Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి’

$
0
0

విజయనగరం , మే 16: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా యువజన, విద్యార్థి విభాగాలు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో తోటపాలెంలో ఏర్పాటైన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి విభాగాల సభ్యులను పార్టీ కండువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు బొత్స నాయకత్వం పట్ల, పార్టీ పట్ల యువత ఆకర్షితులై పార్టీలోకి యువత వస్తున్నారన్నారు. యువజన విభాగాల ఏర్పాటు వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌రాజు, మాజీ కౌన్సిలర్ కరణం గంగాధరరావు, 14వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, కార్యదర్శి సుంకర శంకరరావు, ఎన్‌ఎస్‌యుఐ విభాగం అధ్యక్షుడు కె.మహేష్, కార్యదర్శి కంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చల్లబడిన వాతావరణం.. అరటి పంట ధ్వంసం
పార్వతీపురం, మే 16: పట్టణంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. గ్రీష్మతాపంతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కొంత ఊరట కలిగింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొద్దిపాటి వర్షం కురడంతో వాతావరణం చల్లబడినప్పటికీ ఈదురు గాలులు కారణంగా
పార్వతీపురం, కొమరాడ తదితర ప్రాంతాల్లోని అరటి పంటలు ధ్వంసమయ్యాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన అరటి పంట ధ్వంసం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటనష్టాలు అంచనావేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

‘బొబ్బిరి రైల్వే స్టేషన్‌లో మరిన్ని సౌకర్యాలు’

బొబ్బిలి, మే 16: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైల్వే డి.సి.ఎం. రమణారావు ఆదేశాలు జారీచేశారు. రైల్వేస్టేషన్ పనితీరును గురువారం పరిశీలించారు. ప్లాట్‌ఫారం, రైల్వేస్టేషన్, ప్రయాణికుల గదిని పరిశీలించారు. ఈ మేరకు పలు రకాలైన సూచనలు, సలహాలు అందించారు. స్టేషన్‌లో పారిశుద్ధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. స్టేషన్ బోర్డులు మరమ్మతులకు గురయ్యాయని, వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టిక్కెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులను ఇబ్బందులు పెట్టకుండా టిక్కెట్‌తోపాటు మిగిలిన చిల్లర అందించాలన్నారు. కౌంటర్ వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలన్నారు. రైల్వే ట్రాక్‌లపై పనికిరాని వ్యర్థపదార్ధాలు, కాగితాలు వేయరాదన్నారు. రైల్వే సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే మాస్టర్ కమలేష్‌కుమార్ ద్వారా స్టేషన్‌లో ఉన్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రయాణీకులకు సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఈయనతోపాటు చీఫ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, రైల్వే బోర్డు సభ్యులు నంబియార్ వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

‘రూప్‌కార్డు అమలుకు డిసిసిబి సన్నాహాలు’
బొబ్బిలి, మే 16: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉన్న అన్ని బ్రాంచిలలోను రైతుల సౌకర్యం కోసం రూప్‌కార్డు(ఎ.టి.ఎం.) విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నామని డి.సి.సి.బి. సి.ఇ.ఒ డి.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. స్థానిక వెలమ సంక్షేమ సంఘం కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16 బ్రాంచ్‌లున్నాయని, 94 పిఎ.సి.ఎస్.లున్నాయన్నారు. ఈ బ్రాంచిలలో రైతులు, ఖాతాదారుల సౌకర్యార్థం ఏ.టి. ఎం. సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతులు, ఖాతాదారులు నేరుగా డబ్బులు స్క్రాచ్ చేసి డబ్బులు తీసుకోవచ్చునన్నారు. దీని ద్వారా ఎటువంటి అవకతవకలు చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. గత ఏడాది డి.సి.సి.బి. ద్వారా రబీ సీజన్‌కు 135కోట్ల రూపాయలు రైతులకు అందించామన్నారు. వీటిని జూన్‌లోగా చెల్లించిన పక్షంలో జీరోశాతం వడ్డీ వర్తిస్తుందన్నారు. 68వేల మంది రైతులకు రుణాలు అందించామన్నారు. ఈ మొత్తంలో 12కోట్ల రూపాయలు 13వేలమంది కొత్తరైతులకు అందించామన్నారు. గత ఖరీఫ్‌లో 30కోట్ల రూపాయలు రుణాలు అందించామన్నారు. ఈ ఏడాది డి.సి.సి.బి. ద్వారా 140కోట్ల రూపాయలు రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. డి.సి.సి.బి.కి జాతీయస్థాయి గుర్తింపుకోసం ప్రతిపాదించామన్నారు. దీని ద్వారా జాతీయస్థాయిలో ఎక్కడైన బ్యాంకు లావాదేవీలు కొనసాగించవచ్చునన్నారు. 70వేలమంది డిపాజిట్‌దారులున్నట్లు తెలిపారు. 44కోట్ల 64లక్షలు డిపాజిట్లు ఉన్నాయన్నారు. అలాగే 17కోట్ల రూపాయలు 6వేలమంది లబ్ధిదారులకు బంగారంపై రుణాలు అందించామన్నారు. బ్యాంకుల్లో ఎన్.వై.సి. సిస్టం అమలు చేస్తామన్నారు. దీని ద్వారా ఖాతాదారులకు సంబంధించిన ఐ.డి. కార్డులు, ఆదార్‌కార్డులు, తదితరవి బ్యాంకుకు అందించాలని కోరారు. లేనిపక్షంలో వారి ఖాతాలను నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి. డి.జి. ఎం. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటి యజమానురాలే దొంగ..
విజయనగరం , మే 16: ఇంటిని రక్షించుకోవాల్సిన ఆ ఇల్లాలు భర్తపై కక్షగట్టి, ఓ వ్యక్తి సహాయంతో తన ఇంటికే కన్నం వేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని, అనుకున్న పథకం ప్రకారం తన పనికానిచ్చేసింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సహాయంతో దొంగలించిన చోరీ సొత్తును అమ్ముతుండగా పోలీసులకు పట్టుబడ్డంతో ఆ ఇల్లాలితోపాటు ఆమెకు సహకరించిన నిందితుడు సైతం జైలు పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కార్తికేయ గురువారం తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలో అలకనందా కాలనీకి చెందిన ఇమంది కళ్యాణ చక్రవర్తి, భార్య కళ్యాణిల మధ్య గొడవలున్న నేపధ్యంలో కళ్యాణి తన ఇంట్లో దొంగతనం చేసేందుకు సిర్ణయించుకుంది. ఈ మేరకు పట్టణంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన పాత నేరస్థుడు ఇసుకుపల్లి శ్రీను అలియాస్ చంటి అలియాస్ కలకత్తా శ్రీను తన ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. ఇందుకోసం శ్రీనుకి 40 వేల రూపాయలు ఇచ్చేందుకు ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈ నెల 1న కళ్యాణి భర్త చక్రవర్తి ఇంట్లో లేని సమయం చూసి నిద్రమాత్రలు తేవాల్సిందిగా శ్రీనుకి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో శ్రీను ఒకమెడికల్ షాపు నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేసి కళ్యాణికి అందజేశాడు. దీంతో కళ్యాణి తన భర్త చక్రవర్తి ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో ఉన్న తన అత్తమామలకు తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది. దీంతో అత్తమామలు గాఢ నిద్రలో ఉండటంతో పథకం ప్రకారం శ్రీనుని ఇంట్లోక రప్పించి, అత్త వద్ద ఉన్న బంగారు నగలను కళ్యాణి స్వయంగా తీసి రెండు బంగారు గాజులను తన వద్ద ఉంచుకొని మిగిలిన ఆభరణాలను అమ్మేందుకు శ్రీనుకి అప్పగించింది. దొంగలించిన ఆ నగలను శ్రీను అమ్మేందుకు అవకాశం కుదరలేదని కళ్యాణికి సమాచారం ఇవ్వడంతో వీరిద్దరూ కలిసి దొంగలించిన ఆ నగలను ఈ నెల 15న పట్టణంలో మంగళవీధి నూకాలమ్మ ఆలయం సమీపంలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో చోరీ సొత్తుతోపాటు ఒక హత్యాయత్నాన్ని నివారించగలిగారు. కళ్యాణి మామ తన ఇంట్లో 14 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు దొంగతనం జరిగిన మరుసటిరోజు ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. అనతికాలంలోనే కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న సిసిఎస్ సిఐతోపాటు సిసిఎస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

‘ఇందిరమ్మ పచ్చతోరణం ద్వారా 5వేల మందికి ఉపాధి’
విజయనగరం , మే 16: జిల్లాలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం ద్వారా అయిదువేల మందికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అన్వయిస్తూ ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9,400 చెరువులు ఉన్నాయన్నారు. చెరువుల హద్దులను గుర్తించి మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో పది మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు
ఉన్నాయని, ట్యాంకు బండ్ పాడవుకుండా ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించారు. గ్రామీణ రహదార్లల్లో మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భాగంగా ఒక్కొక్క లబ్థిదారుని కుటుంబానికి 200 మొక్కలను సరఫరా చేయాలన్నారు. జిల్లాలో సుమారు నాలుగువేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్డు మార్జిన్లలో మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించి రెండువేల మందికి లబ్థి చేకూర్చాలన్నారు. అదేవిధంగా చెరువుగట్లను గుర్తించి వేయి మందికి, నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాంతాల్లో వేయిమందికి, ఖాళీస్థలాలను గుర్తించి మరో వేయి మందికి లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. స్థలాలను, లబ్థిదారులను గుర్తించే బాధ్యత గ్రామస్థాయి కమిటీలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖలు రెండువేల మంది లబ్ధిదారులను, నీటిపారుదల శాఖ రెండువేల మంది లబ్ధిదారులను, తహాశీల్దార్లు వేయి మందికి లబ్ధిదారులను ఎంపిక చేసి పచ్చతోరణం పథకం విజయవంతమయ్యేందుకు బాధ్యత వహించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ, అదనపుజాయింట్‌కలెక్టర్ యుజిసి నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఒ ఎన్.మోహన్‌రావు,ఐటిడిఎ ప్రాజెక్టు అంబేద్కర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతి, డ్వామా ప్రాజెక్టుడైరెక్టర్ శ్రీరాములనాయుడు, ఐసిడిఎస్ ప్రాజెక్టుడైరెక్టర్ రాబర్ట్స్, పార్వతీపురం ఆర్డీఒ వెంకటరావుతదితరులు పాల్గొన్నారు.
వేసవిలోనూ జలకళతో తాటిపూడి
గంట్యాడ, మే 16 : మండు వేసవిలో కూడా తాటిపూడి జలాశయం నీటి మట్టం నిలకడగానే ఉంది. గురువారం నాటికి 291 అడుగుల నీటి మట్టం ఉంది. గత ఏడాది ఇదే తేదీ నాటికి 282 అడుగులు నీరు ఉండేది. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 297 అడుగులు, ఈ ఏడాది మే మూడవ వారానికి కూడా తాటిపూడినీటి మట్టం 291 అడుగుల వద్ద నిలకడగా ఉండటంతో ఖరీఫ్ అవసరాలకు సాగునీటి సమస్య ఉండదని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రేంజ్ పరిధిలో
11 మంది సిఐలకు స్థాన చలనం
విశాఖపట్నం, మే 16: విశాఖ రేంజ్ పరిధిలోని పలువురు సిఐలకు స్థాన చలనం కలిగిస్తూ డిఐజి స్వాతిలక్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని ఇంటిలిజెన్స్‌లో ఉన్న సిఐ పి.కోటేశ్వరరావును నగరానికి బదిలీ చేశారు. విశాఖలోని సిఐడి విభాగంలో ఉన్న సిఐలు పి.వి.వి.నరసింహరావు, ధనుంజయనాయుడు, తిరుపతిరావులను కూడ సిటీకి బదిలీ చేశారు. అలాగే డిఐజి కార్యాలయంలో వి.ఆర్.లో ఉన్న బి.మోహనరావును, పొత్తూరు సిఐ ఎడమ్స్‌ను నగరానికి బదిలీ చేశారు. విజయనగరం జిల్లా ఎల్విన్‌పేట పోలీసు స్టేషన్‌లో సిఐగా విధులు నిర్వహిస్తున్న పి.ఈశ్వరరావు, స్పెషల్‌బ్రాంచ్‌లో ఉన్న సిఐ జెఎస్‌ఎన్ కొండ లను విశాఖ సిటీకి బదిలీ జరిగింది. జిల్లాలోని అనకాపల్లి పోలీసు స్టేషన్‌లో సిఐగా విధులు నిర్వహిస్తున్న సిఐ గోవిందరావును డిఐజి కార్యాలయంలోని వి.ఆర్.లో ఉంచారు. అరుకు సిఐ జి.శ్రీనివాసరెడ్డిని అనకాపల్లి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయగా, విశాఖ సిటీలోని వి.ఆర్.లో ఉన్న వై.మురళీరావును అరకు సిఐగా బదిలీ చేశారు.
‘అక్షరాస్యత....ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత’
విజయనగరం , మే 16: జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి శతశాతం అక్షరాస్యత సాధనకు కృషి చేయాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ల వయస్సు దాటినవారిని ప్రాథమిక అక్షరాస్యులు తీర్చిదిద్దేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి 7.39 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. మొదటిదశలో 1.50లక్షల మందిని, రెండోదశలో 4.50 లక్షల మందిని సాక్షరభారత్ కార్యక్రమం ద్వారా ఓపెన్ స్కూల్ పరీక్షలకు పంపగా, 88.65శాతం ఉత్తీర్ణత సాధించారని గుర్తు చేశారు. అయితే గత 18 ఏళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ జిల్లా 22వస్థానంలో ఉంటడం ఆందోళనకరమన్నారు. ఆగస్టులో నిర్వహించనున్న ఓపెన్‌స్కూల్ పరీక్షకు మిగిలిన 1.39 లక్షల మందిని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా తీర్చిదిద్దాలన్నారు. జాయింట్ కలెక్టర్ పిఎ శోభ, అదనపుజాయింట్‌కలెక్టర్ యుజిసి నాగేశ్వరరావు, జెడ్పీ సిఇఒ మోహన్‌రావు, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ అంబేద్కర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతి, డ్వామా పిడి శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘వ్యవసాయ ఉపకరణాలను
సద్వినియోగం చేసుకోండి’
గంట్యాడ, మే 16 : వ్యవసాయ పనిముట్లు సేవా కేంద్రం క్రింద సబ్సిడీతో ఇస్తున్న వ్యవసాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాశాఖ సహాయ సంచాలకులు ఎల్. విజయ అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతు సంఘాలకు 2 లక్షల రూపాయల రాయితీతో కూడిన 6 లక్షలు విలువైన వ్యవసాయ పరికరాలను గురువారం ఆమె పంపిణీ చేశారు. కొండతామరాపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ రైతు గ్రూపునకు పవర్ టిల్లర్లు, దుక్కు సెట్టు, తార్పాన్లు, 82,095 రూపాయలు రాయితీతో అందజేశారు. అలాగే గింజేరు శివశంకర్ రైతుసంఘానికి పవర్‌టిల్లర్లు, టెంటు పరదారు, స్పెయర్లు, దుక్కు సెట్టు, 70 వేల రూపాయల రాయితీతో అందజేసారు. బొనంగి బూలోక మాత సంఘానికి పవర్‌టిల్లర్, దుక్కు,దమ్ముసెట్లు, రాయితీతో అందజేశారు. చినమానాపురం, కిట్టుపర్తి, నీలావతి, గ్రామాలకు చెందిని రైతులకు టార్పాలిన్లు అందజేసారు. మండల వ్యవసాయాధికారి బి.శ్యామ్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి పాల్గొన్నారు.
‘సహకార చట్టాలపై అవగాహన అవసరం’
బొబ్బిలి, మే 16: సహకార చట్టాల పట్ల పి.ఏ.సి.ఎస్. సభ్యులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవల్సిన అవసరం ఉందని డి.సి.సి.బి. చైర్‌పర్సన్ తులసి కోరారు. స్థానిక వెలమ సంక్షేమ సంఘం భవనంలో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల నిర్వహణ, అభివృద్ధి, తదితర విషయాలపై అవగాహన పెంపొందించుకుని రైతులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా డి.సి.సి.బి. సి.ఇ.ఒ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధిపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ప్రస్తుతం సహకార సంఘాల పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ ప్రాంతీయ విద్యాధికారి కె.శ్రీనివాసరావు, సహకార శిక్షణా కళాశాల అధ్యాపకులు ఆర్.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావులతోపాటు డి.సి.సి.బి. డైరెక్టర్లు సింహాచలంనాయుడు, చిట్టిబాబు, మల్లేశ్వరరావు, డి.సి.ఎం.ఎస్. వైస్ చైర్మన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’
గజపతినగరం, మే 16 : జగన్ జైలు నుండి బయటికి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయనే ఉద్దేశ్యంతోనే బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని వైకాపా నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్సార్ సిపి నేత షర్మిల పాదయాత్ర చేపట్టి గురువారానికి 2000 కిలోమీటర్లకు చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సంఘీభావం తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి కార్యకర్తలు, నాయకులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండి ఎదుర్కొవడానికి సైనికుల్లా పనిచేయాలన్నారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైకాపా నాయకులు డా.ఎస్.పెద్దినాయుడు మక్కువ శ్రీ్ధర్, శీరంరెడ్డి శారదానాయుడు, మిత్తిరెడ్డి వెంకటరమణ, గార రమణ, గుంట్రోతు గోవింద, మిత్తిరెడ్డి గౌరినాయుడు పాల్గొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు
english title: 
welfare

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>