విశాఖపట్నం, మే 16: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసభసగా మారింది. త్వరలో ఏర్పాటు చేయనున్న మహిళా ఫోరం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో గురువారం స్థానిక కుమారి కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. గత కొద్ది కాలం వరకూ బెహరా భాస్కరరావు, ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ మధ్య విభేదాలు ఉండేవి. భాస్కరరావుకు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి లభించిన తరువాత వీరిద్దరూ వైరానికి స్వస్తి చెప్పారు. అయితే, ఈ నియోజకవర్గంలో బాస్కరరావు వర్గం, విజయ ప్రసాద్ వర్గం కలవలేకపోయాయి. వీరి మధ్య మాత్రం వైషమ్యాలు అలాగే ఉన్నాయి. సమావేశం ఎందుకు నిర్వహించారో, దాని గురించి మరిచిపోయి, త్వరలోనే నియమిస్తున్న వార్డు కమిటీ అధ్యక్షుల గురించి చర్చ ప్రారంభమైంది. 66వ వార్డుకు కాంగ్రెస్ అధ్యక్షునిగా గేదెల మురళీకృష్ణను అధ్యక్షునిగా నియమించాలని బెహరా భాస్కరరావు వర్గం డిమాండ్ చేసింది. మరోపక్క గత ఎన్నికల్లో మళ్ల విజయ ప్రసాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన దొడ్డి కిరణ్‌కు ఈ వార్డు అధ్యక్ష పదవి ఇవ్వాలని మళ్ల వర్గీయులు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో కొంతమంది లేచి, మురళీకృష్ణ పార్టీకి చేసిన సేవలేంటో చెప్పాలని మళ్ల వర్గీయులు కోరారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మళ్ల, బెహరా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది
అనకాపల్లికి తొమ్మిది మందితో కమిటీ
విశాఖపట్నం, మే 16: అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీని నడిపించేందుకు తొమ్మిది మందితో కూడిన కమిటీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియమించనున్నారు. అనకాపల్లి నియోజకవర్గ సమీక్షా సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. అలాగే పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పప్పల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ దాడి వీరభద్రరావు పార్టీ నుంచి వెళ్లిపోయినా, నష్టమేమీ లేదని అన్నారు. తామంతా మనో ధైర్యంతో ఉన్నామని బాబుకు చెప్పారు. దాడిపై వీరు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అక్కడి కార్యకర్తలపై తనకు నమ్మకం ఉందని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని టిడిపి తప్పక గెలుచుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి తొమ్మిది మందితో కూడిన కమిటీని నియమించనున్నారు. వీరిలో ఎవరి పనితీరు బాగుంటే, వారిని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించనున్నారు. ఈ కమిటీ నియామకంపై చర్చించేందుకు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు శుక్రవారం చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నారు.
నేటి నుంచి నియోజకవర్గాల్లో మినీ మహానాడు
విశాఖపట్నం, మే 16: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మినీ మహానాడు సమావేశాల గురించి వివరించారు. శుక్రవారం విశాఖ దక్షిణ నియోజకవర్గ సమావేశం రెల్లివీధి అంబేద్కర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అలాగే శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గ సమావేశం సవేరా ఫంక్షన్ హాలులోను, ఉత్తర నియోజకవర్గ సమావేశం గురుద్వార్ దగ్గర ఉన్న కావేరి కళ్యాణ మండపంలోను, గాజువాక నియోజకవర్గ సమావేశం వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. అలాగే పెందుర్తి నియోజకవర్గ సమావేశం సబ్బవరం మండలం దేవిపురంలో జరుగుతుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమావేశం కంచరపాలెం రామాలయం వద్దఉన్న కళ్యాణ మండపంలో జరుగుతుంది. భీమిలి నియోజకవర్గ సమావేశం తగరపువలస జూట్‌మిల్ వెల్ఫేర్ సెంటర్‌లో జరగనుంది.
ఈ సమావేశంలో చంద్రబాబు ఇటీవల నిర్వహించిన వస్తున్నా మీకోసం యాత్ర- దాని ప్రభావంపై చర్చ జరుగుతుందని గణేష్‌కుమార్ తెలియచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ రంగం చిన్నాభిన్నమైన పరిస్థితి, నీటిపారుదల, వ్యవసాయ రంగాల సంక్షోభం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కుంభకోణాలు, క్షీణించిన శాంతి భద్రతలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుజనా చౌదరి, చిన రెహమాన్ హాజరుకానున్నారని ఆయన తెలియచేశారు. ఈ సమావేశాలకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వాసుపల్లి కోరారు.
వృత్తి నైపుణ్యతతో మెరుగైన ఫలితాలు
* స్టీల్ ప్లాంట్ సిఎండి చౌదరి వెల్లడి
విశాఖపట్నం, మే 16: సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని స్టీల్ ప్లాంట్ సిఎండి ఎపి చౌదరి అన్నారు. యాన్యువల్ క్వాలిటీ సర్కిల్స్, సృజన్ వికాస్, 5ఎస్ గుర్తింపు వేడుకలు గురువారం స్టీల్ ప్లాంట్‌లోని టి అండ్ డిసి ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేనేజ్‌మెంట్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అందరికన్నా ముందు ఉండాలంటే, నైపుణ్యం, తెలివితేటలకు పదును పెట్టాలని సూచించారు. ప్రతి సంస్థ కూడా తమ ముందున్న సవాళ్లను అధిగమించేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మానవవనరుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని ఆయన తెలియచేశారు.
గోశాల నుండి గోవులను
తరలిస్తున్న రెండు వ్యానులు మాయం
* అక్రమ రవాణాదారుల చేతివాటం
* గాలింపు చర్యల్లో అధికారులు
సింహాచలం, మే 16: సింహాచలం గోశాల నుండి గోవులను తరలిస్తున్న రెండు వ్యానులను అక్రమ రవాణాదారులు దారి మళ్లించారు. వీటి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దేవస్థానం గోశాలలో కోడెదూడల మరణాల నేపథ్యంలో గోవులను విశాలమైన ప్రాంగణానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గోవులను తరలిస్తున్న రెండు వ్యానులను అక్రమ రవాణాదారులు దారి మళ్లించి, గుర్తు తెలియని ప్రాంతానికి గోవులను తరలించారు. ఈ విషయం తెలిసిన దేవస్థానం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గతంలో దేవస్థానంతో లావాదేవీలు నడిపిన వ్యాపారే వీటిని అక్రమంగా తరలించుకుపోయి ఉంటాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గోశాలలో దూడలను ఎక్కించిన వ్యానులు అడివివరం వద్ద ముడసర్లోవ వైపునకు వెళ్ళాల్సి ఉండగా శొంఠ్యాం వైపుగా దారి మళ్ళించినట్లు సమాచారం అందింది. సమీపంలోని క్వారీ వద్ద కోడెదూడలతో వ్యాన్‌ను చూసామని కొంతమంది సమాచారం అందించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న దేవస్థానం అధికారులు అన్ని వైపుల నుండి చర్చలకు సిద్ధమవుతున్నారు.
వీరి పరిస్థితి ఏంటో
* బదిలీ జరిగినా రిలీవ్ కాలేదు
విశాఖపట్నం, మే 16: అన్నీ కలసి వచ్చాయి. అనుకున్న చోటుకి కాకపోయినా ఉన్నచోటు నుంచి బదిలీ అయిపోయింది. అయితే కొత్త చోట కొలువులో చేరే అవకావమే లేకుండా పోయింది. విద్యాశాఖలో బదిలీలు పూర్తయినా బదిలీ ప్రాంతానికి వెళ్లి ఉద్యోగంలో చేరలేని ఉపాధ్యాయులు పరిస్థితి ఇది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగికి బదిలీ జరిగినా కొత్తగా అక్కడ చేరాల్సిన ఉపాధ్యాయుడు వస్తే తప్ప బదిలీ జరిగిన ఉపాధ్యాయుడు రిలీవ్ కావడానికి వీల్లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదులు సంఖ్యలోనే ఉపాధ్యాయులు బదిలీ జరిగినా రిలీవ్ కాలేదు. నిబంధనల మేరకు వీరు పనిచేసే చోటే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా త్వరలోనే మరోసారి కౌనె్సలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు. అయితే డిఎస్సీని ప్రకటించిన తర్వాతే మలివిడత కౌనె్సలింగ్ ఉంటుందని ఆమే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా రేషనలైజేషన్, పాఠశాలల రద్దు కారణంగా దాదాపు 430 ఎస్జీటీ పోస్టులు సర్‌ప్లస్‌గా ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. వీటిలో అత్యధికం ఏజెన్సీప్రాంతాలకు చెందినవే ఉన్నాయి.
జివిఎంసిలో అధికార్ల బదిలీలు
విశాఖపట్నం, మే 16: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానం చలనం కలిగింది. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఇఇలు రవి, వినయ్‌కుమార్‌లను బదిలీ చేశారు. వీరిలో రవి హైదరాబాద్‌కు, వినయ్‌కుమార్ ఎపియుఎస్‌బిఐసికి బదిలీపై వెళ్లనున్నారు. పట్టణ ప్రణాళికా విభాగంలో డిసిపిగా పనిచేస్తున్న లక్ష్మణరావు బదిలీ చేశారు. ఈయన స్థానంలో రాజమండ్రిలో పనిచేస్తున్న మీనాకుమారి వచ్చారు. అలాగే జోన్ 2 ఎసిపి శ్రీనివాస్‌కు రాజమండ్రి, జోన్ 4 ఎసిపి వెంకటరత్నంను విజయనగరం బదిలీ చేశారు. అలాగే టౌన్ ప్లానింగ్ టిపిఎలుగా పనిచేస్తున్న అమర్‌నాథ్ (జోన్ 4), కనకరావు (జోన్ 5). హరిబాబు (జోన్ 6) బదీలీ అయిన వారిలో ఉన్నారు. త్వరలోనే మరికొంతమంది అధికారుల బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెల్సింది.
యనమలను సత్కరిస్తున్న యాదవ ఐక్య వేదిక
పదవులు శాశ్వతం కాదు
* తెదేపా నేత యనమల
విశాఖపట్నం, మే 16: పదవులు శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నపుడు తన ప్రాంతానికి, తన వర్గానికి చేసిన సేవలే గుర్తింపును తెస్తాయని శాసనమండలి తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జిల్లా యాదవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో యనమలను గురువారం ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితంలో పదవులు వచ్చిపోతుంటాయని, పదవులున్నా, లేకున్నా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పినప్పుడే నాయకుడికి మనుగుడ ఉంటుందన్నారు. స్వార్ధంతో పనిచేసిన నాయకుడు ఎప్పుడు ఉన్నత శిఖరాలు అందుకోలేరని వాఖ్యానించారు. తెలుగుదేశం అధిష్టానం కల్పించిన ఈఅవకాశాన్ని పార్టీ పురోభివృద్ధితో పాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు యనమలను యాదవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అల్సి అప్పలనారాయణ యాదవ్, పడాల రమణ, మొల్లి లక్ష్మణరావు, గోవింద్, ఒమ్మి సన్యాసిరావు, మన్యాల సోంబాబు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బదిలీల్లో అవకతవకలు
* జాబితాల తయారీలోనే దిద్దుబాట్లు
* వైద్య ఆరోగ్యం, విద్యాశాఖల తీరుపై ఆరోపణల వెల్లువ
విశాఖపట్నం, మే 16: నిషేధాన్ని ఎత్తివేయడంతో పక్షం రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ జాతర కొనసాగింది. బుధవారం నాటితో బదిలీల ప్రక్రియ ముగించగా, తిరిగి నిషేధం అమల్లోకి వచ్చింది. దాదాపు 15 రోజుల పాటు కొనసాగిన బదిలీల ప్రక్రియలో అన్ని ప్రభుత్వ శాఖల్లోను భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా వైద్యఆరోగ్యం, విధ్యాశాఖ ఉద్యోగుల బదిలీల్లో యంత్రాంగం తెరచాటు మంత్రాంగం నడిపి, అస్మదీయులకు అనుకున్నది సాధించిపెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులుమారినట్టు బహిరంగంగానే విమర్శలు చోటుచేసుకున్నాయి. రెవెన్యూ, సంక్షేమం, పంచాయతీరాజ్ మరికొన్ని శాఖలు మినిహా మిగిలిన అన్ని శాఖల్లోను బదిలీ ప్రహసనం కొనసాగిందనే చెప్పాలి. ముఖ్యంగా వైద్యఆరోగ్యశాఖలో జోన్ -1 పరిధిలో 700 మందికి పైగా సిబ్బందికి బదిలీలు జరిగాయి. ఎఎన్‌ఎం, స్ట్ఫానర్సు తదితర పోస్టుల్లో బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు విమర్శలు రావడంతో అప్పటి వరకూ బదిలీల జాబితాలను చూసిన కమిటీని సైతం కలెక్టరు మార్చాల్సి వచ్చిందంటే ఏమేరకు అవకతవకలు చోటుచేసుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇక విద్యాశాఖలో బదిలీలు ఉద్రిక్త పరిస్థితుల నడుమే జరిగాయి. ఖాళీలను ప్రకటించడంలోనే విద్యాశాఖ యంత్రాంగం చేతివాటాన్ని ప్రదర్శించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. జివిఎంసిలో విలీనమైన గాజువాక మున్సిపాలిటీ సహా 32 గ్రామాల పాఠశాలల్లోని ఖాళీలను ప్రకటించకుండానే కౌనె్సలింగ్ చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు నిరసించాయి. గత తొమ్మిదేళ్లుగా పాతుకుపోయిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ ఉత్తర్వులు తెచ్చుకుంటూ బదిలీ లేకుండా తప్పించుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కౌనె్సలింగ్ స్తంభింపచేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విలీన ప్రాంత పాఠశాలల్లోని పోస్టులకు సైతం కౌనె్సలింగ్ నిర్వహించారు. అలాగే 2008 డిఎస్సీ హామీ అభ్యర్థుల కౌనె్సలింగ్‌లో కూడా గందగోళం చోటుచేసుకుంది. ఇక్కడ హామీ అభ్యర్థులకు సంబంధించి హిందీ పండిత్ పోస్టులను ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. అయితే నిబంధనలు సాకుచూపి వీరికి అవకాశం కల్పించకపోవడంతో హిందీ ఉపాధ్యాయులు కౌనె్సలింగ్‌ను బహిష్కరించారు. రవాణాశాఖలో సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. కోరుకున్న పోస్టింగ్ కోసం కొంతమంది అధికారులు అక్రమ మార్గాలను అనుసరించినట్టు ఆరోపణలు వచ్చాయి. పంచాయతీరాజ్, ఇరిగేషన్ విభాగాల్లో బదిలీల్లో సైతం పాయింట్ల విషయంలో అక్కడక్కడ సమస్యలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద బదిలీల ప్రక్రియ జిల్లాలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చిందనే చెప్పాలి.
ఇ టికెట్ మోసాలకు చెక్
* ప్రయాణీకులు చైతన్యంపై ఐఆర్‌సిటిసి దృష్టి
* వాల్తేరు డివిజన్‌లో విస్తరణకు ప్రత్యేక చర్యలు
విశాఖపట్నం, మే 16: ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ సిస్టం (ఇఆర్‌ఎస్)లో ఈటికెట్ తీసుకునే ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోసాలకు గురికారు. అధీకృత ఏజెంట్ పూర్తి వివరాలతో పాటు టికెట్ వివరాలను రైల్వే వెబ్‌సైట్‌లో మరోసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈటికెట్ మోసాలతో పాటు అధిక ఛార్జీల వసూళ్లను నిరోధించేందుకు రైల్వేశాఖ ప్రయాణీకుల చైతన్య సదస్సులను నిర్వహిస్తోంది. ఈటికెట్ బుకింగ్, రద్దు వంటి అంశాలకు సంబంధించి అధీకృత ఏజెంట్ల వివరాలను ముందుగానే సరిచూసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్, రద్దుకు సంబంధించిన సమాచారం ఐఆర్‌సిటిసి నుంచి మొబైల్ ఫోన్లకు సమాచారం వస్తుంది. మొబైల్ సమాచారంతో ఈటికెట్ ప్రింట్‌ను ప్రయాణీకులు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, మొబైల్ మెసేజ్‌ను టిటిఇకి చూపిస్తేచాలు. అయితే ఈటికెట్ తీసుకున్న ప్రయాణీకులు తమ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈటికెట్‌కు సంబంధించి అధీకృత ఏజెంట్‌లు ఎసి తరగతుల్లో ప్రయాణానికి 40 రూపాయలు, ఇతర తరగుతుల్లో ప్రయాణానికి 20 రూపాయలు మించి వసూలు చేసిన పక్షంలో రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే దీనిని వాల్తేరు డివిజన్ పరిదిలో పటిష్టంగా అమలు చేసేందుకు జోన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సర్వీస్ ఛార్జీల పెంపుపై ఎయిర్ యూజర్స్ ఆగ్రహం
విశాఖపట్నం, మే 16: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో సర్వీసు ఛార్జీల పెంపు, లగేజీ నియంత్రణను అమలు చేస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఇండియా విశాఖ చాప్టర్ తప్పుపట్టింది. ప్రయాణీకులు తమతో తీసుకెళ్లే లగేజిని పరిమితం చేయడం వల్ల వారికి అవసరమైన తినుబండారాలు, మందులు ఇతర పదార్థాలను వదులుకోవాల్సి వస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు డి వరదారెడ్డి అభిప్రాయపడ్డారు. పౌరవిమానయాన శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుకోవాలని ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు విజ్ఞప్తి చేశారు. పౌరవిమానయాన శాఖ తీసుకున్న నిర్ణయంపై తమ అసోసియేషన్ తరపున పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు.
ఖాళీ స్థలాల పన్నుపై జివిఎంసి దృష్టి
* జూన్ 30లోగా చెల్లించాలంటూ హుకుం
విశాఖపట్నం, మే 16: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో ఖాళీ స్థలాల పన్ను (విఎల్‌టి) వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఏళ్ల తరబడి విఎల్‌టి చెల్లించకుండా ఉన్న స్థలాలను గుర్తించి ఆయా స్థలాలను ఎవరికీ చెందని వాటిగా ప్రకటించాలని కమిషన్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న విఎల్‌టిలను జూన్ 30లోగా వసూలు చెల్లించాలని పేర్కొన్నారు. జోన్ -1 కార్యాలయంలో అధికారులతో గురువారం అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో సుమారు 50 కోట్ల రూపాయల మేర విఎల్‌టి వసూలు కావాల్సి ఉండగా, కేవలం 5 కోట్లు రూపాయలు మాత్రమే వసూలవుతోందన్నారు. విఎల్‌టి వసూళ్లపై కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పన్నుల సక్రమంగా వసూలైతేనే వౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక కార్యక్రమాల నిర్వాహణ సాధ్యపడుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఆస్తిపన్ను సహేతుకంగా నిర్ణయించి వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
బిపిఎల్ కొళాయిల మంజూరుకు ఆదేశం
దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు తక్కుల డిపాజిట్‌తో మంచినీటి కొళాయి కనెక్షన్ మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అల్పాదాయ వర్గాలకు ప్రభుత్వం కొళాయి మంజూరుకు నిధులు విడుదల చేసిన దృష్ట్యా అధికారులు అర్హులను గుర్తించి వారికి కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలని స్పష్టం చేశారు. జోన్ 1 పరిధిలో 10 వేల కొళాయి కనెక్షన్లకుగాను 3000 కనెక్షన్లు బిపిఎల్ కింద ఉన్నాయని జెడ్సీ ఎన్ శివాజీ వివరించారు. జోన్ పరిధిలో ప్రస్తుతం 300 దరఖాస్తులు మాత్రమే బిపిఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే మంజూరు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. అలాగే సెమీ బల్క్ కనెక్షన్ల మంజూరు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జోన్ పరిధిలో 34 సెమీబల్క్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి త్వరలోనే మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జోన్ల పరిధిలో అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారం కోసమే జోనల్ సమీక్షలను క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన వల్ల ప్రజలకు వౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు దోహదపడుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రి మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన రహదార్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగిన దృష్ట్యా వాటిని సత్వరమే చేపట్టి పూర్తి చేయాలన్నారు. అలాగే వార్డుల్లో పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కోవార్డులో కోటి రూపాయలతో పార్కుల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. జోన్ సందర్శనలో చీఫ్ ఇంజనీర్ బి జయరామిరెడ్డి, చీఫ్ సిటీప్లానర్ ఎస్ బాలకృష్ణ, ఎఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, ఎడి బలరామకృష్ణ తదితదరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ ఇతర అధికారులు విశాఖ వేలీ స్కూల్ నుంచి బీచ్ వరకూ నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
రైతులకు రుణాల మంజూరుకు చర్యలు
* కలెక్టర్ శేషాద్రి
అనకాపల్లి, మే 16: రైతులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి. శేషాద్రి అన్నారు. మండలంలో జైతవరం, శిరిజాం, తురువోలు, పెదగోగాడ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. జైతవరం గ్రామంలో కోడూరు వెంకటరమణకు చెందిన వర్మీకంపోస్టును పరిశీలించారు. అలాగే శిరిజాం గ్రామంలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టుమిషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తురువోలులో పామాయిల్ తోటలను ఆయన పరిశీలించి పెదగోగాడ పిహెచ్‌సికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. మందులు సక్రమంగా అందుతున్నదీ లేనిది రోగులను అడిగి తెలుసుకున్నారు. రైతులు అంతర పంటలపై మొగ్గుచూపాలని కలెక్టర్ రైతులకు సూచించారు. అంతర పంటలకు విత్తనాలు వ్యవసాయ కేంద్రంలో దొరకడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కాయగూరల విత్తనాలను వ్యవసాయ కార్యాలయంద్వారా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు పి. శివప్రసాద్‌ను ఆయన ఆదేశించారు. చోడవరం నుండి చీడికాడకు బస్సులేక అవస్థలు పడుతున్నామని కలెక్టర్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎంతో మాట్లాడి బస్సు వచ్చేటట్లు చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. శిరిజాంలో సాక్షర భారత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టుమిషన్ కేంద్రంలో ఒకటే మిషన్ ఉండటం వలన ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరో కుట్టుమిషన్ వచ్చేటట్లు చూడాలని ఎంపిడివో గుణలక్ష్మిని ఆదేశించారు. బకాయిపడ్డ ఉపాధి కూలీలకు ఈనెల 25వ తేదీలోగా వేతనాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి.అప్పలనాయుడు, హౌసింగ్ ఎఇ,ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ రాంగోపాల్, అధికారులు పాల్గొన్నారు.
రూ. 12 లక్షల విలువైన గంజాయి పట్టివేత
రోలుగుంట, మే 16: మండలంలోని కొంతలం సమీపంలోని నంది వొంపు వద్ద 12 లక్షల రూపాయలు విలువైన గంజాయి పట్టుబడింది. ఈ సంఘటన లో గంజాయి తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 120 కేజీల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒకవ్యక్తి పరారయ్యాడు. మండలంలో ని రాజన్నపాలెంకు చెందిన ఎం.కొండబాబు, శరభవరం గ్రామానికి చెందిన ఎం. ఈశ్వరరావు, ఎం.కె.పట్నంకి చెం దిన వియ్యపుమారేసులు చింతపల్లి మండలం రాళ్ళగెడ్డలో 120 కేజీల గం జాయిని ఇటీవల కొనుగోలు చేసి కొం తకాలం సమీపంలోని నందివొంపు వ ద్ద నిల్వ ఉంచారు. గురువారం తెల్లవా రుజామున గంజాయిని తరలించేందు కు వాహనం కోసం ఎదురుచూస్తుండ గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై జి.అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు వీరిని అనుమానించి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎం.కె.పట్నంకి చెందిన వియ్యపు మారేసు వీరిని గమనించి పరారయ్యా డు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న గంజాయిని స్వాధీన పర్చుకున్నారు. స్వాధీన పర్చుకున్న గంజాయి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని వీరు దువ్వాడ రైల్వే స్టేషన్‌కు తరలించి అక్కడ నుండి తమిళనాడుకు తీసుకువెళ్ళి విక్రయాలు జరుపుతారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై జి. అప్పన్న విలేఖరులతో మాట్లాడుతూ భవిష్యత్‌లో గంజాయిపై మరింత విస్తృతంగా దాడులు జరుపుతామని ఆయ న పేర్కొన్నారు. బుధవారం రాత్రి మం డలంలోని శరభవరం, బుచ్చింపేట, రత్నంపేట, బి.బి.పట్నం గ్రామాల్లో పెట్రోలింగ్ జరిపి పాతముద్దాయిలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు.
నదిలో మునిగి యువకుడి మృతి
కోటవురట్ల, మే 16: కోటవురట్ల శివారు గవరపేట వద్ద ప్రమాదవశాత్తు వరాహనదిలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలో తంగేడు గ్రామానికి చెందిన సింగంపల్లి శ్రీను(35) పశువులను మేపేందుకు వరాహనది ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. పశువులు నదిలోకి దిగడంతో వాటిని బయటకు తీసుకువచ్చేందుకు శ్రీను కూడా నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో శ్రీను ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలుఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోవిందరావు తెలిపారు.
మంచినీటి సమస్యతో
మున్సిపల్ అధికారులపై మహిళల ఆగ్రహం
అనకాపల్లి (నెహ్రూచౌక్), మే 16: గత రెండురోజులుగా నీళ్లు రావడం లేదని, కనీసం నీళ్లు రావన్న సమాచారం కూడా లేదని, ఒకవేళ కుళాయి లు ఆలస్యంగా వస్తాయని రెండురోజులుగా ఎదురుచూశామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కుళాయిల నీ రు రావన్న సమాచారాన్ని ముందుగా తెలియజేయక పోవడంపై అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళాయిలు రావన్న విషయం తమకు ముందుగా తెలియజేస్తే తాము దూరప్రాంతాలకు వెళ్లి తెచ్చుకునే వారమని మహిళలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. రెండురోజులైనా కూడా కుళాయిలు రాకపోవడంతో ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తే మున్సిపాలిటీ హెడ్‌వాటర్ వర్క్స్‌వద్ద మో టార్లు కాలిపోయాయని, ఆ విషయం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తెలియజేసింది. పట్టణంలో ఒకపక్క విద్యుత్ కోత, మరోపక్క మున్సిపల్ కుళాయిలు రాక ప్రజలకు తీవ్రమైన నీటికొరత ఏర్పడింది. దీంతో ప్రజలు ఒత్తిడిమేరకు గురువారం నుండి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు మున్సిపల్ అధికారులు పూనుకున్నారు. పట్టణంలో 34 మున్సిపల్ వార్డులుఉండగా, ఈమూడు ట్యాంకర్ల నీళ్లు ఏ మూలకు వస్తాయని మహిళలు నిలదీశారు. దీనికి త్వరలో మోటార్‌లను బాగుచేయించి మళ్ళీ యథావిధిగా కుళాయిలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆశాజ్యోతి, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సూచనల మేరకు చెప్పారు.
22న సిమ్స్‌పై తుది ఛార్జ్‌షీట్ దాఖలు
* డైరెక్టర్లు ఆస్తులు గుర్తించాం
* భూములు విక్రయించకుండా చర్యలు
* నేడు డిపాజిట్‌దారులతో ఎఎస్పీ సమావేశం
నర్సీపట్నం, మే 16: డిపాజిట్ దారులకు కోట్లాది రూపాయలు టోపీ పెట్టి బోర్డు తిప్పేసిన సిమ్స్ ఫైనాన్స్ సంస్థ మోసాలపై పోలీసులు తుది ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నర్సీపట్నం కేంద్రంగా కొనసాగిన సిమ్స్ ఫైనాన్స్ సంస్థలో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేసిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలకు ఆశపడి డిపాజిట్లు చేసిన అనేక మందికి సిమ్స్ డైరెక్టర్లు టోపీ పెట్టారు. లక్షల రూపాయలు నష్టపోయిన డిపాజట్‌దారుల్లో కొంతమంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇక్కడ ఎ ఎస్పీగా పనిచేసిన తఫ్సీర్ ఇక్బాల్ సిమ్స్ ఫైనాన్స్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. అలాగే సిమ్స్ డైరెక్టర్లను, పలువురు ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. తఫ్సీర్ ఇక్బాల్ రెండు నెలలక్రితం ఇక్కడి నుండి బదిలీ కావడంతో ఈకేసు ముందుకు సాగలేదు. ఇక్కడ ఎఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విశాల్‌గున్నీ సిమ్స్ ఫైనాన్స్ కేసుపై దృష్టి సారించారు. గురువారం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో సిమ్స్ డైరెక్టర్లు అస్తులను గుర్తించామని చెప్పారు. ఈ కేసుకు తుది ఛార్జ్‌షీట్‌ను ఈనెల 22వ తేదీన కోర్టులో వేయనున్నట్లు తెలిపారు. సిమ్స్ సంస్థ డైరెక్టర్లు ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేసిందీ గుర్తించామన్నారు. ఈ భూములు రిజిష్టేషన్లు కాకుండా ఆయా సబ్ రిజిష్టార్ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపించామన్నారు. సిమ్స్ ఫైనాన్స్ సంస్థ డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్ దారులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలన్నారు. వారి పూర్తి వివరాలను తెలియజేయాలన్నారు. ఏజెంట్లు, డైరెక్టర్లు , బాధితులు ఎవరైనా వచ్చి తమ సమస్యను ఎఎస్పీకి తెలియజేసుకోవాలన్నారు.