స్వాతంత్య్రం ప్రకటించిన సంవత్సరం లోపుననే భారతదేశపు మొదటి ప్రధాని ఓ చిన్న సంఘటనకు స్పందించి రాజీనామా చేసాడని న్యూయార్క్‌లో మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ ఆచార్యా ఈమధ్యన లండన్‌లోని హార్ట్‌లే లైబ్రరీలో వౌంట్‌బాటన్ ఆర్కివ్‌లో దొరికిన రాజాజీ (మొదటి భారతీయ గవర్నర్ జనరల్) లేఖ ద్వారా గుర్తించాడు. 10, ఆగస్టు 1948 తేదీతోగల ఆ లేఖ మొదటి గవర్నర్ జనరల్ అయిన వౌంట్‌బాటన్‌కు రాయడం జరిగింది. ఆ లేఖలోని సారాంశం- బ్రిటీషు లాయరైన సర్ వాల్టర్ మోన్‌క్టన్ ఏడవ నిజామ్ ఉస్మాన్ అలీ బాషాకు సలహాదారు! నిజాం రాష్ట్రాన్ని స్వతంత్రంగా ఉంచాలా, ఇండియాలో కలపాలా అనే మీమాంసతో నిజాం నాటి బ్రిటీషు రాజైన జార్జ్‌కి సర్ వాల్టర్ ద్వారా ఓ లేఖను పంపడం జరిగింది. వాల్టర్‌కు, వౌంట్ బాటన్‌కు, రాజుకుఉన్న సంబంధాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ లేఖ రాయబడిందనేది ఓ ఊహ! దీనికి జార్జ్ తిరిగి రాసిన లేఖను నిజాంకు పంపించగా, వాల్టర్ సెక్రటరీ ఆ లేఖను సెన్సార్ చేయడంతో, భారతదేశం సర్వసత్తావక దేశంగా (రిపబ్లిక్) రూపుదిద్దుకోక పోవడం, పరోక్షంగా భారతదేశం బ్రిటీషురాచరిక వ్యవస్థ కిందనే కొనసాగుతున్నదని భావించిన నెహ్రూ, ఇలా రాజు రాసిన లేఖ సెన్సార్‌కు గురికావడం నైతికంగా తన తప్పుగా భావించి రాజీనామా చేసాడని, ఆ లేఖ యొక్క మొత్తం సారాంశం. (నేటి నాయకులకు ఈ సంఘటన అవసరంగా భావిస్తూ- చూడు డక్కన్ క్రానికల్ 17, ఏప్రిల్ 2013).
ఒక్కసారి గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలోకి వెళ్ళితే, మొన్నటి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల గందరగోళం లాగానే, కోల్‌గేట్ వ్యవహారం బయటపడింది. అదీ కాగ్ నివేదిక ద్వారా. 90 బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడంతో రెండు లక్షల కోట్లకు పైగా రావాల్సిన ఆదాయంకు గండిపడిందని, పోనీ ధర పలికిన 1,86,000 లక్షల కోట్ల రూపాయలు కూడా రాలేకపోయాయని, అది ఉపరితల బొగ్గు గనులు పనినే ప్రారంభించలేదని కాగ్ తెలిపిన నివేదిక నాడు పార్లమెంటును కుదిపివేసింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఈ ఉపరితల బొగ్గు గనుల అమ్మకాలు (ప్రైవేటు వ్యక్తులకు) ఎన్‌డిఎ కాలంలోనే(1994) మొదలుకావడం. ఎన్‌డిఎ కాలంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులకు 7 గదులను అప్పజెప్పగా రూ. 12,421 కోట్లు నష్టం జరిగిందని ‘కాగ్’ బయటపెట్టింది.
సురేష్ కల్మాడీతో మొదలైన యుపిఎ అవినీతి పాలన పవన్‌కుమార్ బన్సాల్ మేనల్లుడైన విజయసింగ్లాతో చక్కగా రైలు పట్టాలెక్కింది. లంచావతారులను, వెయ్యి, పదివేలతో, లక్షతో చూసాము, గాని ఏకంగా 10 కోట్ల లంచాలిచ్చే అధికారులున్నట్లు పశ్చిమ రైల్వే ఎలక్ట్రికల్ విభాగపు జనరల్ మేనేజర్ పదవిని ఆశించిన మహేశ్‌కుమార్‌తోనే తెలిసింది. మొత్తంగా 17 జోన్లుగల రైల్వేలో 14 లక్షల మంది ఉద్యోగులుండగా, అత్యధిక లాభాలున్న జోన్ ముంబాయి.అందుకే, 90 లక్షల్ని ఇస్తూ సిబిఐకి దొరికిపోయాడు. ఓవైపు కోల్‌గేట్ వ్యవహారంలో పార్లమెంటు స్థంభనకు గురైతుంటే, సందట్లో సడేమియా రైల్‌గేట్ బయట పడడం గమనార్హం. పైగా రైల్వేమంత్రికి బంధువులు చేసే కుంభకోణాలతో సంబంధమేమిటని, ఎందుకు రాజీనామా ఇవ్వాలని అధికార పక్షం కాదు, ఎన్‌డిఎలో భాగస్వామ్య పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షులు శరద్‌యాదవ్ ప్రశ్నిస్తూ పాలకపక్షాన్ని సమర్ధించడాన్నిబట్టి,పాలకపక్షం, ప్రతిపక్షమని కాకుండా, పార్లమెంటు సభ్యులంతా ఒకే తానుగుడ్డలని తేలిపోయింది.
అందుకే వీరంతా లోక్‌పాల్ బిల్లు గూర్చి (హజారే అడుగుతున్న జన లోక్‌పాల్ కాదు) మర్చిపోయారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి గూర్చి నోరు మెదపడం లేదు. కారణం- ఎన్‌డిఎ హయాంలో కూడా సిబిఐని ఎన్‌డిఎని వ్యతిరేకించిన వారిపైన మాత్రమే ప్రయోగించారు. నేడు జరుగుతున్నది అదే! అందుకే ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎక్కడ ఓటు వేయాల్సి వస్తుందో అని భావించిన బిఎస్‌పి (మాయావతి తాజ్ కారిడార్ కుంభకోణాన్నుంచి తప్పించుకోవడానికి), అఖిలేశ్ యాదవ్ (యుపి ముఖ్యమంత్రి), తండ్రి ములాయంసింగ్‌లు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఎక్కడ యుపిఎ సిబిఐచే కొరడా ఝుళిపిస్తుందో అని భావించి, పార్లమెంట్‌ను బహిష్కరించి, యుపిఎ-2 ప్రభుత్వానికి బహిరంగంగా అండగా నిలిచారు. వీరంతా పార్లమెంటేరియన్లు. కింది సామాజిక వర్గాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులు? నాయకులు.
ఇక పాలకపక్షం- తననేమనక పోతే, ఇతరులను ఏమి అనదు. 24 స్పెక్ట్రం కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధంగల నాటి డిఎంకె మంత్రి ఎ.రాజా అరెస్టు, తర్వాత ఆడబిడ్డ ఎంపి కనిమోజి అరెస్టుతో అగ్గిబుగ్గైతున్న కరుణానిధి అవకాశంకోసం ఎదురుచూస్తూ, శ్రీలంక తమిళులపై ఆ దేశ సైన్యం చేస్తున్న దారుణాల్ని భద్రతా కౌన్సిల్లో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చి, భంగపడి యుపిఎ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో స్టాలిన్ ఆస్తులపై వెంటనే సిబిఐచేదాడి చేయించడాన్ని బట్టి చూస్తే నిజంగానే సిబిఐ పాలక పక్షపు పంజరంలో చిలుకనే! అందుకే కోల్‌గేట్ స్టాటస్‌కో రిపోర్టును న్యాయశాఖామంత్రి అశ్వనీకుమార్‌కు, అటార్నీ జనరల్ వాహనవతికి, అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్‌కు, ప్రధానమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శులకు, గనుల మంత్రిత్వశాఖ అధికారులకు చూపించి, మరీ సుప్రీంకోర్టుకు సిబిఐ డైరెక్టర్ రంజన్ సిన్హా సమర్పించాడంటే, సిబిఐ వ్యక్తిత్వ మెంతనో తెలుస్తున్నది. పొరపాటు జరిగింది, క్షమించాలి, ఇక నుంచి ఇలాంటి పొరపాటు చేయనని సిన్హా తన నిస్సహాయతను వెలిబుచ్చడం రాజకీయ పారదర్శకతకు నిదర్శనం!
మన పార్లమెంట్‌కు ఎన్ని గేట్లు (లోపలికి పోవడానికి) న్నాయో తెలియదు. ఎందుకంటే ఎవరికి నిర్ణయించిన గేటు గుండా వారు మాత్రమే పోతారు కాబట్టి! ముంబ యికి గేట్‌వే ఆఫ్ ఇండియా ఉన్నట్టు, ఢిల్లీకి ఇండియాగేట్ ఉన్నట్టు, జైపూర్ నగరానికి ఢిల్లీ గేట్‌తో సహా తదితర గేట్లు ఉన్నట్లు, మన పార్లమెంటుకున్న గేట్లకుకూడా పేర్లు పెడితే బాగుంటుంది. అందులో కామనె్వల్త్ గేట్, 24 స్పెక్ట్రం గేట్, కోల్‌గేట్, రైల్‌గేట్ అంటూ, ప్రధాన గేటుకు వౌనముని గేట్ అని పేరు పెడితే చిరకాలం జ్ఞాపకం ఉంటాయి. రాబోయే తరాలన్నా నిన్నటి సంఘటనల్ని జ్ఞప్తికి తెచ్చుకొని జాగ్రత్త పడుతాయి. లేదంటే అదో పవిత్రమైన ప్రదేశంగానే మిగిలిపోయి, కొంతమందికే పరిమితం అవుతాయి. ఈ దేశ ప్రజలకు పార్లమెంటేరియన్లు, రాజకీయ నాయకులు ఎలాగూ దక్షతగా ఉండలేరని తేలిపోయింది. కనీసం బ్యూరోక్రాట్స్ అన్నా ఈ దేశ ప్రజలకు సేవలందిస్తారా అంటే అదీ అంతంత మాత్రమేనని, సిబిఐ ద్వారా స్పష్టపడింది. ఇప్పుడు చర్చంతా స్వయం ప్రతిపత్తి గూర్చి జరుగుతున్నది. ఈ స్వయం ప్రతిపత్తి కూడా వ్యక్తుల్ని బట్టేనని టిఎన్ శేషన్ ద్వారా, ప్రస్తుత ‘కాగ్’ డైరెక్టర్ వినోద్‌రాయ్ ద్వారా కనపడింది గాని, ఇతరులున్నప్పుడు వాటి ప్రభావం అంతగాలేదనేది ప్రస్తుత ఎన్నికల కమిషన్ తెలుపుతున్నది. అందుకే శేషన్ లాంటి వ్యక్తుల్లాగా, అమెరికా ఎఫ్‌బిఐ మాజీ చీఫ్ జె.ఎడ్గర్ హూవర్ - ఈయన నాటి అమెరికా అధ్యక్షుడైన జాన్‌ఎఫ్ కెనడీ మరియు ఈయన తమ్ముడైన అటార్నీ జనరల్‌గా పనిచేసిన రాబర్ట్ కెనడీల పనివిధానం గూర్చి గూఢాచర్య జరిపేవాడు- లాంటివారు అధికారులుగా ఉంటే కొంతలో కొంత ప్రజాస్వామ్య దేశాలకు మనుగడ ఉంటుంది. లేదంటే మరింతగా భ్రష్టుపట్టి రాజకీయ ధనాస్వామ్య దేశంగా రూపాంతరం చెందుతాయి. మరి కాంగ్రెస్ నాయకులకే నెహ్రూ ఆదర్శం కాకపోతే ఈ ప్రజల పరిస్థితేంటి?
ఫీచర్
english title:
main feature
Date:
Sunday, May 19, 2013