మహబూబ్‌నగర్, మే 16: దేశంలోని వివిధ జాతీయ రహదారులపై దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 8.30 గంటలకు జడ్చర్ల సమీపంలో గల మున్వర్ దాబా దగ్గర కేరళ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న కల్టాడ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆగివుందని తెలిపారు. అందులో జాస్ అయికాస్ బంగారు కంపెనీకి చెందిన ఉద్యోగి ప్రశాంత్ పాత బంగారు నగలను కొత్తవిగా చేసుకుని సుమారు రెండున్నర కిలోలు రూ. 50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు గల బ్యాగును బస్సు సీటు కింద గొలుసుతో కట్టి కిందికి దిగి టీ తాగి వచ్చేలోపు బ్యాగు కనిపించలేదని తెలిపారు. అప్పట్లో బంగారు అభరణాలు దొంగిలించారని కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సిసిఎస్ సిఐ మహంకాళి రాంమూర్తితో పాటు మరికొందరు పోలీసులను పంపించడం జరిగిందని అన్నారు. అనుమానం వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లా దనోరా తహశీల్దార్ పరిధిలోని సుబేలకల గ్రామానికి చెందిన షేక్ రషీద్ అలీ, అలీ హసన్‌లను అరెస్టు చేసి విచారించడం జరిగిందని అన్నారు. వారిని విచారించడంతో దొంగతనం చేసిన ఉదంతం బయట పడిందని అన్నారు. అయితే వారి నుండి రూ. 8 లక్షల విలువ గల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసిన వారిని మహబూబ్‌నగర్‌కు తీసుకురావడం జరిగిందని, ఇక్కడికి తీసుకువచ్చాక మరింత విచారణ చేయగా ముఠా గ్యాంగ్‌కు పూర్‌ఖాన్, అక్రంలు ప్రధాన సూత్రదారులుగా తేలిందని, మిగతా రూ. 42 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు పరారీలో ఉన్న దొంగల దగ్గర ఉన్నట్లు తెలుస్తుందని, త్వరలోనే వీరిని పట్టుకుంటామని, ప్రత్యేక బృందాలను పంపిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అయితే దొంగతనాలకు పాల్పడే ముఠాలోని సభ్యులు ప్రధానంగా దేశంలోని జాతీయ రహదారులపైనే వాహనాలలో దొంగతనాలు చేయడానికే ముఠాగా ఏర్పడ్డారని, ఇందులో ప్రధానంగా యుపికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. అనంతరం ఉత్తరప్రదేశ్ నుండి పట్టుకొచ్చిన దొంగల ముఠా సభ్యులను విలేఖరుల ఎదుట ఉంచారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రదీప్‌రెడ్డి, మహబూబ్‌నగర్ డిఎస్పీ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి దొంగలను పట్టుకోవడమే కాకుండా కేసును ఛేదించడంతో చాకచక్యాన్ని ప్రదర్శించిన సిసిఎస్ సిఐ మహంకాళి రాంమూర్తితో పాటు సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందజేశారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
* చరికొండ గ్రామంలో విషాదం
* స్నేహితుడి పెళ్లికి వెళ్లి అనంతలోకాలకు
ఆమనగల్లు, మే 16: నల్గొండ జిల్లా మాల్ సమీపంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమనగల్లు మండలం చరికొండ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంథన్‌గౌరెల్లి గ్రామంలో బుధవారం జరిగిన స్నేహితుడి వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్న కె.నాగరాజు(19), ఎస్.సురేష్ (18), ఎస్.రాజు(17)లు ఎదురుగా వచ్చిన షిఫ్ట్ కారును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో చరికొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చరికొండ గ్రామానికి చెందిన పోచయ్య, లక్ష్మమ్మ, రాములు, రాములమ్మ, దర్గయ్య, బాలమణి కుమారులు నాగరాజు, సురేష్, రాజులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటూ డ్రైవర్, కేబుల్ నెట్‌వర్క్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుడి వివాహ వేడుకకు హాజరై తిరిగి తమ స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తూ మాల్ సమీపంలో గల ప్రధాన రహదారిపై మృత్యువు రూపంలో ఎదురుగా వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు, సురేష్, రాజులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గురువారం ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పరామర్శించారు. చరికొండ గ్రామానికి వైకాపా జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
సంక్షేమ పథకాలపై రోడ్‌షోలు
* కలెక్టర్ గిరిజాశంకర్
మహబూబ్‌నగర్, మే 16: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తెలిపారు. ఇందుకు గాను రాష్ట్ర సమాచారశాఖ జిల్లాకు రోడ్‌షో వాహనాలను కేటాయించిందని అన్నారు. ఈ వాహనాల ద్వారా ప్రతిరోజు గ్రామాలలో జరిగే ప్రతి సంతలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మొదటి రోజు రోడ్‌షోకు వెళ్లే వాహనాన్ని గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్‌షో వాహనం ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కళాకారులు ఆటా.. పాటల ద్వారా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు. అంతేకాక ఈ రోడ్‌షో వాహనాన్ని అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారంతో హోల్డింగ్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రితో పాటు ఇతర మంత్రుల ఫొటోలను ఏర్పాటు చేసి పంపడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు రెండు, మూడు గ్రామాలలో జరిగే సంతలలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇక గ్రామాలలో రోడ్‌షో కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ పిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ, డ్వామా పిడిలు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు
పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్‌లో పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయమై పంచాయతీ అధికారులు, ఆర్డీఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ డేటా సేకరణ, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది నియామకం, ఎన్నికల సామాగ్రి ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తన నియామవళి, సిబ్బందికి శిక్షణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు విషయాలలో అదికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పైన పేర్కొన్నటువంటి అంశాలపై పంచాయతీరాజ్ అధికారులు, ఆర్డీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి అంశంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశాలలో డిపిఓ రవీందర్, డిఆర్‌డిఎ, డ్వామా పిడిలు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరమణరెడ్డి, ఆర్డీఓలు యాశ్మిన్ భాష, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, కిమ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీలలో జంప్ జిలానీలు
* కార్యకర్తల్లో అయోమయం
* ఏడాదికి ముందే ఊపందుకున్న సమీకరణలు
* జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం
మహబూబ్‌నగర్, మే 16: జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారనేది గ్యారంటీ లేకుండా పోతోంది. నేడు కొనసాగుతున్న పార్టీలో రేపు ఆ నాయకుడు ఉంటారోలేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఆ పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. జూన్ మాసంలో జిల్లా రాజకీయాలు మరింత వేడి రగిల్చే అవకాశాలు ఉన్నాయి. వాటికి ఇప్పటి నుండే నేతలు సమాయత్తమవుతున్నారు. నియోజకవర్గాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ముందుగానే అంచనాలు వేసుకుంటూ పావులు కదుపుతున్నారు. అన్నీ రాజకీయ పార్టీలలో జంప్ జిలానీల సంఖ్య ఉండటంతో కింది స్థాయిలో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం సందిగ్ధంలో పడి అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా జంప్ జిలానీలు టిడిపిలోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. టిడిపిని వీడేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే వారు టిఆర్‌ఎస్‌లో చేరాలా, బిజెపిలో చేరాలా అనే సందిగ్ధంలో కూడా ఉన్నట్లు సమాచారం. మరికొందరు నేతలు వైకాపా గూటికి వెళ్లేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదని విశ్వసనీయ సమాచారం. అయితే ముఖ్యంగా ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం రాబోయే ఎన్నికల నాటికి టిడిపిని వీడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిని వీడే అవకాశాలు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం టిఆర్‌ఎస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు పుకార్లు వెలువడుతున్నాయి. ఒక ఎమ్మెల్యే బిజెపిలోకి వెళ్లాలా, లేక వైకాపాలోకి వెళ్లాలనే తర్జనభర్జనలో కూడా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. జంప్ జిలానీల బెడద టిడిపికే ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెదేపాలో ఇలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్‌లో సైతం జంప్ జిలానీల బెడద వెంటాడుతుంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మంద జగన్నాథం ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో విభేదించి ఏకంగా పార్లమెంట్ ఆవరణలో దీక్షకు దిగడం, దాంతో ఆయన ఇక కాంగ్రెస్‌ను వీడుతున్నారని, తెరాసలో చేరుతున్నారనే ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ నాయకులే చేస్తుండటంతో మంద జగన్నాథం ఎన్నికల వరకు టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా ఆరోపణలు గుప్పించిన దాఖలాలు ఉన్నాయి. మంద జగన్నాథం వెంట ఇద్దరు, ముగ్గురు నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మాజీ సర్పంచ్‌లు, జెడ్పీటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు సైతం జగన్నాథం ఎక్కడ జంప్ అయితే అక్కడ ఆయన అనుచరులు కూడా దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారంలో ఉన్నా పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులు నిరుత్సాహంతో ఉండటం, కొన్ని నియోజకవర్గాలలో గ్రూపుల కుంపట్లు ఉండటం, ఎన్నికల వరకు ఏ నాయకుడు ఏ కుంపటికి వెళ్తారో తెలియని పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొంది. పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెరాసలోకి జంప్ జిలానీలు వస్తుండటంతో ఆ పార్టీ నాయకులు కూడా ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు టికెట్లు ఇవ్వని పక్షంలో ఇద్దరు, ముగ్గురు బిజెపిలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరొక నాయకుడు వైకాపాలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. వైకాపాలో సైతం ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఉండటంతో అందులో కూడా జంప్ జిలానీల బెడద ఉంది. బిజెపిలోకి పలువురు నేతలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికినీ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులతో టిఆర్‌ఎస్ నేతలు కూడా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ టిఆర్‌ఎస్ నాయకుల లాబీయింగ్ ఫలిస్తే కొందరు బిజెపి నేతలు కూడా టిఆర్‌ఎస్ గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బిజెపిలోకి బలమైన నేత నాగం జనార్దన్‌రెడ్డి జూన్ 3వ తేదీన కమలం గూటికి చేరనున్నారు. దాంతో బిజెపి శ్రేణుల్లో కొంత ఉత్సాహం నింపినా మరికొందరు నేతలు ఎన్నికల వరకు టిఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం కూడా టిఆర్‌ఎస్ నేతలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే అప్పటి వరకు తన అనుచర గణాన్ని ఎన్నికల్లో గెలిపించుకుని వారికి కావల్సిన ఖర్చు భరించుకుని స్థానిక సంస్థల తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి వివిధ పార్టీలలో పలువురు నేతలు పలు పార్టీలు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదిఏమైనా జిల్లాలో జంప్ జిలానీల నేతలతో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
నెరవేరని స్పీకర్ హామీలు
రోడ్డెక్కిన నల్లమల చెంచులు
మన్ననూరు, మే 16: పేరుకుపోయిన సమస్యల సాధన కోసం ఆదిమ జాతి చెంచులు మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం శ్రీశైలం-హైదరాబాద్ రహదారి మన్ననూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చెంచు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేలంగి మాట్లాడుతూ చెంచుపెంటల్లో కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఫిబ్రవరిలో స్పీకర్ బృందం చెంచుపెంటలను సందర్శించి చెంచులు నివసించేందుకు తగినట్లుగా తాగునీరు, సాగునీరు, వైద్య సౌకర్యం, కరెంటు, పక్కా గృహాలు, ప్రతి కుటుంబానికి పోలీస్, అటవీ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మూడు చెంచుపెంటలకు కలిసి అంబులెన్స్ ఇప్పిస్తామని హామీలు ఇచ్చారని ఆరోపించారు. అవి ఇప్పటి వరకు ఆచరణకు సాధ్యం కాలేదని, అతి చిన్న హామీని కూడా నేటికి నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ మహాధర్నా అధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ సమస్యల సాధన కోసం విసిగివేసారి మరోసారి తీవ్ర ఉద్యమాలకు పూనుకుంటున్నామని, నిజాయితీ గలవారం కాబట్టి స్పీకర్ మనోహర్ మాటలను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా సందర్భంగా రహదారిపై రెండుగంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. మహాధర్నాలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు ముద్దునూరి లక్ష్మినారాయణ మాట్లాడారు. గత ఫిబ్రవరిలో నల్లమలలో పర్యటించిన స్పీకర్ బృందం చెంచుల అభివృద్ధి కోసం, నల్లమల ప్రాంతంలో భూగర్భంలో దాగి ఉన్న నిక్షేపాల కోసమేనని అన్నారు. నిజంగా చెంచుల కోసమే పర్యటించినట్లయితే ఆయన ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. పేరుకుపోయిన సమస్యల సాధన కోసం నల్లమల ప్రాంత చెంచులు మరోసారి రాజీలేని పోరాటం చేయాలని, చలో కలెక్టరేట్ వంటి పాదయాత్రలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఆయన అన్నారు.ఈ ధర్నాలో ఏజెన్సీ గిరిజనేతర హక్కుల పోరాట సమితి నాయకుడు కల్ముల నాసరయ్య, కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు ముద్దునూరి లక్ష్మినారాయణ, బిజెవై ఎం తాలూకా నాయకుడు శంకర్‌జీ, చెంచుసేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి నాగయ్య, స్వామిలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చెంచు మహిళలు పాల్గొన్నారు.
మహిళ దారుణ హత్య
* 24 గంటల్లో నిందితుల అరెస్టు
* రిమాండ్‌కు తరలింపు
* ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడి
మహబూబ్‌నగర్, మే 16: ఓ మహిళను అతి దారుణంగా క్రూరంగా హత్య చేసి ఆపై శరీర భాగాలను విడదీసి గోనె సంచిలో వేసి బస్టాండ్ సమీపంలో గల చెత్తకుప్పలో పడేసిన సంఘటన జడ్చర్లలో కలకలం రేపింది. అయితే మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ నాగేంద్రకుమార్ తెలుపుతూ భూత్పూర్ గ్రామానికి చెందిన బాలమణి(30) అనే మహిళను బాదేపల్లికి చెందిన గొల్ల గోపాల్, జడ్చర్లలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన జయమ్మలు హత్య చేశారని తెలిపారు. బాలమణికి గోపాల్, జయమ్మలు బంధువులు కావడంతో వారిని పలకరించేందుకు ఇంటికి రాగా రాత్రి పొద్దుపోవడంతో ఈనెల 14వ తేదీన బాలమణి జయమ్మ ఇంట్లోనే నిద్రించింది. అయితే జయమ్మకు వెండితో కూడిన కాళ్ల కడియాలు, బంగారు అభరణాలు ఉండటంతో వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కుట్రపన్నిన జయమ్మ, గోపాల్‌లు అదేరోజు హత్య చేశారు. బాలమణి మృతదేహాన్ని భాగాలుగా నరికేసి గోనె సంచిలో మూటకట్టి జడ్చర్ల బస్టాండ్ సమీపంలో గల చెత్తకుప్పలో పడేశారు. అయితే మరుసటి రోజు కూడా బాలమణి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాలమణిని చంపి ఆమెపై ఉన్నటుఅభరణాలను దొంగిలించిన జయమ్మ, గోపాల్‌లు వాటిని తీసుకుని ఓ బంగారు షాపులో అమ్మేందుకు ప్రయత్నించగా ఈ విషయంపై అనుమానం వచ్చిన వ్యాపారులు నిరాకరించారు. మృతురాలి భర్త వెంకటయ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అనుమానం వచ్చిన జయమ్మను పోలీసు తరహాలో విచారించగా అసలు సంగతి చెప్పిందని ఎస్పీ వెల్లడించారు. అయితే జయమ్మతో కలిసి ఆమె సోదరుడు గోపాల్ కూడా బాలమణిని హత్య చేశారని తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జడ్చర్ల పోలీసులు 24 గంటల్లోపే కేసును ఛేదించి హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రదీప్‌రెడ్డి, డిఎస్పీ మల్లికార్జున్, జడ్చర్ల సిఐ వెంకటరమణ, పోలీసు పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
చోరీకి పాల్పడిందంటూ మహిళపై దాడి
* మనస్తాపంతో ఆత్మహత్య
గద్వాల, మే 16: ఇంట్లో ఎవరు లేని సమయంలో పక్కింటికి చెందిన మహిళ చోరికి పాల్పడిదంటూ అనుమానంతో ఒకరోజు రాత్రంత మంచానికి కట్టేసి దాడి చేయడంతో మనస్తాపం చెంది మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, ధరూరు మండలంలోని రేవులపల్లిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మేకలసోంపల్లి గ్రామానికి చెందిన పద్మ(28)ని రేవులపల్లి గ్రామానికి చెందిన వెంకటన్నకు ఇచ్చి వివాహం జరిపించారు. గత రెండు రోజుల క్రితం రేవులపల్లి గ్రామంలోని ఇంటి పక్కల ఉన్న ఆంజనేయులు ఇంట్లో రూ.50వేల నగదు, అర తులం బంగారం, కుక్కర్ చోరీకి గురయ్యాయి. ఇంటి పక్కల ఉన్న పద్మే చోరీకి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెను మేకలసోంపల్లి నుంచి రేవులపల్లికి తీసుకువచ్చి పరుశురామ్, భాస్కర్, నర్సింహులుతో పాటు ఆంజనేయులు, గోవిందమ్మ, శివమ్మలు బుధవారం రాత్రి మంచానికి కట్టివేసి దాడి చేశారు. పద్మతో పాటు ఆమె తండ్రి శేషప్పను కూడా కట్టివేశారు. ఉదయం ఆమె తండ్రి మేకలసోంపల్లికి కుల పెద్దలను తీసుకువచ్చారు. అంతలోనే మనస్తాపం చెందిన పద్మ ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ధరూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలకు న్యాయసేవాధికార సంస్థలో సహాయం
* జడ్జి శేషగిరిరావు
మహబూబ్‌నగర్, మే 16: మహిళలు, బాలికలు వారి హక్కులను పొందే విషయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి శేషగిరిరావు తెలిపారు. మహిళా సాధికారత, బాలికల విద్య అనే అంశంపై సిడిపిఓలు, మహిళా గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి ఈనెల 15 నుండి 17వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శిక్షణ కేంద్రంలో ఇస్తున్న శిక్షణకు జడ్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన సిడిపిఓలు, ప్రధానోపాధ్యాయులు గ్రామాలలో ప్రజలకు మహిళల హక్కుల గురించి వివరించాలని అన్నారు. మహిళలు, బాలికలు వారి కోసం రూపొందించిన హక్కులు పొందడంలో విఫలమవుతున్నారని, అయితే వారికి అవగాహన లేని కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి సహాయ పడేందుకు న్యాయపరమైన సహాయాన్ని న్యాయసేవాధికార సంస్థ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కేంద్రం మేనేజర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
19న పోలీసు రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష
పాలమూరు, మే 16: పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు ఇదివరకే హాల్‌టికెట్లు అందజేయడం జరిగిందని, సూచించిన నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్షకు మహిళా, పురుష అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు వెంట విలువైన వస్తువులు, సెల్‌ఫోన్లు, క్యాలిక్యులెటర్లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు తీసుకరాకూడదని పేర్కొన్నారు. పరీక్షా సమయానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమని ఎస్పీ పేర్కొన్నారు.