు. ఖనిజ సంపద ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం ఆ ప్రాంత అభివృద్ధికి శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామ సభలను నిర్వహించాల్సి వస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో నియమితులైన జిల్లా జడ్జి పరిశీలకుడిగా ఉండాలని, ఆయన సంతకం కూడా గ్రామ సభ వివరాలను ధృవీకరిస్తూ ఉండాలని, ప్రభుత్వం కాని, మరెవరూ కాని గిరిజనుల ఒత్తిడి చేయలేదని స్పష్టం కావాలని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా ఆలోచిస్తుంటే రక్షణ స్టీల్స్‌కు వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బయ్యారం ఇనుపఖనిజం కోసం లక్ష ఎకరాలకు పైగా కేటాయించడం , ఇపుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వేల ఎకరాలు బయ్యారంలో ఇతరులకు కేటాయించడం ఎంత బాధ్యతారాహిత్యమో నేరమో అర్ధమవుతుందని అన్నారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారంలోని గిరిజనుల భూమిని పరిశ్రమలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఐదో షెడ్యూలులోని ఈ భూముల బదిలీ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ రాష్టప్రతికి నివేదిక పంపించాలని అన్నారు. వెంటనే ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పరచి, గవర్నర్ తమ అధికారాలను ఉపయోగించి, ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరి, షెడ్యూల్డు ప్రాంతాల్లో గ్రామ సభల నిర్వహణకు సంబంధించి జిల్లా జడ్జిలకు నియామకం చేయించి వారిని భాగస్మ్యాలను చేసి గిరిజన ప్రాంతాలకు, గిరిజనులకు రక్షణలను కల్పించాలని బిజెపి డిమాండ్ చేసింది.
షెడ్యూల్డు గ్రామసభలకు న్యాయమూర్తులు : విద్యాసాగర్‌రావు డిమాండ్
english title:
samatha
Date:
Sunday, May 12, 2013