విజయనగరం (కంటోనె్మంట్), మే 15: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతగా ముగిసింది. విజయనగరం పట్టణంలో 14 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 3,251 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు ధరఖాస్తు చేసుకోగా 3,056 మంది విద్యార్థులు హాజరయ్యారు. 195 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కె.నాగమణి, ఎపిఆర్‌జెసి ప్రిన్సిపల్ కనోజ్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు.
నందేడవలస గెడ్డపై చెక్‌డ్యాం నిర్మాణం జరిగేనా?
పాచిపెంట, మే 15: మండలంలోని నందేడవలస సమీపాన కొండవాగు గెడ్డపై చెక్ డ్యాం నిర్మాణం జరిగేనా? అని పలువురు గిరిజన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ గెడ్డపై చెక్ డ్యాం నిర్మిస్తే సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చుట్టు పక్కల బీడు భూములు, సాగు భూములుగా మారుతాయి. చెక్ డ్యాం నిర్మించాలని గతంలో గిరిజన రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామాన్ని సందర్శించిన నాయకులకు కూడా ఇదే విషయాన్ని గిరిజన రైతులు సోములు, లచ్చయ్య, కన్నయ్య, ఆదియ్య, తదితరులు ఎప్పటికప్పుడు మొరపెట్టుకున్నారు. చాలా కాలంగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా, నీటి వసతి సక్రమంగా లేక పంట దిగుబడి అంతంత మాత్రమేనని రైతులు వాపోతున్నారు. చెక్ డ్యాం నిర్మిస్తే సంవత్సరానికి రెండు పంటలు పండించే వీలు ఉంటుందని రైతులంటున్నారు. ప్రస్తుతం కొండవాగుల నీరు వృథాగా పోతుంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గెడ్డపై చెక్ డ్యాం నిర్మాణం కోసం నందేడవలస, కోదువలస, పూడి, తదితర గ్రామాల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
‘జిసిసి వ్యాపారాభివృద్ధికి కృషి’
పార్వతీపురం, మే 15: పార్వతీపురం జిసిసి డివిజన్‌లోని జిసిసి వ్యాపారాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిసిసి డివిజనల్ మేనేజర్ సురేంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఆయన పార్వతీపురం జిసిసి డివిజనల్ మేనేజర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు.విశాఖ జిసిసి ప్రధాన కార్యాలయంలో సిస్టమ్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ ఇక్కడికి డివిజనల్ మేనేజర్‌గా బదిలీపై వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిసిసి డివిజన్‌లోని పార్వతీపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం బ్రాంచ్‌ల పరిధిలోని తాను పర్యటించి ఆయా ప్రాంతాల్లోని జిసిసి డిపోలను పటిష్ఠపరచడంతోపాటు గిరిజనులకు జిసిసి ద్వారా మరింత మెరుగైన సేవలందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జిసిసి బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది కొత్త డి ఎంను కలిసి అభినందించారు.
కళాజాత ద్వారా చైతన్యం
భోగాపురం, మే 15 : ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వం అందించే పధకాలు గురించి ఈ కళాజాత ద్వారా తెలియచేయవచ్చని ఎస్సీ బాలికల గృహ సంక్షేమ అధికారి సంగీత అన్నారు. గ్రామంలో కళాజాత ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, వాటివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకి అవగాహన కల్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు గల ప్రాంతంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని పాటల రూపంలో అందరికి వినిపించారు.
‘సకాలంలో ఖరీఫ్ రుణాలు అందించాలి’
విజయనగరం (్ఫర్టు), మే 15: జిల్లాలో రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఖరీఫ్ పంటరుణాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్‌పర్సన్ మరిశర్ల తులసి కోరారు. ఆంధ్రప్రదేశ్ సహకార యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తులసి మాట్లాడుతూ ప్రసుత్తం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున పంటరుణాలను అందించేందుకర సన్నద్ధం కావాలన్నారు. మార్కెఫెడ్ సహకారంతో విత్తనాలు, ఎరువులు, ఎరువులను అందించేందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో రైతాంగానికి సేవలు అందించేందుకు సంఘాల పాలకవర్గసభ్యులు కృషి చేయాలన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ సమావేశంలో నాఫెడ్ డైరెక్టర్ కె.వి.సూర్యనారాయణరాజు, డివిజనల్ సహకారశాఖాధికారి పి.బాంధవరావు, సమగ్ర సహకార అభివృద్ధి పథకం చీఫ్ ప్రాజెక్టు అధికారి అటాట్ట హేమసుందర్, సహకార యూనియన్ ప్రాంతీయ విద్యాధికారి కె.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఆర్.శ్రీనివాసరావు, ఎం.రామమోహన్, జి.శ్రీనివాసరావు, బ్యాంకు పాలకవర్గసభ్యులు బుద్దరాజు అప్పలనరసింహరాజు, సుందర గోవిందరావు, శ్రీరాములు, రవిబాబు పాల్గొన్నారు.
బస్‌పాస్ చార్జీల పెంపును నిరసిస్తూ డివైఎఫ్‌ఐ ధర్నా
విజయనగరం (కంటోనె్మంట్), మే 15: విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డివైఎఫ్‌ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. బస్ పాస్ ఛార్జీల పెంపును నిరసిస్త్తూ బుధవారం సాయంత్రం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రాస్తారో చేపట్టారు. అనంతరం రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ జగన్మోహన్ మాట్లాడుతూ బస్ పాస్ చార్జీలను ఒకేసారి 30 నుంచి 50 శాతం పెంచడం వల్ల ఏడాదికి 20 కోట్ల మేర విద్యార్థులపై అదనపు భారం పడుతుందన్నారు. ఇంటర్ నుంచి పై చదువులు చదవాలంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తప్పనిసరిగా బస్ పాసులు అవసరమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉన్నత చదువులు చదువుకోలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బస్‌పాస్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ విద్యార్థి సంఘ నాయకులు ప్రసాద్, శ్రీను, శ్రీరామ్, ఎస్.ఎఫ్.ఐ నాయకులు సురేష్, శ్రీను, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.ఆనంద్, రమణమ్మ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నిషేధిత పదార్ధాలు స్వాధీనం?
జామి, మే 15 : విశాఖపట్నం నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత పదార్ధాలతో ఉన్న వ్యానును ఇక్కడి పోలీసులు బుధవారం స్వాధీన పరుచుకున్నారు. ఈ వ్యాన్‌లో నిషేదిత పదార్ధాలు, గుట్కా, ఖైనీలు ఉన్నాయని కొంత మంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వ్యాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఈవ్యాను విశాఖకు చెందిన ఒక ట్రావెల్స్‌దిగా రికార్డులు చూపించారు. అయితే వ్యానులో నిషేధిత పదార్ధాలు లేవని ఫ్రభుత్వం అనుమతి ఇచ్చిన పాన్‌మసాలా, టొబాకో ప్యాకెట్లు ల అమ్ముతున్న సదరు యజమాని తెలిపారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను ఎస్సైకు చూపించారు. వీటిని పరిశీలించిన ఎస్సై లూథర్‌బాబు సంబంధిత ప్యాకెట్లు ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు తనిఖీ నిమిత్తం తరలిస్తున్నట్లు తెలిపారు. వారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
నెల్లిమర్ల, మే 15 : ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్ధం రాములవారి కొండపై అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. దుడగులే పొట్టన పెట్టుకున్నారో? విధి ఓడించిందో? కాని ఆమె తనువు చాలించింది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం రామలవారి కొండపై ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈమె వయస్సు సుమారు 30 సంవత్సరాలు వయస్సు ఉండవచ్చునని పోలీసుల అంచనా. బుధవారం ఉదయం రామతీర్ధం వచ్చే పర్యాటకులతో గైడ్ కొండపైకి వెళ్లి పలు ప్రదేశాలు చూపించి అలాగే భీముని గుహ వద్దకు చేరుకోగానే ఈమృతదేహాన్ని వారు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి కారణమైన వివరాలను సేకరిస్తున్నారు. ఇన్‌చార్జ్ సిఐ డి.లక్ష్మణరావు, ఆధ్వర్యంలో క్లూస్ టీమ్, డాగ్‌స్కాడ్, రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
చింతపండు కొనుగోళ్ళలో జిసిసి తీరుపై విమర్శ
సాలూరు, మే 15: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిపుత్రులకు చింతపండు గిట్టుబాటు ధర తీరని చింతగానే మిగిలింది. ఈ ఏడాది చింతపండు గిట్టుబాటు ధర కల్పించడంలో జి.సి.సి. విఫలమైంది. చింతపండు సేకరణే ప్రధాన ఉపాధిగా జీవిస్తున్న గిరిపుత్రులకు రిక్తహస్తమే ప్రభుత్వం మిగిల్చింది. అడవుల్లో చెట్లును కంటికిరెప్పలా కాపాడుకుంటూ సేకరించిన చింతపండు ప్రైవేటు వ్యాపారుల బారిన పడుతోంది. జి.సి.సి. కన్న వ్యాపారులే అధికధరకు కొంటున్నారు. జి.సి.సి. తొలుత కిలో చింతపండును 15 రూపాయలకే కొనాలని నిర్ణయించింది. అనంతరం దీన్ని 18 రూపాయలకు పెంచింది. వ్యాపారులు కిలో 22 రూపాయలకు కొంటున్నారు. నాణ్యమైనదైతే 25 రూపాయలు చెల్లిస్తున్నారు. దీని వల్ల సంతల్లో చింతపండు కొనుగోలుకు ఏర్పాటు చేసిన జి.సి.సి. కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ధర తక్కువగా ఉండటంతో వీటిని కాదని గిరిపుత్రులు తాము సేకరించిన చింతపండును నేరుగా వ్యాపారుల వద్దకు తీసుకువెళుతున్నారు. మండలంలో ఈ ఏడాది దిగుబడి ఆశాజకంగా లేదు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో బాగా తగ్గింది. అయినా మంగళ, బుధ,శనివారాలలో జరిగే సంతల్లో వ్యాపారులు కొనుగోళ్లు బాగానే సాగుతున్నాయి. జి.సి.సి. సిబ్బంది మాత్రం అధికారులు నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఏడాది రెండు వేల క్వింటాళ్ల చింతపండు కొనాలని స్థానిక జి.సి.సి. బ్రాంచ్ అధికారులు నిర్ణయించారు. దీన్ని పూర్తిచేయడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. సాలూరుతోపాటు ఒడిశా నుంచి దిగుమవుతున్న చింతపండును కూడా వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరుగుతుందని వారు భావిస్తన్నారు. ఈ మేరకు తోణాం, కురుకూటి, మరిపల్లి, మామిడిపల్లి ప్రాంతాలలో వ్యాపారులు వేలాది క్వింటాళ్లు చింతపండును కొనుగోలు చేసి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు.
చింతపండు కొనుగోలు బాధ్యత నుంచి జి.సి.సి. క్రమేణా తప్పుకునే పనిలో ఉంది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పైకి చెబుతున్నా ఆచరణలో ఇందకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు గిరిపుత్రులతో విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకున్న జి.సి.సి. క్రమంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితులను అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
విజయనగరం (కంటోనె్మంట్), మే 15: మహిళా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్తికేయ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ పోలీస్ అధికారులతో మాసాంతపు నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను నిరోధించేందుకు రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్‌స్టాపులు, కళాశాలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వాహన చోదకులకు హెల్మెట్ల ప్రాధాన్యతను వివరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరక్కుండా సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టాలని తెలిపారు. దొంగతనాల నివారణ, చోరీసొత్తు స్వాధీనంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో ఏప్రిల్ నెలలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు స్థాయిపై సమీక్షించి, విచారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సలహాలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు, ఒఎస్‌డి డి.వి శ్రీనివాసరావు, డిఎస్పీలు కృష్ణప్రసన్న, ఫల్గుణరావు, పార్వతీపురం ఎ.ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, స్పెషల్ బ్రాంచ్ సిఐలు ఎం.వి.వి రమణమూర్తి, కొండ, డిసిఆర్‌బి సిఐ రామకృష్ణ, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
‘పెండింగ్ సమస్యలు
పరిష్కరించాలి’
పార్వతీపురం, మే 15: రెవెన్యూ సదస్సులో వచ్చిన పిటిషన్లల్లో ఇంకా పరిష్కారం కాని వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడి ఆర్డీవో జె.వెంకటరావు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి డిప్యూటీ తహశీల్దార్ల సమావేశంలో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన పిటిషన్లను సత్వర పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదేవిధంగా కౌలురైతులకు రుణాలు అందించే చర్యలు తీసుకోవాలన్నారు. 7వ విడత భూ పంపిణీ కార్యక్రమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దేవాశాఖ భూములుల విషయంలో దేవాదాయశాఖాధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పరిశీలించి సర్వే ద్వారా రైతులకు సక్రమంగా పట్టాలు అందించాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారుల మార్పు జరిగిన నేపథ్యంలో వారికి తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణమోహన్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష
english title:
p
Date:
Thursday, May 16, 2013