Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నత్తనడకన ఆధునీకరణ

$
0
0

శ్రీకాకుళం, మే 16: ఆరుగాలం కష్టపడే అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడటంతో ప్రతీఏటా వరిపంట కలసిరాక వ్యవసాయ మదుపుల పేరిట తీసుకున్న రుణాలు వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నారాయణపురం కుడికాలువ శివారు గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాది కూడా సాగునీటి ఇబ్బందులు తప్పేటట్లు లేదు. నారాయణపురం కుడికాలువ పరిధిలో గల సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,306 ఎకరాలకు సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 6.84 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పనులు నిర్వహణకు 2010, ఏప్రిల్‌లో టెండర్లు ఖరారు చేశారు. ఈ టెండర్లను కడపకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకుని 3.9 కోట్ల రూపాయలను ఖర్చుచేసి మిగిలిన పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇంతలోనే కాంట్రాక్టర్ ఆకస్మికంగా మృతిచెందడంతో ఆధునీకరణ పనులు ముందుకు సాగలేదు. గత ఏడాది కూడా పనులు ప్రారంభిస్తారని రైతులు ఆశగా ఎదురుచూసినప్పటికీ అది జరుగకపోవడంతో సాగునీటి కష్టాలు టైలాండ్ రైతులను వెంటాడటమే కాకుండా తీవ్రంగా పంటనష్టానికి గురిచేశాయి. 50.5 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన కాలువ సాగునీటి సరఫరా పర్యవేక్షించేందుకు గ్రావెల్‌రోడ్డు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అలాగే వరదలు సంభవించినప్పుడు అనేక చోట్ల కాలువ గట్లుకు గండిపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రక్షణ గోడలు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. శిథిలావస్థకు చేరిన 22 మదుములు పునరుద్ధరించి బ్రాంచ్ ఛానెల్‌కు నీరందించాల్సి ఉన్నప్పటికీ అవి నేటికీ పూర్తికాలేదు. సంతకవిటి మండలంలో ఆధునీకరణ పనుల్లో భాగంగా డిక్యూ నిర్మాణం జరుగకపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది. ఇరిగేషన్ అధికారుల గణాంకాలు ప్రకారం 3.9 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు, మిగిలిన మొత్తంతో ఆధునీకరణ పనులు పూర్తిచేయాల్సి ఉందని స్పష్టంచేస్తున్నా..ఈ పనులు దక్కించుకున్న నాటికి ఉన్న ధరలకు మిగిలిన ఆధునీకరణ పనులు పూర్తిచేసేందుకు తాజాగా గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదని, అందువల్లే పనులు పునఃప్రారంభం కాలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆధునీకరణ పనులు పూర్తిచేయాల్సిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం అవేవీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా మిగిలిన పనులు పూర్తిచేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిడిఆర్ నిధులతో అరకొర పనులు
పదవీకాలం ముగిసిన 15 నీటి సంఘాల పరిధిలో సిడిఆర్ నిధులతో అరకొర పనులు చేపట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులున్నప్పటికీ ఆధునీకరణ పనులు పూర్తిచేయకుండా మొక్కుబడిగా 1.30 కోట్ల రూపాయల నిధులతో డ్రాప్‌లు, ఆయకట్టు చెరువుల్లో మదుముల మరమ్మతులు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.
గుత్తేదారు అకాల మరణం వల్లే!
ఆధునీకరణ పనులు దక్కించుకున్న గుత్తేదారు అకాల మరణం వల్లే పనులు ముందుకు సాగలేదని కింతలి ఇరిగేషన్ ఎ.ఇ బగ్గు సత్యనారాయణ స్పష్టంచేశారు. టెండర్లు ఖరారై మూడేళ్లు కావడంతో అదే ధరలకు పనులు నిర్వహించేందుకు కొత్తగా ఎవరూ ముందుకు రాకపోవడంతో పాటు సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా ఆధునీకరణ పనులు ముందుకు సాగేందుకు ఆటంకంగా నిలుస్తున్నాయన్నారు. ఈ ఏడాదికి పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని ఎ.ఇ స్పష్టంచేయడం విశేషం.

చక్కెర సరఫరా నిల్
నరసన్నపేట, మే 16: గత రెండునెలలుగా నిత్యవసర సరుకులదుకాణాల నుండి పంచదార ఇవ్వడం లేదంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేశారు. అమ్మహస్తం పేరిట పంచదార ప్రతీ ఒక్క లబ్ధిదారునికి అరకిలో చొప్పున సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటనలిచ్చినా మూడు నెలలుగా పంచదార సరఫరా లేదంటూ వాపోతున్నారు. మరోవైపు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర దుకాణాలకు పంచదార సరఫరా గత మూడు నెలల నుండి పూర్తిగా నిలిచిపోయిందని డీలర్లు తెలిపారు. అయితే మూడునెలలకు సంబంధించి మొత్తం కూడా చెల్లించామని, అయినా పంచదార కోటా రావడం లేదని వారు స్పష్టంచేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు పంచదార సరఫరా అవుతున్నా ఈ రెండు మండలాలకు ఎందుకు విస్మరిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పంచదార, మిగిలిన నిత్యవసర సరుకులు సకాలంలో అందేటట్లు చూడాలని కోరారు.

కూర్మనాథుని కల్యాణం
చూతము రారండి!
* నేటి నుండి ఉత్సవాలు ప్రారంభం
గార, మే 16: శ్రీకూర్మంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కూర్మనాథుని కళ్యాణోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నారు. వైశాఖ శుద్ధ సప్తమి మొదలు పౌర్ణమి వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభవౌతాయి. ఈ ఉత్సవాలలో ధ్వజారోహణం, నిత్యహోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ నెల 20న కొట్నం దంపు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. 21న కళ్యాణం, 22న కాళీపాకం, 23న పండిత సత్కారం, సదస్యం, 24న పూర్ణాహుతి కార్యక్రమాలతో ఈ కళ్యాణోత్సవం ముగుస్తుంది. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.

టిడిపి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
శ్రీకాకుళం, మే 16: రాష్ట్రం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యువత గుణపాఠం చెప్పగలరని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం ఇక్కడ ప్రజాసదన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 20-20 విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. టిడిపి హయాంలోనే యువతకు ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ కళాశాలల ఏర్పాటుతోపాటు నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి రాష్ట్రానికి మల్టీనేషనల్ కంపెనీలు, ఐటికంపెనీలను రప్పించిన ఘనతచంద్రబాబునాయుడుదేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకూ అధికమవుతుందని అధికారులు, మంత్రులు జైలుపాలవుతున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో అభివృద్ధిని తామే చేశామంటూ కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం భావ్యం కాదన్నారు. నేడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీకటియుగంలా తయారుచేసిందని, ఈరోజు వరకు దేశం పార్టీ నాయకుల్లో ఏ ఒక్కరికీ అవినీతి ఆరోపణలు లేని విషయాన్ని తెలియజేసారు. ప్రజాసేవ అంటే దేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, తొమ్మిదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబునాయుడేదనన్నారు. తాము విత్తనం వేసి సాగు చేసి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెబితే కోతకు వచ్చే దశలో పంట ప్రజలకు పనికిరాకుండా చేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ టిడిపి హయాంలో అభివృద్ధి జరుగలేదని పేర్కొంటున్న కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం హయాంలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉండి ఏం చేశారంటూ ప్రశ్నించారు. తాము అతితక్కువ బడ్జెట్‌తో రాష్ట్రాన్ని శాస్ర్తియంగా అభివృద్ధి చేస్తే నేడు లక్షల కోట్ల బడ్జెట్‌తో అవినీతి అభివృద్ధి అయిందని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉద్దాన ప్రాంతం ప్రజలకు దాహార్తిని తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత ఎర్రన్నాయుడిది కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, మహిళల కోసం మహిళాసంఘాలు, డ్వాక్రా గ్యాస్ ఇవన్నీ టిడిపి హయాంలో వచ్చిన పథకాలేనని స్పష్టంచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడమే తప్ప పూర్తిచేసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ఎస్.వి.రమణమాదిగ, రోణంకి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంస్కరణలు తీసుకువచ్చా..
ఎచ్చెర్ల, మే 16: ఇన్‌చార్జి ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన నాటికి అంబేద్కర్ వర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా ఉండడంతో ఎన్నోసంస్కరణలు తీసుకువచ్చానని విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వీసీ ఆర్.జి.్భగవత్‌కుమార్ పేర్కొన్నారు. 2011 నవంబర్ 16వ తేదీన ఇక్కడ వీసీగా అదనపు బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర పాటు సేవలందించారు. రెగ్యులర్ వీసీగా హనుమంతు లజపతిరాయ్‌ను ప్రభుత్వం నియమించడంతో ఆయనకు గురువారం వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయని, ఉన్నంతలో పాలనాపరమైన సంస్కరణలు అమలుచేశానన్న సంతృప్తి మిగిలిందన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. అర్హులకు పదోన్నతులు, టీచింగ్ అసోసియేట్స్ జీతాల పెంపు, వసతి గృహ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ కిందకు తీసుకురావడం సంతృప్తినిచ్చాయన్నారు. 21వ శతాబ్ధపు గురుకుల భవనాలు విషయంలో జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు మనస్తాపానికి గురిచేసిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ పి.చిరంజీవులు, టీచింగ్ అసోసియేట్స్ సుబ్రమణ్యం, కృష్ణమూర్తి, గోవిందరాజులు, పి.డి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ వీసీ సేవలు కొనియాడారు. అలాగే వీసీ భగవత్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
అకడమిక్ క్యాలెండర్ ఆమోదం
వీసీ అధ్యక్షతన ఉదయం జరిగిన ప్రిన్సిపాళ్ల సమావేశంలో డిగ్రీ అకడమిక్ క్యాలెండర్‌ను ఆమోదిస్తూ తీర్మానించారు. గురువారం వీసీ భగవత్‌కుమార్ తన ఛాంబర్‌లో ప్రిన్సిపాళ్లతో సమావేశాన్ని నిర్వహించారు. డిగ్రీ అకడమిక్ క్యాలెండర్‌పై సమీక్ష నిర్వహించారు. అలాగే నాణ్యమైన విద్య అందించేందుకు అధ్యాపకులకు నిర్వహించాల్సిన వివిధ ఓరియంటేషన్ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల, మహిళల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ బమ్మిడి పోలీసు, మైథిలిలు, టెక్కలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే డిగ్రీ మూల్యాంకన ధరను పెంచుతూ వీసీ ఆదేశాలు జారీ చేశారు. పేపర్‌కు ఎనిమిది రూపాయలు గతంలో మూల్యాంకనకు చెల్లించేవారని, దానిని ఇకనుంచి 12 రూపాయలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రిన్సిపాళ్లంతా హర్షం వ్యక్తంచేశారు.
పదోన్నతులపై విమర్శలు
ఏడాదిన్నర పాటు ఉపకులపతిగా సేవలందించిన భగవత్‌కుమార్ చివరి నిముషంలో ఇద్దరు సిబ్బందికి మాత్రమే పదోన్నతి కల్పించి అర్హులను విస్మరించారని వర్సిటీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన విశే్వశ్వరరావుకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి, టెక్నికల్ అసిస్టెంట్‌గా సేవలందించిన రామ్మోహన్‌కు ల్యాబ్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించడం పట్ల సిబ్బంది తప్పుబడుతున్నారు. అనేక మంది అర్హులుంటుండగా ఆ ఇద్దరికే చివరి నిముషంలో పదోన్నతులు కల్పించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలి
* బిజెపి డిమాండ్
పాతశ్రీకాకుళం, మే 16: రాష్ట్ర పురోగభివృద్ధిని భ్రష్ఠు పట్టిస్తూ అవినీతికి పాల్పడిన కళంకిత మంత్రులను బర్త్ఫ్ చేయాలని భారతీయ జనతాపార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. గురువారం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు ఆధ్వర్యంలో ఈ మేరకు పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నానాటికీ అవినీతి పెరిగిపోతున్న నేపధ్యంలో పదవులు కాపాడుకునే పనిలో అధికార కాంగ్రెస్ నాయకులున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూడి తిరుపతిరావు, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు ఎస్.ఉమామహేశ్వరిలు మాట్లాడుతూ పశువులను సంరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎండోమెంటు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు అట్టాడ రవిబాబ్జీ, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్.వెంకటసన్యాసిరావు, పేడాడ తులసీరావు, కిసాన్‌మోర్చా అధ్యక్షులు పండి యోగేశ్వరరావు, దళిత మోర్చా అధ్యక్షుడు గుడివాడ జయరాం, సంపతిరావు నాగేశ్వరరావు, ద్రోణాచార్యులు, ఎం.అప్పారావు, పైడి సత్యం తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ
శ్రీకాకుళం , మే 16: పాతశ్రీకాకుళంలో కొలువైయున్న పెద్దమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ గురువారం కన్నులపండువగా జరిగింది. బి.వి.ఎస్.దత్తాత్రేయశర్మ తదితర వేదపండితుల ఆధ్వర్యంలో గణపతిపూజ, యంత్రప్రతిష్ఠ, నీరాజనం, పసిడికలశ ప్రతిష్ఠ, బింబదర్శనం, గోపూజ, బలిహరణం, పూర్ణాహుతి, నీరాజనంలు జరిగాయి. అనంతరం తిరువీధిగా విచ్చేసిన అమ్మవారిని నూతనంగా నిర్మించిన ఆలయంలో గ్రామపెద్దలు ప్రతిష్టించారు. పేడాడ వంశీయులైన దుర్గారావు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డి.పి.దేవ్, ఎల్.నాగరాజు, కమిటీ గౌరవ సలహాదారు ఎల్.నందికేశ్వరరావు, కలగ శ్రీను, గెంజి తాతారావు, జె.చిన్నారావు, అదపాక రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వివాదస్పద భూముల్లో ఆక్రమణలు చెల్లనేరవు
తహశీల్దార్ జన్ని రామారావు
సారవకోట, మే 16: కోర్టు పరిధిలో వివాదంలో ఉన్న జిరాయితీ భూముల్లో ఇతరులు చేసిన ఆక్రమణలు చెల్లనేరవని తహశీల్దార్ జన్ని రామారావు స్పష్టంచేశారు. మండలంలో బొంతు జంక్షన్‌లో రోడ్డు, భవనాల శాఖకు చెందిన స్థలంలోను, కొంతమందికి చెందిన జిరాయితీ స్థలాలను 14 మంది ఆక్రమణలు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. జిరాయితీ స్థలానికి చెందిన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఎస్సై చిన్నంనాయుడుతో కలిసి తహశీల్దార్, రెవెన్యూ యంత్రాంగం ఈ స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల మేరకు కొలతలు వేసి హద్దులను గుర్తించారు. అనంతరం ఆక్రమణదారులతో అధికారులు చర్చలు జరిపి వాస్తవాలను తెలియజేశారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగిపోవాల్సిన అవసరం ఉందని వీరు సూచించారు. ఈ మేరకు ఆక్రమణదారులు తమ అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా అధికారులకు అందజేశారు.

వివాద పరిష్కార దిశగా సంయుక్త సర్వే
భామిని, మే 16: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమైన నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల తలెత్తె పరిణామాలపై సంయుక్త సర్వే గురువారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ట్రిబ్యునల్ అదేశాల మేరకు ఇరురాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణలతో సంయుక్త సర్వే ఈనెల 15న ప్రారంభించిన కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) అసిస్టెంట్ డైరెక్టరు శతపతి, డిఎన్ ప్రసాదుల పర్యవేక్షణలో భామిని మండలంలో కాట్రగడ బి నుండి బత్తిలివరకు నిర్వహించారు. నేరేడిబ్యారేజి నిర్మాణ స్థలంలో 1979లో ఏర్పాటు చేసిన బెంచ్ మార్కును సముద్ర మట్టంనుండి 64.35 అడుగుల ఎత్తును ధ్రువీకరించి ప్రారంభించిన సర్వే గురువారం నాటికి మూడు కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో రేఖాంశాలు, అక్షాంశాలను నిర్దారించారు. నేరేడిబ్యారేజ్‌కు ఎగువ 15 కిలోమీటర్లు, దిగువ 10 కిలోమీటర్ల పరిధిలో సంయుక్త సర్వేనిర్వహిస్తున్నారు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక బెంచ్ మార్కు ఏర్పాటుచేసి క్రాస్ సెసన్ నిర్వహిస్తున్నారు. అలాగే 1984లో జరిగిన సర్వేలో గుర్తించిన వివరాలు ఇప్పటికీ అధ్యయన విషయాలతో పూణెలోని కేంద్ర జలసంఘం రీసెర్చ్ కేంద్రంలో మోడల్ సర్వే నిర్వహించి అందులో తేలిన అంశాలను ట్రిబ్యునల్‌కు నివేదిస్తామని సంయుక్త బృందం సభ్యులు తెలిపారు. జిపిఎస్ విధానంలో నది గమనం, నీటి ప్రవాహం, పేరుకు పోయిన ఇసుకమేటలు, వరద తీవ్రతను అంచనావేస్తామన్నారు. అయితే ఇటీవల ట్రిబ్యునల్ కమిటీ పర్యటన సందర్భంగా ఒడిశా అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలు ఈ సంయుక్త సర్వే నివృత్తి చేస్తుందని ఆంధ్ర ప్రజానీకం భావిస్తుంది. ఈ కార్యక్రమంలో వంశధార ఇఇ రాంబాబు, డిఇలు కుమార్, ఎ.నాగేశ్వరరావు, ఎ.అర్.ఎస్ వర్మ, ఒడిశ్శా తరుపున నీటిపారుదలశాఖ ఇఇ చంద్రదాస్, డిఇఇలు సురేష్‌కుమార్ బిశ్రాయ్, బిజయ్‌కుమార్ పాడీ, డిసి వెంకటేష్‌లతో మొత్తం 18 మంది ఇరురాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
ఆనపకాయలగూడలో గజరాజులు
* జీడి,మామిడి,అరటి తోలు ధ్వంసం
సీతంపేట,మే 16:మండలంలోని పులిపుట్టి పంచాయతీ పరిధిలో ఉన్న ఆనపకాయలగూడలో గజరాజులు సంచరిస్తున్నాయి.బుధవారం సాయంత్రం గుమ్మడ జీడితోటల్లో తిరుగాడిన ఏనుగులు అర్ధరాత్రి సమయంలో పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారి మీదుగా ఇప్పగూడ, ఆనపకాయలగూడ వైపు పయనించాయి.అయితే గుమ్మడ గ్రామానికి చెందిన ఎన్ రామారావు అనే రైతు మామిడితోటను నాశనం చేసాయి.అలాగే బూర్జగూడ,ఆనపకాయలగూడ గ్రామానికి చెందిన పి రామారావు,వెంకట్రావులకు చెందిన అరటి,మామిడి చెట్లను విరిచి ధ్వంసం చేసినట్లు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసారు.గురువారం అంతా ఆనపకాయలగూడ సమీపంలోనే సంచరించిన గజరాజులు సాయంత్రం అయ్యేసరికి సమీపంలో ఉన్న కొండ ప్రాంతం వైపు వెళ్లినట్లు గిరిజనులు తెలిపారు.ఏనుగుల వలన తమకు కంటి మీద కునుకులేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.
పంటలతో పాటు తమకు ఎక్కడ హాని తలపెడతాయోననే భయంతో జీవిస్తున్నామని అన్నారు. ఈ ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

భారీగా ఎస్సైల బదిలీలు
శ్రీకాకుళం , మే 16: జిల్లాలో 39 మంది పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డిఐజి స్వాతి లక్రా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంతటి భారీ స్థాయిలో ఎస్‌ఐలకు బదిలీ కావడం జిల్లాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐగా పనిచేస్తున్న కాసా భాస్కరరావును పట్టణ వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. అలాగే ఎల్.చంద్రశేఖర్‌ను సంతకవిటి నుండి మందసకు, కె.గోవిందరావును మందస నుండి కంచిలి, ఎ.నాగేశ్వరరావును సంతకవిటి పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఐగా నియమించారు. సారవకోటలో పనిచేస్తున్న ఇ.చిన్నంనాయుడు ఇచ్చాపురం స్టేషన్‌కు బదిలీ చేస్తూ సారవకోటకు కొత్తగా బి.శ్రీరామమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎచ్చెర్లలో పనిచేస్తున్న ఎల్.సన్యాసినాయుడును జె. ఆర్.పురంనకు, ఆమదాలవలస ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ ఎచ్చెర్లకు, బి.మంగరాజు నందిగాం నుండి ఆమదాలవలసకు, రేగిడి ఆమదాలవలస నుండి నందిగాంనకు ఎస్.లక్ష్మణరావు, బూర్జ ఎస్ ఎం.చంద్రవౌళి రేగిడి ఆమదాలవలసకు నియమితులైనారు. లావేరు ఎస్‌ఐ ఎం.శ్రీను హిరమండలంనకు, ఐ.రామారావు శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి లావేరుకు, ఎస్.సత్యన్నారాయణను కొత్తూరు నుండి సరుబుజ్జిలి, ఎన్.కామేశ్వరావు వీరఘట్టాం నుండి కొత్తూరు, ఆర్.వేణుగోపాలరావు సోంపేట నుండి కాశీబుగ్గ స్టేషనకు బదిలీ అయ్యారు.
వేకెన్సీ రిజర్వులో ఉన్న జి.శ్రీనివాసరావు సోంపేటకు, బారువలో పనిచేస్తున్న కె.వెంకటేశ్వరావు కోటబొమ్మాళి, శ్రీకాకుళం ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిహెచ్.గోవిందరావును బారువకు, ఇచ్చాపురం రూరల్‌లో పనిచేస్తున్న డి.రాము ఇచ్చాపురం టౌన్‌కు బదిలీచేశారు. వీరఘట్టాం పోలీస్ స్టేషన్‌కు ఎం.రత్నరావు, దోనుబాయి నుండి మెళియాపుట్టికి వెంకటకుమార్, మెళియాపుట్టి నుండి పాతపట్నంనకు వి.నాగరాజు, పాతపట్నం నుండి ఆర్.రవిప్రసాద్ డిఎస్‌బి శ్రీకాకుళంనకు బదిలీ చేశారు. వజ్రపుకొత్తూరు, బూర్జ స్టేషన్లకు కె.శాంతారాం, బి.కృష్ణమూర్తిలను నియమించారు. వజ్రపుకొత్తూరులో పనిచేస్తున్న కె.శాంతారాంను దోనుబాయి, జలుమూరులో పనిచేస్తున్న జి.శంకరరావును టెక్కలి, జి.సిగడాంలో పనిచేస్తున్న జి.ప్రభాకరరావు రాజాం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వేకెన్సీ రిజర్వులో ఉన్న జి.వి.రమణను జలుమూరు ఎస్‌ఐగా నియమించారు. జి.సిగడాం, శ్రీకాకుళం ట్రాఫిక్, డిసిఆర్‌బి శ్రీకాకుళం, శ్రీకాకుళం ట్రాఫిక్ రెండో ఎస్‌ఐ, శ్రీకాకుళం టూ టౌన్‌కు ఇద్దరు ఎస్‌ఐలను కొత్తవారిని నియమించారు. వేకెన్సీ రిజర్వులో నూతనంగా ఎంపికైన పి.నాగేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, ఎస్.చలపతిలను ఉంచారు.

నేడు వీసీ లజపతిరాయ్ బాధ్యతల స్వీకరణ
ఎచ్చెర్ల, మే 16: జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. లెక్చరర్ నుంచి వీసీ వరకు లజపతిరాయ్ అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి జిల్లా జడ్జిగా పనిచేయడం వల్ల ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియేట్ వరకు శ్రీకాకుళంలోనే విద్యను సాగించారు. డిగ్రీని గుంటూరులో హిందూ డిగ్రీ కళాశాలలో పూర్తిచేశారు. 1977-79లో నాగార్జున యూనివర్శిటీలో ఎం.కాం పూర్తి చేసిన ఆయన అదే వర్శిటీలో పి.హెచ్.డి చేశారు. 1980లో గుంటూరు పిజి సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్‌లో 1983-84లో లెక్చరర్‌గా విధులు నిర్వర్తించారు. 1985, డిసెంబర్‌లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో రీడర్‌గా చేరి 1993లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 1990-93 మధ్య కామర్స్ విభాగాధిపతిగా పనిచేశారు. 80 పరిశోధనాపత్రాలను ప్రచురించారు. ఈయన పర్యవేక్షణలో 11 మంది పిహెచ్‌డి చేశారు. హైదరాబాద్‌లోని బిసి స్టడీసర్కిల్‌కు ఏడేళ్లపాటు కన్వీనర్‌గా, డైరెక్టర్‌గా వ్యవహించారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో రెండున్నర ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1996లో యుజిసి స్కీమ్‌లో భాగంగా విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఈజిప్టులోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తమ బోధన చేసేందుకు 2010లో బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. అప్పటి సిఎం వైఎస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ఆరుగాలం కష్టపడే అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడటంతో
english title: 
skl

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>