Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇక జోరుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!

$
0
0

ఒంగోలు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం గృహాల నిర్మాణానికి అంచనాలను పెంచటంతో నూతనంగా గృహాలను నిర్మించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుండి ఇంతవరకు జిల్లాలో 28వేల గృహాలను నిర్మించలేదు. కాగా జిల్లాలో 18వేల గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు గృహనిర్మాణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ గృహానికి గ్రామీణ ప్రాంతాల్లో 45వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 55వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలకు అంచనాలను పెంచింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఒసి, బిసిలకు 75వేల రూపాయలు, ఎస్‌సిలకు లక్ష రూపాయలు, ఎస్‌టిలకు లక్షా ఐదువేల రూపాయలను మంజూరు చేయనున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఒసి, బిసిలకు 80వేల రూపాయలు, ఎస్‌సిలకు లక్ష రూపాయలు, ఎస్‌టిలకు లక్షా ఐదువేల రూపాయలను మంజూరు చేయనున్నారు. దీంతో జిల్లాలో గృహనిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గతంలో నిర్మిస్తున్న వాటికి బేస్‌మెంట్ వేసిన లబ్ధిదారులకు ఎంత నగదు ఇవ్వాలి, రూఫ్‌లెవెల్ ఉంటే ఎంత, శ్లాబువేసి ఉంటే ఎంత నగదు మంజూరు చేయాలనే విషయంపై స్పష్టత రానున్నట్లు గృహనిర్మాణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈనెల 21వ తేదీన రాజధానిలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈసమావేశానికి జిల్లాలోని ఎంపిలు, శాసనసభ్యులు, జిల్లాకలెక్టర్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈసమావేశంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణ స్ధితిగతులపై పూర్తిస్ధాయిలో మంత్రి చర్చించే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులకు రెండు నెలల నుండి బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తుండటంతో ముందుగానే బిల్లులను నిలిపివేసినట్లు సమాచారం. మొత్తంమీద జిల్లాలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం శరవేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

మూడు సొసైటీలకు 21న ఎన్నికలు
ఒంగోలు, మే 16: జిల్లాలోని మూడు సహకార సంఘాలకు ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని సంతమాగులూరు, వల్లాపల్లి, సజ్జాపురం సొసైటీలకు సంబంధించి గతంలోనే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం, పోటీలో ఉన్న అభ్యర్థుల ఉపసంహరణ శనివారం ఉంటుందన్నారు. అనంతరం 21వ తేదీన ఎన్నికలు జరుగుతాయని జిల్లా కో ఆపరేటివ్ అధికారి కొండయ్య ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ఈనెల 28వ తేదీన డిసిసిబి పాలకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు సొసైటీల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీల నేతలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కాగా బ్యాంకు పాలకవర్గానికి గ్రీన్‌సిగ్నల్ రావటంతో చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం.

పామూరులో గాలివాన బీభత్సం
పామూరు, మే 16: పామూరు పట్టణంలో గురువారం అరగంటసేపు గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పామూరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పట్టణంలోని అనేకచోట్ల చెట్లు విరిగిపడి బంకులపై రేకులు లేచిపోయాయి. మండలంలోని బత్తాయి, నిమ్మ రైతులకు గాలుల దాటికి తీవ్రంగా నష్టపోయారు. లక్ష్మీనరసాపురం- మోపాడు మధ్యలో పది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
తృటిలో తప్పిన ప్రమాదం
గురువారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో వీచిన పెనుగాలుల కారణంగా స్థానిక మమ్మిడాడి సెంటర్ ఎదురుగా ఉన్న చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. అప్పుడే నెల్లూరు నుంచి పామూరుకు వచ్చిన బస్సు ప్రయాణికులను దించుతున్న సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు బస్సుపై పడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారలు చేస్తూ భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ చెట్టు విరిగిపడిన మరుక్షణమే పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో అనేక మంది ప్రాణాలు నిలబడ్డాయి. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా చేపల మార్కెట్ పక్కన ఉన్న భారీ చెట్లు నేలకొరిగాయి.

సమన్వయ కమిటీలో సమన్వయలోపం
* సభ్యత్వ నమోదులో ఎవరికివారే యమునాతీరే
* వైఎస్‌ఆర్‌సిపి నేతల తీరుపై కార్యకర్తల ఆందోళన
మార్కాపురం, మే 16: నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలను సమన్వయపరచి పార్టీని ముందుకు నడిపించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలోనే సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మార్కాపురం నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా మాజీఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, విద్యాసంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డిలను అధిష్ఠానం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఏకమై కార్యకర్తలను కలుపుకొని పోవడంలో విఫలం కావడంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగుజారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిని సమన్వయ కమిటీ సభ్యులుగా నియమింపక ముందే మాజీఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ఒక వర్గంగా, జంకె వెంకటరెడ్డి ఒక వర్గంగా వ్యవహరిస్తుండేవారు. ఎవరైనా వైఎస్‌ఆర్‌సిపి అధినాయకులు మార్కాపురం వచ్చిన సమయంలో ఒకవర్గం హాజరైతే, మరోవర్గం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఆనవాయితీ. ఈ పరిస్థితుల్లో ఈ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినప్పుడే నియోజకవర్గ కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా ముగ్గురు కలిసి సమష్టిగా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. ఎవరికివారే యమున తీరులా మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం ప్రాంతంలో, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పొదిలి ప్రాంతంలో, వెన్నా హనుమారెడ్డి తర్లుపాడు మండలంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ముగ్గురు సమష్టిగా కాకుండా ఎవరికివారు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడంతో కార్యకర్తల పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఐక్యమత్యం లోపించి నియోజకవర్గకేంద్రమైన మార్కాపురం సహకార సంఘానికి అభ్యర్థిని రంగంలో దింపలేకపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం సమన్వయ కమిటీ నియామకం సమయంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని సభ్యులుగా నియమించడంలో తప్పటడుగు వేసిందనే భావనతో కొందరు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం దృష్టి సారించి కమిటీని సమన్వయం చేయకపోతే పార్టీ బలోపేతం కావడం కష్టమని కార్యకర్తలు బహిరంగంగా ముక్తకంఠంతో అంటున్నారు.

పరిస్థితుల్ని చక్కదిద్దుతాం
పొగాకు బోర్డు ఆర్‌ఎం అన్సారి అహ్మద్ హామీ
పొదిలి, మే 16: పొదిలి పొగాకు వేలం కేంద్రాల్లో తలెత్తిన సమస్యల్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ అన్సారి అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన పొదిలి పొగాకు బోర్డును సందర్శించి రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. ఈసందర్భంగా ఆయన దృష్టికి వ్యాపారులు, రైతులు పలు సమస్యలను తీసుకొచ్చారు. పొదిలి వేలం కేంద్రాల్లో వ్యాపారులు అతి తక్కువ ధరకు పొగాకును కొనుగోలు చేస్తున్నారని, ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో అదే నాణ్యత గల పొగాకుకు కిలో 15 రూపాయల వరకు వ్యత్యాసం ఉందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై అలాంటివి జరుగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్, ఈడి, ఉన్నతాధికారులు కూడా పొగాకు కంపెనీల యాజమాన్యాలతో ధరల విషయంపై మాట్లాడుతున్నారని ఆర్‌ఎం రైతులకు నచ్చజెప్పారు. అందువల్ల వేలం కేంద్రాలను ప్రారంభించాలని కోరగా రైతులు కొంతసేపు మొండికేశారు. చైర్మన్ పొదిలి వస్తేనే తప్ప తాము పొగాకు కొనుగోళ్లు సాగనివ్వమని రైతులు తెలిపారు. పరిస్థితిని గమనించిన పొగాకు బోర్డు సభ్యులు భద్రిరెడ్డి కూడా ఆర్‌ఎంతో కలిసి రైతులకు నచ్చజెప్పడంతో వారు వేలం నిర్వహించేందుకు అంగీకరించారు. వెంటనే ఆర్‌ఎం స్థానిక రెండో వేలం కేంద్రాన్ని ప్రారంభించి దగ్గరుండి ధరలను పరిశీలించారు. దీంతో వ్యాపారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

సంతనూతలపాడు వైఎస్‌ఆర్‌సిపిలో
నేతల మధ్య పోరు
నేనే ఇన్‌చార్జి:దారా సాంబయ్య
సమన్వయకర్తగా పనిచేస్తున్నా:అమృతపాణి
ఒంగోలు, మే 16: నేతల అంతర్గత కుమ్ములాటలతో సతమతవౌతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తసమస్య తెరపైకి వచ్చింది. సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త నియామకం ఇంతవరకు జరగలేదని అంతవరకు తానే ఇన్‌చార్జినని మాజీ శాసనసభ్యుడు దారా సాంబయ్య ప్రకటించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాను రెండుసార్లు జైలులో కలిసినప్పుడు తనను నియోజకవర్గ బాధ్యతలను నిర్వహించమన్నారని ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. గతంలో హైదరాబాదులో జరిగిన సమన్వయకర్తల నియామక సమావేశంలో తన కూతురు దారా పద్మజ, డాక్టర్ అమృతపాణికి సమన్వయకర్తల నియామకపత్రాలను పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అందజేశారన్నారు. తన కూతురు పక్షాన సమన్వయకర్తగా పత్రాన్ని తాను తీసుకున్నానన్నారు. అనంతరం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తాను వైఎస్‌ఆర్‌సిపి ఏర్పాటుచేసిన నాటి నుండి పార్టీలో పనిచేస్తున్నానని పార్టీ నాయకత్వానికి వివరించినట్లు తెలిపారు. వైఎస్ జగన్ సంతనూతలపాడు నియోజకవర్గ బాధ్యతలను తనను చూడమన్నారని, తన కుమార్తె అమెరికాలో ఉంటున్నందున ఇక్కడికి రాలేదన్నారు. పార్టీలో ప్రమేయం లేని ఆరోజే ఆదరాబాదరగా సభ్యత్వం తీసుకుని సమన్వయకర్తల మీటింగ్‌కు వచ్చిన అమృతపాణి నియామకాన్ని రద్దుచేయమని తనను మాత్రమే సమన్వయకర్తగా ఉంచాలని పార్టీ నాయకత్వానికి విన్నవించానని ఆయన తెలిపారు. దీంతో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తల నియామకాన్ని నాయకత్వం పెండింగ్‌లో ఉంచిందని ఆయన వివరించారు. సంతనూతలపాడు సమన్వయకర్త నియామకం పెండింగ్‌లో ఉండటంవలన ఇప్పటివరకు ఎవరూ సమన్వయకర్త కాదని ఆయన పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనకు జైల్లో చెప్పినట్లుగానే తాను సంతనూతలపాడు నియోజకవర్గానికి సమన్వయకర్తను తానేనని ఆయన వివరించారు. ఈవిషయం ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు కూడా తెలుసనని ఆయన గుర్తుచేశారు. పార్టీ అధిష్ఠానం ఇంతవరకు సమన్వయకర్తను నియమించనప్పటికి కొంతమంది హంగు ఆర్భాటాలతో, రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులమని ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో అస్పష్టత సృష్టించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి స్వార్ధ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా నియోజకవర్గంలో సమన్వయకర్తగా తాను పనిచేసుకుంటు పోతున్నానని అమృతపాణి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. వైఎస్ విజయమ్మ చేతులమీదుగా తాను నియమాకపత్రాన్ని అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య అసెంబ్లీ సీటు విషయంపై కోల్డ్‌వార్ జరుగుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో నేతల మధ్య సఖ్యత లేకపోతే ఆప్రభావం ఎన్నికలపై పడే అవకాశాలున్నాయని పార్టీనేతలు పేర్కొంటున్నారు.

వేట లేదు.. భుక్తి లేదు
అందని ప్రభుత్వ సాయం
దయనీయంగా మత్స్యకారుల జీవనం
చీరాల, మే 16: జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. కడలిని నమ్ముకున్న వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. దీనికి కారణం గత 30 రోజులుగా వేట లేకపోవటంతో పూటగడవటం కష్టంగా మారింది. ప్రతి సంవత్సరం మత్స్యసంపద పునరుత్పత్తికోసం ప్రభుత్వం 60 రోజులపాటు వేట నిషేధాన్ని విధిస్తోంది. ప్రస్తుతం ఈ సమయాన్ని 45 రోజులకు కుదించింది ప్రభుత్వం. ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి ఏడాది కుటుంబానికి 31 కిలోల బియ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1200 రూపాయలు అందజేస్తుంటారు. వేట నిషేధించి నెల రోజులు కావస్తున్నా ఈ సమయంలో వారికి భృతి కల్పించాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వారికోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కూడా పడకేశాయి. పునరావాస, పొదుపు పథకం అంతంతమాత్రంగానే మారాయి. ఈ సమయంలో ఉపాధి పనులు కల్పించాలని వారు చేసుకున్న వినతులను సైతం అధికారులు పట్టించుకోవటంలేదు. కొన్ని మత్స్యకార గ్రామాలలో ఒక్క జాబ్‌కార్డును కూడా ఇవ్వలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క, ప్రభుత్వం నుంచి సాయం అందక గంగపుత్రులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సంకటంగా మారింది. గత నెల 15 నుంచి వేట నిషేధం అమలులో ఉండటంతో పూటగడవటం కూడా కష్టంగా మారిందంటున్నారు మత్స్యకారులు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారంలో కూడా జాప్యం జరుగుతోంది. యేటా ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే 31 కిలోల బియ్యం నేటికీ పంపిణీ జరగలేదు. జిల్లాలో మొత్తం 102 కిలోమీటర్ల సముద్రతీరంలో 72 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో నివసించేవారిలో ఎక్కువమంది చేపలు వేటే జీవనాధారం. కాని కొంతకాలంగా జాలర్ల పరిస్థితి ఒడ్డునపడ్డ చేపలా తయారైంది. మత్స్యకారులకు పరిహారం అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క, ప్రభుత్వం నుంచి సాయం అందక గంగపుత్రులు గగ్గోలు పెడుతున్నారు. వేట నిషేధ సమయంలో తమిళనాడు రాష్ట్ర తరహాలో ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజిని అమలు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. వేటనిషేధ సమయంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేస్తోందని అదికూడా సరిపోవటంలేదని దానిని రెట్టింపు చేయాలని అక్కడి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు మత్స్యకారులు తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అందులో సగం సహాయం కూడా అందటంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేట నిషేధ సమయాల్లో తమిళనాడు రాష్ట్ర తరహాలో ప్రత్యేక ప్యాకేజిని అమలు చేయటంతోపాటు ఉపాధి హామీ పనులు కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

సినిమా థియేటర్లను సక్రమంగా నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, మే 16: జిల్లాలోని సినిమా థియేటర్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులతో గురువారం స్థానిక సిపివో కాన్ఫరెన్స్ హాలులో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ మాట్లాడుతూ సినిమా థియేటర్లకు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వస్తారని, థియేటర్లలో ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి థియేటర్‌ను తప్పనిసరిగ్గా రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. దీంతో థియేటర్ల యజమానులు కలుగజేసుకొని మాట్లాడుతూ తాము చాలా వరకు థియేటర్లను రెన్యువల్ చేసుకున్నామని తెలిపారు. ఇంకా 7,8 థియేటర్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉందని, ఇప్పటికే ఒరిజనల్ బి ఫారాలను ఆర్డీవో కార్యాలయంలో ఇచ్చామని తెలిపారు. అయితే ఆ బి-్ఫరాల కాపీ కనిపించడం లేదని చెబుతూ రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని, తమ వద్ద జిరాక్స్ కాపీలు ఉన్నందున వాటిమీద రెన్యువల్ చేయాలని జెసిని థియేటర్ల యజమానులు కోరారు. దీనిపై స్పందించిన జెసి త్వరలో ఆర్టీవోతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సినిమా థియేటర్లలో ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు కూల్‌డ్రింక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఎంఆర్‌పికే వాటిని అమ్మాలని ఆదేశించారు. అధిక రేట్లకు విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్త్ ఇన్‌స్పెక్టర్లు థియేటర్లలోని ఆహారపదార్థాలు తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా అగ్నిమాపక అధికారులు థియేటర్లలో ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా పౌరసంబంధాల శాఖ ముద్రించిన ప్రభుత్వానికి చెందిన 7 సంక్షేమ పథకాలకు చెందిన వాల్‌పోస్టర్‌ను సమావేశంలో జెసి ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి థియేటర్‌లో సినిమాకు ముందు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కలిగే విధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌వో డి పూర్ణచంద్రరావు, డి హరనాధ్‌బాబు, మున్సిపల్ అధికారులు, తూనికలు కొలతల అధికారులు, థియేటర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో
english title: 
houses

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>