కమాన్‌పూర్, మే 16: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన మంథని జెఎన్‌టియు కళాశాలను గురువారం సెం టనరీకాలనీలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకులచే కాకుండా విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు 67 మంది శాశ్వత అధ్యాపకులను నియమించడం జరుగుతుందన్నారు. బాలబాలికల ఏర్పాటు చేసే వసతి గృహాలు ఆగస్టు మాసంలో పూర్తవుతుందని తెలిపారు. చదువులపై దృష్టి కేంద్రీకరించి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాలకు పేరు తేవాలని హితవుపలికారు. విద్యార్థులకు విద్యనందించడంలో భాగంగానే మారుమూల ప్రాంతమైన మంథని నియోజక వర్గంలోని సెంటనరీకాలనీతోపాటు జగిత్యాలలో కొడిమ్యాలలో జెఎన్‌టియు కళాశాలల ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే పట్టుదలతోనే ప్రభు త్వం కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్మితా సబర్వాల్, వైస్‌చాన్స్‌లర్ రామేశ్వర్, ఇసి రమణారావు, ఆర్డీ ఓ ఆయేషాఖాన్, ప్రిన్సిపల్స్ బాలునాయక్, ఈశ్వర్ ప్రసాద్, ఉదయ్‌కుమార్‌తోపాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక
విద్య, విద్యుత్, గృహ నిర్మాణం,
సాగునీటి రంగాలకు ప్రాధాన్యం
జమ్మికుంట సభలో కెసిఆర్ వెల్లడి
జమ్మికుంట, మే 16: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటి నుండే నిర్దిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. విద్య, విద్యుత్, గృహ నిర్మాణం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. గురువారం జమ్మికుంటలో ఎ మ్మెల్యే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసగించారు. తెలంగాణలో ఉచిత నిర్బంధ విద్యను అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికి వర్తింప చేస్తామన్నారు. సిబిఎస్ తరహాలో విద్య బోధన గావించి సంపన్నుల పిల్లలకు ఏ మాత్రం తీసి పోని విధంగా తీర్చిదిద్దుతామన్నారు. అదే విధంగా ఇక్కడి వనరులను వినియోగించుకుని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం చేపడుతున్న గృహ నిర్మాణాలకు భిన్నంగా రూ.2 లక్షల వ్యయంతో అన్ని హంగులతో కూడిన గృహాలను నిర్మించి పేదలకు కేటాయిస్తామని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణాను సస్యశ్యామలం చేస్తామని ఉద్ఘటించారు. ఆంధ్ర పార్టీల ఏలికలో తెలంగాణ వివక్షతకు గురైందన్నారు.
తెలంగాణను అడ్డుకుంది
చంద్రబాబే: కడియం శ్రీహరి
డిసెంబర్ 9న రాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన వెంటనే చంద్రబాబు ఖంగు తిన్నారని, వచ్చిన తెలంగాణను రాజీనామా డ్రామాలతో అడ్డుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబుపై ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. జమ్మికుంటలో జరిగిన కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన కె.సి.ఆర్‌తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై జరుగుతున్న ఉద్యమంలో తన వంతు సేవలందిస్తానన్నారు. రాష్ట్ర కార్యదర్శి అరుకాల వీరేశలింగం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యా సాగర్‌రావు, మాజీ ఎం.పి వినోద్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, రసమయి బాల కిషన్, ఈద శంకర్‌రెడ్డి, తుల ఉమ, నర్సింహారెడ్డిలతో పాటు స్థానిక నేతలు ఎక్కటి సంజీవరెడ్డి, పొనగంటి మల్లయ్య, నరేశ్ యాదవ్, పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులను మోసగిస్తే క్రిమినల్ కేసులు
పరిశోధన ఫలాలు అందరికీ అందాలి
రైతు చైతన్య సదస్సులో
నిజామాబాద్ ఎంపి మధుయాష్కిగౌడ్
జగిత్యాల, మే 16: రైతులను అన్ని విధాల ఆదుకుంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ ఎంపి మధుయాష్కిగౌడ్ అన్నారు. గురువారం జగిత్యాలలో జరిగిన రైతు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మె ల్యే ఎల్. రమణతో కలిసి ఆయన వ్యవసాయ పనిముట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపి మాట్లాడుతూ రైతు లను మోసగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చ రించారు. రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ అనేకపథకాలు అమలు చేస్తుందన్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, పని ముట్లు అందించడం, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆర్థికంగా చేయూతనందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రూ. 72వేల కోట్ల రైతుల అప్పులను రుణమాఫీ పథకం కింద మాఫీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రూ. 13వేల కోట్లు రుణమాఫీ చేసి రైతుల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ అంకిత భావంతో పని చేసిందన్నారు. రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు మారుమూల గ్రామాల్లో పొలం బడులు నిర్వహించి రైతులను చైతన్యవంతులను చేయాలని వ్యవసాయాధికారులకు ఎంపి సూచించారు. ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకాలంలో అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేయాలన్నారు. మహారాష్టల్రోని బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారకుండా చూస్తామని, పార్టీలకు అతీతంగా బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌కు రైతు రవి క్రిషి ఎక్స్పోర్ట్ సంస్థలో కొన్న వరి విత్తనాల వల్ల పంట నష్టపోయామని పరిహారం ఇప్పించాలని ఎంపిని కోరగా 24గంటల్లోగా ఆసంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మెట్‌పల్లి వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు మజారోద్దీన్‌ను ఎంపి మధుయాష్కిగౌడ్ ఆదేశించారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎలుగందుల రమణ మాట్లాడుతూ శాస్తవ్రేత్తల పరిశోధన ఫలాలు రైతులకు చేరినప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు చేపట్టి జల దోపిడీ చేస్తుందని,అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. స్వామినాథన్, జయంతి ఘేష్ కమిటీ నివేదికలను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. 60సంవత్సరాలుగా నిండిన రైతులు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎరువులు, విత్తనాలు తెప్పించామని, 12.14లక్షల బిటి కాటన్ ప్యాకెట్లు, మహికో 1.75లక్షలు తెప్పించామని, 28772మెట్రిక్ టన్నుల యూరియా, 23,866మెట్రిక్ టన్నుల డిఎపి, 36329మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 4877మెట్రిక్ టన్నుల పోటాషియం ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎరువులు, విత్తనాలను ఎపి సీడ్స్ ద్వారా ప్రతి మండల కేంద్రంలో ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి రైతుల పాస్ బుక్కుల జిరాక్స్ ప్రతిని తీసుకొని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఉప సంచాకులు ఐసయ్య, జగిత్యాల ఆర్డీఓ ఎం. హన్మంతరావు, ధర్మపురి దేవస్థానం చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, ఓరుగంటి శ్రీనివాసరావు, జి. భూంరెడ్డి, బోయినపల్లి సత్యంరావు,సింగిల్‌విండో చైర్మన్లు అయిలవేని గంగాధర్,ఎడి కొమురయ్య, మజారొద్దీన్, ఎఓలు, శాస్తవ్రేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.
తడబడిన ‘తనిఖీ’..!
* అక్రమాలపై ఆందోళన
ఎల్లారెడ్డిపేట, మే 16: ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ‘సామాజిక తనిఖీ’ ఆందోళనలు, నిరసనల నడుమ కొనసాగింది. ఉపాధి హామీ, మరుగుదొడ్ల నిర్మాణాలు, కూలీల డబ్బులు చెల్లింపుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని లబ్ధిదారులు, కూలీలు అధికారులను నిలదీశారు. బొక్కేసిన డబ్బులపై లెక్క తేల్చాలని పట్టుబట్టారు. అధికారులు సమాధానం చెప్పడానికి తడబడ్డారు. నూతనంగా నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా ఈజీ ఎస్ క్షేత్ర సహాయకుడు కుంట రామచంద్రం కొందరికీ చెందిన పాత వాటి పేర్లను సృష్టించి సుమారు రూ.90 వేలు నొక్కేశారని ఆరోపించారు. కూలీల సంతకాలను ఫోర్జరీ చేసి సుమారు రూ.20 వేలు జేబులో వేసుకున్నారని ధ్వజమెత్తారు. అక్రమాలపై గట్టిగా నిలదీశారు. దాంతో అధికారులు సైతం మిన్నకుండిపోవడంతో మీరెంత తీసుకున్నారని మండి పడ్డారు. అర్హులైన తమకు బిల్లులు చెల్లించాలని భీష్మించారు. అక్రమాలకు పాల్పడిన క్షేత్ర సహాకుడిని తొలగించి న్యాయం చేయాలని విన్నవించారు.
రెవెన్యూ సదస్సుల్లోని
ఫిర్యాదులను పరిష్కరించాలి
* రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి
కరీంనగర్, మే 16: రెవెన్యూ సదస్సుల నిర్వహణ సందర్భంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రెవెన్యూ సదస్సుల నిర్వహణ, తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా గుర్తించిన కౌలు రైతులందరికి రుణ అర్హత కార్డులు జారీ చేయాలని సూచించారు. కౌలు రైతుల జాబితాను బ్యాంకుల పంపించాలని సూచించారు. రెవెన్యూ రికార్డులు సరిగా నిర్వహించాలని అన్నారు. 7వ విడత భూ పంపిణీకి ప్రభుత్వ భూమిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. జూన్ 15 లోగా అందరు తహశీల్దార్లకు లాబ్‌ట్యాప్‌లు సరఫరా చేస్తామని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లకు వారం రోజుల్లో ఆర్‌డిఓలను నియమిస్తామని అన్నారు. కార్యాలయాలు ప్రారంభించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్, డిఆర్‌డిఎ పిడి శంకరయ్య, ఆర్‌డిఓలు స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
విఆర్‌ఓ సస్పెన్షన్
కరీంనగర్, మే 16: భీమదేవరపల్లి (సి) గ్రామ విఆర్‌ఓ గూడెం అమరావతిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2012 సంవత్సరంలో ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ విఆర్‌ఓగా పని చేసిన కాలంలో ఆమె వివాదాస్పద భూమికి సంబంధించి మాన్యువల్ పహాని దిద్ధి, అంతర్పాలంలో ఉన్న డాటాని మార్చినందులకు గాను ఇట్టి విషయంలో అధికారులను తప్పుదోవపట్టించినందుకు ఆర్‌డిఓ నివేదిక ననుసరించి సబ్ రూల్ (1), రూల్ 8, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సిసి అండ్ ఎ) రూల్స్, 1991 ననుసరించి సస్పెండ్ చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
గృహ హింస చట్టాన్ని
పకడ్బందిగా అమలు చేయాలి
కరీంనగర్, మే 16: జిల్లాలో గృహ హింస, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టాలను సంబంధిత అధికారులు పకడ్బంధీగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేటులోని వారి చాం బర్‌లో ఐసిడిఎస్, సిడిపిఓలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వికలాంగుల శాఖ ఎడితో చట్టాల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పోషించామని వారు ఎందరో ఉన్నారని, ప్రజావాణిలో దరఖాస్తులు అందుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో అంగన్‌వాడి కార్యకర్తలుంటారని, అటువంటి కేసులుంటే గుర్తించి వెంటనే రిపోర్టు చేయాలని, కౌన్సిలింగ్ చేసి వారికి తగిన న్యాయం చేయాలన్నారు.
జెఎన్‌టియు కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
english title:
jntu
Date:
Friday, May 17, 2013