Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

$
0
0

ఇందూర్, మే 15: రాష్ట్ర మంత్రివర్గం నుండి కళంకిత మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోఆందోళన చేపట్టిన బిజెపి నాయకులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్జి, అరెస్ట్‌లను నిరసిస్తూ బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగరంలోని దేవి థియేటర్ చౌరస్తాలో బిజెవైఎం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మతో ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిజెవైఎం రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి మంత్రివర్గంలో కొనసాగుతన్న కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకవైపు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, క్యాబినెట్‌లోని కొంతమంది మంత్రులు కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలుస్తుండటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలన వల్ల అటు దేశంలో, రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలు, 2జీ స్పెక్టమ్, కామన్‌వెల్త్ క్రీడలు వంటి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కళంకిత మంత్రులను క్యాబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన బిజెపి నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు న్యాలం రాజు, ఆనంద్‌రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు
పనులు రద్దు చేసి ఇతరులకు అప్పగించాలని మంత్రి ఆదేశం
నిజామాబాద్, మే 16: ప్రజోపయోగ పనులను చేపట్టే విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించే కాంట్రాక్టర్లను ఎంతమాత్రం ఉపేక్షించబోమని మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. గడువు ముగిసినా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను గుర్తించి, వారితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ఆ పనులను ఇతరులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంత్రి సుదర్శన్‌రెడ్డి సమీక్ష జరిపారు. తాగునీటి పథకాల పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతుండడం, గిడ్డంగుల నిర్మాణాల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, పనుల్లో తాత్సారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సకాలంలో పనులు పూర్తయినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు సమకూరుతాయని, ఈ దిశగా అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను తొలగించి, వారి స్థానంలో ఇతరులకు ఆ పనులు కేటాయించాలన్నారు. నాణ్యత విషయంలోనూ రాజీకి తావులేకుండా పనులు చేపట్టాలని, నాసిరకం పనులు చేపడితే గుత్తేదార్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో మంచినీటి పథకాలను మంజూరు చేస్తే, ఇప్పటికీ అనేక చోట్ల పనులను పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టే విషయంలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, వాటిని సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మంచినీటి పథకాల పనులకు ఉపయోగించే పైపుల నాణ్యతను స్థానికంగా కూడా పరిశీలన జరపాలని, నాణ్యతతో కూడిన వాటినే వినియోగించేలా అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా పైపులు లీకేజీకి గురైతే సంబంధిత గుత్తేదారు, అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీటి పథకాల పనుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను సమకూర్చుకునేందుకు అధికారులు ఎంతో జాగ్రత్తగా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల పేరుతో ఇసుక నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఏ ప్రాంతంలో, ఏ పని కోసం ఇసుకను వినియోగిస్తున్నారు, ఏ వాహనంలో ఎన్ని ట్రిప్పులు తరలించాలనేది అనుమతి పత్రంలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. నిర్దేశించిన పని కోసం కాకుండా ఇతర పనులకు ఇసుకను తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయాలని జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్‌కు సూచించారు. కాగా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గిడ్డింగులను వచ్చే ఆగస్టు మాసం నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున గోడౌన్లను మంజూరు చేయగా, కేవలం 12 మండలాల్లో మాత్రమే రూఫ్ లెవల్ స్థాయికి చేరాయని, మిగతాచోట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని అన్నారు. పనులను వేగవంతం చేయిస్తూ ఆగస్టు మాసం కల్లా వీటిని పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు, గుత్తేదార్లతో లిఖితపూర్వకంగా రాయించుకోవాలని ఎస్‌ఇని ఆదేశించారు. గిడ్డంగుల నిర్మాణాలపై ప్రతి పక్షం రోజులకోసారి సమీక్ష జరపాలని జె.సికి సూచించారు. సమీక్షా సమావేశంలో పంచాయితీరాజ్ ఎస్‌ఇ శంకరయ్య, హౌసింగ్ పిడి రమేష్, డ్వామా పిడి శివలింగయ్యతో పాటు వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి

హౌసింగ్ ప్రగతిపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, మే 16: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద విరివిగా ఇళ్లను మంజూరు చేస్తున్నప్పటికీ, గృహ నిర్మాణాల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదని కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులను కలుసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని, వారికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆదేశించారు. గురువారం స్థానిక ప్రగతిభవన్‌లో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ పథకం, ఇతర పథకాల కింద ఇప్పటివరకు 2.01 మందికి ఇళ్లను మంజూరు చేయగా, వారిలో కేవలం 1.12 లక్షల మంది మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని అన్నారు. మరో 25,500 గృహాలు వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇంకా 63,739 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులు అసలే ప్రారంభించలేదని పేర్కొన్నారు. సదరు లబ్ధిదారులను కలుసుకుని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని, ప్రభుత్వపరంగా అందిస్తున్న సహాయ, సహకారాల గురించి అవగాహన కల్పిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. అప్పటికీ లబ్ధిదారులు ముందుకు రాకపోతే వారి పేరిట ఉన్న ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను రద్దు చేసే, అర్హులైన ఇతరులకు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై ముందుగా లబ్ధిదారులకు వివరిస్తూ, వారికి నోటీసులు జారీ చేసిన మీదట నివేశన స్థలాలను రద్దు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచిందనే విషయాన్ని వివరించాలని, బ్యాంకుల ద్వారా త్వరితగతిన రుణాలు మంజూరయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు అవసరమైన గృహ నిర్మాణ సామాగ్రిని సమకూర్చేందుకు అధికారులు సహాయ, సహకారాలు అందించాలన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో హౌసింగ్ పి.డి రమేష్‌తో పాటు ఇ.ఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీరాంసాగర్‌ను సందర్శించిన ఆక్టోపస్ బృందం

బాల్కొండ, మే 16: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైనా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును గురువారం ఆక్టోపస్ బృందం సందర్శించింది. ఆక్టోపస్ డిఎస్పీ సాయిప్రసాద్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం డ్యామ్ పైకి చేరుకుని, ప్రాజెక్టును, ప్రాజెక్టు గేట్లను పరిశీలించి మాక్‌డ్రిల్ నిర్వహించారు. అనంతరం కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాల్వలను పరిశీలించి భద్రత పరంగా చేపట్టాల్సిన పలు అంశాలను వారు పరిశీలించారు. ఈ బృందం వెంట ఆర్మూర్ సిఐ రవికుమార్, బాల్కొండ ఎస్‌ఐ ప్రతాపలింగంలు ఉన్నారు.

మహిళా సంఘాలకు 420 కోట్ల రుణాలు

పిడి వెంకటేశం

డిచ్‌పల్లి రూరల్, మే 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఐకెపి మహిళా సంఘాలకు 420 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం తెలిపారు. మండల కేంద్రంలోని టిటిడిసిలో గురువారం మహిళా సంఘాలు, ఐకెపి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్యాంకు లింకేజీ ద్వారా లింకేజీ రుణాలు మంజూరరు చేయిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నిధులను మహిళా సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిడి ఆకాంక్షించారు. అదేవిధంగా కిరాణాషాపులు, చిన్నచిన్న వ్యాపారులు చేసుకునేందుకు సైతం బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. బ్యాంక్ లింకేజీ రుణాలతో పాటు స్ర్తినిధి, రాజీవ్ ఉద్యోగశ్రీ, సుస్థిర వ్యవసాయంపై అవగాహన కల్పించడం వల్ల ప్రజలను మంచి స్పందన వస్తోందన్నారు. జిల్లాలోని ఐకెపి సిబ్బంది గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యపర్చుతూ, వారి అభివృద్ధి నివేదికలను ఎప్పటికప్పుడు కార్యాలయానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

స్వయం సహాయక సంఘాల్లో
ఎస్సీ, ఎస్టీ మహిళల సభ్యత్వం తప్పనిసరి
ఐకెపి ప్రాంతీయ సమన్వయకర్త సుధాకర్

మాచారెడ్డి, మే 16: ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాల నుంచి ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో తప్పనిసరిగా సభ్యత్వం కలిగి ఉండాలని ఐకెపి సమన్వయకర్త సుధాకర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన పిఓపి సిఎల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిఎలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఎస్‌సి, ఎస్‌టి కుటుంబానికి చెందిన మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం కలిగి ఉండేలా చైతన్యం చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే వారితో కొత్త సంఘం ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల చివరి వరకు సభ్యత్వం లేని మహిళలతో సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు తీసుకున్న రుణాలు ఆదాయవృద్ధి కోసం ఉపయోగించుకునే విధంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. జీవనోపాదులైన గొర్రెలు, మేకలు, గేదెలు, కోళ్లు పెంపకం, కౌలు కిరాణా, కూరగాయల వ్యాపారం నిర్వహించుకునే విధంగా వారిని చైతన్యం చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలు ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎపిఎం శ్రీనివాస్, పిఓపి ఎపిఎం రాజెందర్, ఐకెపి ఎపిఎం రాజయ్య, సమాఖ్య అధ్యక్షురాలు రాజమణి, కార్యదర్శి షెహనాజ్, ఉపాధ్యక్షురాలు శోభ, మాచారెడ్డి, సదాశివనగర్, దోమకొండ మండలాలకు చెందిన సిఎలు, సిబ్బంది పాల్గొన్నారు.

నేటినుండి ఏర్గట్లలో అయ్యప్ప ఆలయ ప్రతిష్ఠ

మోర్తాడ్, మే 16: మండలంలోని ఏర్గట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఈ నెల 17 నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు అయ్యప్ప సేవా సమితి, గ్రామ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీ జగద్గురు శంకరాచార్య పరమహంస హంపి నిరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అయ్యప్పస్వామి త్రాయహ్నిక ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 17న మహాగణపతి పూజ, పుణ్యావచనం, శోడశోపచారపూజ, చతుర్వేద అవధార సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 18న భగత్‌ప్రార్థన, విశేష సంకల్పం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, వాస్తుపూజ, అగ్నిప్రతిష్ఠ, దేవతాహ్వానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని సేవా సమితి తెలిపింది. ఆదివారం మహాగణపతి పూజ, దేవతా అవనము, నవగ్రహ పంచసూక్త రుద్రహోమం, చండీహోమం, సుదర్శనహోమం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదే రోజున రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం వేకువజామున 5.49 నిమిషాలకు యంత్రప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, బలిహరణం, పూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని కమిటీ పేర్కొంది. ఆలయ ప్రతిష్ఠ తర్వాత చక్రవర్తుల పురుషోత్తమచార్యులచే మహాపడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులు గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో చేపట్టే ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి అన్నపూర్ణమ్మ, యెండల లక్ష్మినారాయణ తదితరులతో పాటు రాష్టస్థ్రాయి నేతలు కూడా హాజరవుతున్నారు. ఈ ప్రతిష్ఠాపన ఉత్సవానికిగాను 108 మంది భక్తులు అయ్యప్పమాల ధరించి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు. ప్రజలు, భక్తులు, ఆయా గ్రామాల అయ్యప్ప సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను జయప్రదం చేయాలని కమిటీ కోరింది.

ఇందిరమ్మ కాలనీ సమస్యలు పరిష్కరించాలని
ఎఐకెఎంఎస్ ధర్నా

మోర్తాడ్, మే 16: మోర్తాడ్‌లోని ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కార్యాలయం ఎదుట ఎఐకెఎంఎస్ నాయకులు గురువారం ధర్నా చేపట్టారు. బస్టాండ్ నుండి ర్యాలీగా తరలివెళ్లిన కార్యకర్తలు, కాలనీవాసులు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఎఐకెఎంఎస్ జిల్లా కార్యాదర్శి సారా సురేష్, పిఓడబ్ల్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు భాగ్య మాట్లాడుతూ, పేదలకు నివాస వసతి కల్పిస్తామని ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం సరిపడా వసతులు కల్పించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మోర్తాడ్‌లో రెండు కాలనీలు ఏర్పాటు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండేలా ఇండ్లు నిర్మించారని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, మురుగునీటి కాల్వల వంటి వౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల కల్పనకై లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేశామని ఆరు మాసాల క్రితం అధికారులు ప్రకటించారని, ఇప్పటి వరకు కనీసం పైపులైన్లు కూడా వేయలేదని ఆరోపించారు. కాలనీ ఏర్పాటైన నాటి నుండి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నా పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారే తప్ప, ఆచరణలో విఫలమవుతున్నారని అన్నారు. ఈ మేరకు ఎంపిడిఓ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఎంపిడిఓ ప్రవీణ్‌కుమార్ 15 రోజుల్లో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, కిషన్, నాయకులు భూమయ్య, సత్తెక్క, లక్ష్మితో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.

అష్టముఖి కోనేరులో ఉదకశాంతి పూజ

ఇందూర్, మే 16: ఎడపల్లి మండలం జానకంపేట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయం సమీపంలోని అష్టముఖి కోనేరులో ఈ నెల 6వ తేదీన జల్లపురం నర్సయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా, గురువారం ఉదకశాంతి పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు అనిల్‌శర్మ తెలిపారు. ముందుగా కోనేరులోని నీరంతా బయటకు తీయించడం జరిగిందన్నారు. అనంతరం సుదీంద్రచారి, అనిల్‌శర్మ, కొండమాచార్యుల ఆధ్వర్యంలో ఉదకశాంతి పూజను నిర్వహించారు. ఈ పూజను చేపట్టడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, బ్రహ్మపూజ జరిగి శాంతి చేకూరుతుందని పూజారులు వివరించారు.

శ్రీరామ జమనామ యజ్ఞం

బోధన్, మే 16: పట్టణంలోని షర్బతికేకెనాల్ ఏరియాలో గల మహాలక్ష్మి దేవాలయ కల్యాణ మండపంలో గురువారం బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శ్రీరామ జపనామ మహాయజ్ఞం జరిగింది. ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన యజ్ఞంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ జయరామ జయజయరామ అంటూ శ్రీరాముడిని జపిస్తూ యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి హాజరై యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ రామనామ జపం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించేందుకు ఈ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ హిందువు దేవాలయానికి వెళ్లి భగవంతుడిని ప్రార్థించాలని, భగవంతుడిని కొలిచిన వారికి ఎటువంటి ఇబ్బందులు రావన్నారు. భక్తి మార్గాన్ని విస్మరిస్తే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇప్పటికే హిందూ దేవాలయాలను నామరూపాలు లేకుండా అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని, హిందువులు భరించలేనటువంటి అనుమానాలు జరుగుతున్నాయని వీటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రజలతో పాటు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ నాయకులు సురేందర్‌రెడ్డి, ఆకారపు కేశవరాజు, కోటేశ్వర్‌రావు, బజరంగ్‌దళ్ ప్రతినిధులు గోపికిషన్, హరికృష్ణ, ప్రీతం, లింగం బిజెపి పట్టణాధ్యక్షుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం
జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు ఆదేశం

బోధన్ రూరల్, మే 16: గ్రామాల వారీగా ఓటరు జాబితాలు సర్వం సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్‌లు, ఎంపిడివోలు, ఎఎస్‌వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ జాబితాలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ వారీగా ఓటరు జాబితాలు రూపొందించారని, ప్రస్తుతం వాటిని గ్రామాల వారీగా మార్చాలని సూచించారు. గ్రామాల వారీగా వెళ్లి ఇంటింటి సర్వే చేసినట్లయితే గ్రామాల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయవచ్చన్నారు. ఈ జాబితాలపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాల్సి ఉందన్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. తహశీల్దార్‌లు, ఎంపిడివోలు, ఎఎస్‌వోలు ఈ జాబితాలను పరిశీలించి నూతన జాబితాలను త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మండలాల వారీగా జాబితాల గురించి తహశీల్దార్‌లను అడిగి తెల్సుకున్నారు. ఇందులో ఆర్డీవో మోహన్‌రెడ్డి, డివిజన్ పంచాయతీ అధికారి హనోఖ్, ఆయా మండలాల తహశీల్దార్‌లు, ఎంపిడివోలు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్లనే మతమార్పిడిలు
తీరుమారకుంటే ఎండోమెంట్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపడతా
హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి

బోధన్, మే 16: రాష్ట్రంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని హిందు దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. గురువారం బోధన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలలో దూప, దీప, నైవేద్యాల పథకాన్ని రద్దు చేయడం వలన అనేక దేవాలయాలలోని అర్చకులు బజారున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడులు మూతపడటం వలన హిందువులు తమ బాధలను భగవంతునికి చెప్పుకోలేక, ప్రార్థనలు చేయలేక మతమార్పిడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనికి పరోక్షంగా దేవాదాయ శాఖయే కారణమని అన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించేందుకు, ఆయా దేవాలయాలలో గోవులను హిందూ ధర్మ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు దేవాదాయ శాఖకు నెల రోజులు గడువు ఇస్తున్నామని సంబంధిత మంత్రి స్పందించనట్లయితే రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు పూనుకుంటానని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, వేములవాడలో భక్తులు వదులుతున్న కోడెలను కబేళాలకు తరలిస్తున్నారని, తాజాగా సింహాచలంలో 150 గోవులు ఒకేరోజు చనిపోయాయని వివరించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రయ్య కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, ఇప్పటివరకు దేవాలయాల పరిరక్షణ కోసం ఆయన ఎటువంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేక పోయారని అన్నారు. గోవుల రక్షణ కోసం ప్రత్యేక ట్రస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. అర్చకుల జీవితాలు కూడా దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులను అణచివేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలలో అటువంటి ప్రభుత్వాన్ని హిందువులు ఎన్నుకోవాలన్నారు. అయోధ్య రామాలయం కోసం అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. రామాలయ నిర్మాణం కోసం దేశమంతటా శ్రీరామ జప మహాయజ్ఞాలు చేయాలని ధర్మసంతులు నిర్ణయం తీసుకున్నారని అందువల్లనే అన్ని చోట్ల నేడు ఈ యజ్ఞాలు జరుగుతున్నాయని వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరుని దేవాలయాల భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారని కమలానంద భారతి స్వామి ఆరోపించారు. ఈ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో లింగేశ్వర గుట్ట ఆశ్రమ స్వామి శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్లక్రిష్ణ మహారాజ్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, విహెచ్‌పి ప్రాంత సంఘటన కార్యదర్శి ఆకారపు కేశవరాజు, బోధన్ ప్రఖండ అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు, గోపికిషన్ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలను సందర్శించిన ఎంసిఐ ప్రతినిధుల బృందం

సదుపాయాల కల్పనపై నిశితంగా పరిశీలన

ఎంసిఐ ప్రతినిధులతో మంత్రి, కలెక్టర్ భేటీ
నిజామాబాద్, మే 16: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన జనరల్ హాస్పిటల్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ)కు చెందిన ముగ్గురు అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం సందర్శించింది. రెండు రోజుల తమ పర్యటనలో భాగంగా మొదటిరోజైన గురువారం భవన సముదాయం, ఆసుపత్రిలోని అన్ని విభాగాలు తిరుగుతూ అక్కడి సదుపాయాల పరిశీలన జరిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఆయా విభాగాల వారీగా ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగింది. అంతకుముందు జిల్లాకు చెందిన మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ ఎంసిఐ బృందానికి స్వాగతం పలుకుతూ, స్థానికంగా ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాలను సమకూర్చడం తదితర అంశాలను వారి దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంసిఐ ప్రతినిధులు అన్‌టోమో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బిసి.దత్తా, భాగల్‌పూర్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఠాకూర్, అలహాబాద్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాద్రీలతో కూడిన బృందం ఆసుపత్రిలోని ఒక్కో విభాగాన్ని సందర్శిస్తూ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో ఎంతమంది వైద్యాధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు, వారి విధులేమిటి, వివిధ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ రికార్డులను పరిశీలించారు. తమవెంట తెచ్చుకున్న చెక్‌లిస్టు ప్రకారం ఎంసిఐ నిబంధనలకు లోబడి వసతి, సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనే అంశాలను గమనించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆసుపత్రిలోని గైనకాలజీ, రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్, డిజిటల్ స్కానింగ్, ఫిజియోథెరపి, జనరల్ వార్డు, ఎక్స్‌రే ఇత్యాది విభాగాలను సందర్శించి అక్కడి పరికరాలను తనిఖీ చేశారు. పలువురు రోగులను పలకరిస్తూ, స్థానికంగా అందిస్తున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. పాథలాజికల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది వద్దకు వెళ్లి రక్త నమూనాలను సేకరించే విధానం గురించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రతి వార్డులో అత్యవసర మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని, గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అహ్లాదకరమైన వాతావరణంలో వైద్య సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలలో తరగతి గదులు, సెమినార్ హాల్, విద్యార్థుల కోసం నిర్మించిన వసతి గృహాలు, లంచ్‌రూమ్, లైబ్రరీ, ల్యాబ్‌లు, మ్యూజియం, శవ పరీక్షల గది తదితర వాటిని పరిశీలించారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రి పరిసరాలను సైతం నిశితంగా గమనించారు. ఎదురెదురుగా ఉన్న మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు మధ్య రాష్టప్రతి రోడ్డు అడ్డంకిగా ఉండడంతో, ఈ సమస్యను అధిగమించేందుకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సైతం పరిగణలోకి తీసుకున్నారు. పరిశీలన పూర్తయిన అనంతరం ఎంసిఐకు నివేదికను సమర్పిస్తామని డాక్టర్ బిసి.దత్తా విలేఖరులతో పేర్కొన్నారు.
అడుగడుగునా జాగ్రత్తలు చేపట్టిన జిల్లా యంత్రాంగం
కాగా, వైద్య కళాశాల పరిశీలన నిమిత్తం ఎంసిఐ బృందం హాజరైన క్రమంలో జిల్లా యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంది. ఏ చిన్న లోటుపాట్లు కనిపించినా ఎంసిఐ అనుమతిని నిరాకరించే అవకాశాలు ఉండడంతో, అసౌకర్యాలేవీ ఎంసిబి ప్రతినిధుల దృష్టికి రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఒకరోజు ముందుగానే కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లను చక్కబెట్టగా, శానిటేషన్ వంటి సమస్యలు తెరపైకి రాకుండా పరిసరాలను శుభ్రం చేయించారు. ప్రధానంగా మెడికల్ కళాశాల, ఆసుపత్రికి మధ్య రాష్టప్రతి రోడ్డు ఎల్లప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుండడంతో, ఎంసిఐ బృందం హాజరైన సందర్భంగా ఈ మార్గంలో పయనించే వాహనాలను దారిమళ్లించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించడం ద్వారా బస్సులు, ఆటోరిక్షాలను ఇతర మార్గాల మీదుగా బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలకు తరలించారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు దూరభారాన్ని అధిగమిస్తూ ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలవులపై ఉన్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని ఉన్నపళంగా విధుల్లో చేరేలా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల వెంట ఒకరిద్దరు సహాయకులను మాత్రమే అనుమతిస్తూ వైద్య కళాశాలకు అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్టు ఎంసిఐ బృందం దృష్టికి తెచ్చేందుకు ఆపసోపాలు పడ్డారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుమన్‌చంద్ర, సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, ఆర్‌ఎంఓ రవూఫ్‌తో పాటు ఇతర అధికారులు ఎంసిఐ బృందానికి వెన్నంటి ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

‘సెజ్’ భూమిలో పరిశ్రమల స్థాపన ఎప్పుడో...?

ఐదేళ్లు పూర్తికావస్తున్నా జాడలేని పరిశ్రమలు
నందిపేట, మే 16: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రైతులకు చెందిన 430 ఎకరాల సాగుభూములు గడిచిన ఐదేళ్ల కాలంగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పితే వందలాది మందికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సెజ్ చట్టం కింద భూములను స్వాధీనం చేసుకుని బడా కంపెనీలకు ధారాదత్తం చేయగా, ఇప్పటివరకు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపించి మారుమూల ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ హాజరుకాగా, ఇక్కడ సెజ్‌కు కేటాయించిన భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. కనీసం సిఎం చొరవతోనైనా పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభమవుతాయా లేక మరింత జాప్యం జరుగుతుందా అన్నది సందిగ్ధంగానే మారింది. మరోవైపు సెజ్ కింద కేటాయించిన భూముల్లో పరిశ్రమలు పెట్టకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని ఇటీవలే ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. ఈ హెచ్చరికలతోనైనా పరిశ్రమను ఏర్పాటు చేస్తే, ఆశించిన ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంటుంది. నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం సెజ్ పేరిట 430 ఎకరాల సాగు భూమిని గత నాలుగున్నరేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు 6 వేల మంది స్థానికులకు, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించి బతుకుదెరువు చూపిస్తామని చెప్పిన ప్రభుత్వం, నాలుగున్నరేళ్లు పూర్తయినా, పరిశ్రమల స్థాపన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా భూ నిర్వాసితులు సాగుభూమి లేక, ఉద్యోగాలు, ఉపాధి లేక అర్ధాకలితో రోజులు వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. మండలంలోని లక్కంపల్లి, చింరాజ్‌పల్లి, నందిపేట, బజార్‌కొత్తూర్ గ్రామాల రైతులకు చెందిన 188/1, 189, 432/1-6, 438/16, 17, 48/1 సర్వే నెంబర్లలో గల 429.12 ఎకరాల సాగు భూమిని సెజ్ కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో కేవలం 70 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగతా స్థలమంతా గతంలో పేదకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూమి. దీంతో ఈ స్థలాన్ని ప్రభుత్వం పెద్దగా ప్రతిఘటనలు లేకుండానే పేదల నుండి లాక్కుని పరిశ్రమల స్థాపన పేరిట ‘పెద్దల’కు అప్పగించింది. ఇందుకుగాను భూ నిర్వాసితులకు ఎకరానికి 60 నుండి లక్షా 20 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని మాత్రమే అందించారు. భూములు కోల్పోయిన వారిలో 95 శాతం మంది రైతులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారున్నారు. పరిహారం చెల్లింపుల్లో సైతం రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అనేకమంది రైతులకు నష్టపరిహారం అందలేదు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూములు ఎకరానికి మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు రేటు పలుకుతుంటే, ప్రభుత్వం మాత్రం గరిష్టంగా లక్షా 20 వేలతోనే సరిపెట్టుకుందని పట్టా భూముల రైతులు వాపోతున్నారు. కాగా, భూములను సెజ్ పేరిట స్వాధీనం చేసుకుని ఐదేళ్లు పూర్తి కావస్తుండగా, ఆ స్థలంలో ప్రైవేట్ కంపెనీ వారు చుట్టూ కందకం తవ్వి వదిలేశారు. సెజ్ భూముల్లో ఇంతవరకు సదరు కంపెనీ వారు పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టలేదు.

రాష్ట్ర మంత్రివర్గం నుండి కళంకిత మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని
english title: 
effigy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>